- Home
- Feature
- Tailor Bird: సూది దారం లేకుండా.. ఆకులను అద్భుతంగా కుట్టే పిట్ట.. చిన్న పక్షికి ఇంత తెలివి ఎలా?
Tailor Bird: సూది దారం లేకుండా.. ఆకులను అద్భుతంగా కుట్టే పిట్ట.. చిన్న పక్షికి ఇంత తెలివి ఎలా?
Tailorbird: సూది, దారంతో బట్టలు కుట్టడం అందరికి తెలిసిందే. దాని కోసం టైలర్ దగ్గర ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకుంటారు. కానీ ఎటువంటి ట్రైనింగ్ లేకుండా, అసలు సూది, దారం లేకుండా ఆకుటను కుట్టే పిట్ట గురించి మీకు తెలుసా?
ఆకులను అద్భుతంగా కుట్టే పిట్ట
ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు ఉంటాయి. పక్షులు తమ నివాసాలను ఏర్పాటు చేసుకోవడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తాయి. సాధారణంగా పక్షులు గడ్డిపోచలు, పుల్లలు, చిన్న కొమ్మలను ఉపయోగించి గూళ్లను నిర్మించుకోవడం మనం చూస్తుంటాం. కానీ, మానవుడు సూది దారంతో బట్టలు కుట్టినట్లుగా, చెట్ల ఆకులను ఒకదానికొకటి కలిపి అద్భుతంగా కుట్టి గూడును తయారు చేసే ఒక ప్రత్యేకమైన పక్షి గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. దాన్నే మనం సాధారణంగా 'టీలర్ బర్డ్' లేదా దర్జీ పిట్ట (Tailorbird) అని పిలుస్తాము.
సూది లాంటి ముక్కుతో అద్భుత నిర్మాణం
ఈ చిన్న పక్షి తన గూటిని నిర్మించడానికి ప్రకృతి ప్రసాదించిన తన సన్నని, పొడవుగా ఉండే ముక్కును ఒక సూదిలా ఉపయోగిస్తుంది. చెట్ల ఆకులను ఎంపిక చేసుకుని, వాటి అంచులను దగ్గరకు చేర్చి, సాలీడు నూలు (Spider silk), చెట్ల బెరడు నార, లేదా పత్తి గింజల నుంచి సేకరించిన పీచును దారంగా వాడుతుంది. మనుషులు బట్టలు కుట్టడానికి సూది దారాన్ని ఎలా వాడతాడో, ఈ పక్షి కూడా సరిగ్గా అలాగే ఆకులలో రంధ్రాలు చేసి, ఆ పీచు పోగులతో ఆకులను అత్యంత గట్టిగా కుడుతుంది.
గూడు తయారీ వెనుక కష్టాలు
టీలర్ బర్డ్ ఆకులను కుట్టి ఒక చిన్న సంచిలాంటి ఆకారాన్ని తయారు చేస్తుంది. ఆ ఆకుల మధ్యలో మెత్తటి దూది, ఈకలను ఉంచి గుడ్లు పెట్టడానికి అనుకూలంగా సురక్షితమైన ప్రదేశాన్ని మలుచుకుంటుంది. ఇలా ఆకులను కుట్టడం ద్వారా ఆ గూడు బయటి శత్రువుల కంటికి సులభంగా కనిపించకుండా ఒక సహజమైన రక్షణ కవచంలా మారుతుంది. వర్షాల నుంచి, ఉష్ణోగ్రతల నుంచి వేటగాళ్ల నుంచి తమ గుడ్లను, పుట్టబోయే చిన్న పిల్లలను కాపాడుకోవడానికి ఈ పక్షి ఈ అద్భుతమైన మార్గాన్ని ఎంచుకుంటుంది.
ప్రకృతిలో జీవన పోరాటం
ఈ పక్షులు గూడును నిర్మించడంతోనే వాటి బాధ్యత పూర్తికాదు. ఆ గూటిలో పెట్టే గుడ్లను పొదగడం, ఆ తర్వాత పుట్టే పిల్లలకు కళ్లు కనిపించవు.. ఈకలు లేని చిన్న పిల్లలను సంరక్షించడం ఒక నిరంతర పోరాటం. తల్లిదండ్రులు రోజంతా కష్టపడి కీటకాలను తెచ్చి ఆ పిల్లలకు ఆహారంగా అందిస్తాయి. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలతో పాటు ప్రమాదకరమైన జంతువుల నుంచి ఆ పెళుసైన గూటిని కాపాడుకోవడం నిజంగా సాహసమే. పిల్లలు పెద్దయ్యాక తమ సొంతంగా బతకడం నేర్చుకునే వరకు ఈ ప్రయాణం కొనసాగుతుంది.
ఎక్కడ ఉంటాయి..
టైలర్ పిట్టలు (కామన్ టైలర్‌బర్డ్) ప్రధానంగా భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఉష్ణమండల ఆసియా, ఆగ్నేయాసియా దేశాలలో నివసిస్తాయి. ఇవి సాధారణంగా మనుషుల నివాసాలకు దగ్గరగా ఉండే ఇంటి గార్డెన్లు, పార్కులతో పాటు బాల్కనీలలోని కుండీ మొక్కల పొదల్లో ఎక్కువగా కనిపిస్తాయి.





