భారతదేశంలో ఈ నగరాన్ని 'కండోమ్ రాజధాని' అంటారు.. కారణం ఏంటో తెలుసా.?
Condom Capital of India: దేశంలో ఒక్కో నగరానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అదే ఆ నగరానికి గుర్తింపును తీసుకొస్తుంది. భారత్‌లోని ఓ నగరాన్ని కండోమ్ రాజధానిగా పిలుస్తారని తెలుసా.? ఇంతకీ ఏంటా నగరం? దాని కథేంటో తెలుసుకుందాం.

దేశంలోనే అతిపెద్ద కండోమ్ తయారీ కేంద్రం
భారతదేశంలో అనేక ప్రాంతాల్లో కండోమ్‌ల తయారీ జరుగుతున్నప్పటికీ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఈ రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అందుకే ఈ నగరాన్ని 'కండోమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు. దేశంలోని 10 ప్రముఖ కండోమ్ తయారీ సంస్థల్లో ఆరు సంస్థలు ఇక్కడే ఉన్నాయి. ఈ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన కార్మికులు అందుబాటులో ఉండటంతో ఇక్కడ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందింది. దీంతో ఔరంగాబాద్ కండోమ్ తయారీలో అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందింది.
ప్రతి నెలా 10 కోట్లకు పైగా కండోమ్‌ల తయారీ
ఔరంగాబాద్‌లోని కంపెనీలు ప్రతి నెలా 10 కోట్లకు పైగా కండోమ్‌లను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇక్కడ తయారైన ఉత్పత్తులు యూరప్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియాలోని పలు దేశాలకు చేరుతున్నాయి. మొత్తం 36 దేశాలకు వీటిని ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. ఈ స్థాయిలో ఉత్పత్తి, ఎగుమతులు జరుగుతుండటంతో భారతదేశానికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి గుర్తింపు లభిస్తోంది. మరోవైపు ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 20 వేల మందికి ఉపాధి లభిస్తోంది.
రూ.200 నుంచి రూ.300 కోట్ల వార్షిక వ్యాపారం
కండోమ్ తయారీ పరిశ్రమ కేవలం ఆరోగ్య పరిరక్షణకే పరిమితం కాలేదు. ఇది పెద్ద వ్యాపార రంగంగా కూడా ఎదిగింది. ఔరంగాబాద్‌లోని ఈ పరిశ్రమ వార్షిక వ్యాపారం సుమారు రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. వేలాది మంది కార్మికులు, సాంకేతిక నిపుణులు, ఇతర ఉద్యోగులు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ వివిధ కంపెనీలు ప్రముఖ బ్రాండ్ల కండోమ్‌లను తయారు చేస్తున్నాయి. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా 40 నుంచి 50 రకాల ఫ్లేవర్లలోనూ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
కామసూత్ర బ్రాండ్‌కు కూడా ఇక్కడే తయారీ కేంద్రం
ఔరంగాబాద్‌లో తయారయ్యే ప్రముఖ బ్రాండ్లలో 'కామసూత్ర' కూడా ఒకటి. రేమండ్ గ్రూప్‌కు చెందిన ఈ బ్రాండ్ 1991లో మార్కెట్లోకి వచ్చింది. భారతదేశంలోని ప్రముఖ కండోమ్ బ్రాండ్లలో రెండో స్థానంలో ఉందని గణంకాలు చెబుతున్నాయి. ఈ బ్రాండ్‌కు ఏడాదికి 30 కోట్ల కండోమ్‌ల తయారీ సామర్థ్యం ఉంది. 2023లో ఏకంగా 32 కోట్ల కండోమ్‌లను ఉత్పత్తి చేసినట్లు సమాచారం. అంతేకాదు, చైనా మార్కెట్లోనూ భారతీయ కండోమ్‌లకు మంచి డిమాండ్ ఉందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రతి ఏడాది చైనాకు భారీ స్థాయిలో కండోమ్‌లను ఎగుమతి చేస్తున్నారు.
కేరళ, తమిళనాడు నుంచి రబ్బర్.. ఆటోమొబైల్ హబ్‌గా కూడా గుర్తింపు
కండోమ్‌ల తయారీలో ప్రధానంగా ఉపయోగించే ముడి పదార్థం సహజ రబ్బర్. ఔరంగాబాద్‌లోని పరిశ్రమలకు అవసరమైన రబ్బర్‌ను ప్రధానంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి తీసుకొస్తారు. రబ్బర్ చెట్ల నుంచి సేకరించిన పాల వంటి ద్రవాన్ని ప్రాసెస్ చేసి తయారుచేసే ఈ పదార్థం కండోమ్‌ల తయారీకి ఉపయోగపడుతుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఔరంగాబాద్ ఇప్పటికే ఆటోమొబైల్ పరిశ్రమకు కేంద్రంగా గుర్తింపు పొందింది. బజాజ్, స్కోడా, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ వంటి ప్రముఖ సంస్థలకు ఇక్కడ తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు కండోమ్ తయారీలోనూ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సంపాదించడంతో ఈ నగరం పారిశ్రామికంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.





