- Home
- Feature
- IRCTC PUNYA KSHETRA YATRA: తెలుగు భక్తులకు అదిరిపోయే టూర్ ప్యాకేజీ.. రూ.17,000లతోనే కాశీ, అయోధ్య, ప్రయాగ్ రాజ్ దర్శనం
IRCTC PUNYA KSHETRA YATRA: తెలుగు భక్తులకు అదిరిపోయే టూర్ ప్యాకేజీ.. రూ.17,000లతోనే కాశీ, అయోధ్య, ప్రయాగ్ రాజ్ దర్శనం
IRCTC PUNYA KSHETRA YATRA: పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లోని భక్తుల కోసం ఐఆర్సీటీసీ పుణ్య క్ష్రేత యాత్రను ప్రారంభించింది. కాశీ నుంచి కోణార్క్ వరకు పలు పుణ్య క్షేత్రాలను ఈ టూర్లో భాగంగా దర్శించవచ్చు.

పది రోజుల పాటూ కాశీ యాత్ర
భారతీయ రైల్వే శాఖకు చెందిన ఐఆర్‌సీటీసీ (IRCTC) తెలుగు రాష్ట్రాల యాత్రికుల సౌలభ్యం కోసం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణ ప్యాకేజీని ముందుకు తీసుకువచ్చింది. అయోధ్య-కాశీ: పుణ్య క్షేత్ర యాత్ర విత్ బైద్యనాథ్ ధామ్ పేరిట ప్రసిద్ధ 'భారత్ గౌరవ్' టూరిస్ట్ రైలును అక్టోబర్ 24, 2026 నడపడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 9 రాత్రులు, 10 రోజుల పాటు సాగే ఈ యాత్ర ద్వారా దేశంలోని అత్యంత ప్రాముఖ్యమైన ఆరు పుణ్యక్షేత్రాలను సులువుగా దర్శించుకునే సువర్ణావకాశం భక్తులకు కలుగుతుంది. ఒకే ప్రయాణంలో ఉత్తర భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలతో పాటు ఒడిశాలోని దివ్య క్షేత్రాలను సందర్శించాలనుకునే వారికి ఈ ప్యాకేజీ ఎంతో అద్భుతంగా ఉంటుంది.
రైలు ఆగే స్టేషన్లు
ఈ యాత్ర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. కాబట్టి ప్రయాణికులు తమకు సమీపంలోని స్టేషన్లలో రైలు ఎక్కడానికి లేదా దిగడానికి విస్తృతమైన బోర్డింగ్ సదుపాయాలు కల్పించారు. సికింద్రాబాద్ జంక్షన్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం జంక్షన్ల గుండా వెళ్తుంది. మీకు నచ్చిన చోట నుంచి రైలు బుక్ చేసుకుని ఎక్కవచ్చు. ప్రయాణికుల ఆర్థిక స్థోమతను బట్టి మూడు రకాల తరగతులను ఐఆర్‌సీటీసీ అందుబాటులో ఉంచింది. ఎకానమీ (స్లీపర్) తరగతికి రూ. 17,000, స్టాండర్డ్ (3ఏసీ) తరగతికి రూ. 26,400, అలాగే కంఫర్ట్ (2ఏసీ) తరగతికి రూ. 34,400 చొప్పున ఒక్కొక్కరికి ధర నిర్ణయించారు. పిల్లలకు కూడా తగిన రాయితీతో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
ఏమేం దర్శించవచ్చు?
ఈ ప్యాకేజీలో భాగంగా భక్తులు వారణాసిలో ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయం, కారిడార్, విశాలాక్షి అమ్మవారు, అన్నపూర్ణా దేవి దర్శనంతో పాటు సాయంత్రం జరిగే దివ్యమైన గంగా హారతిని తిలకించవచ్చు. అలాగే అయోధ్యలో శ్రీరామ జన్మభూమి, హనుమగర్హి,ప్రయాగ్‌రాజ్‌లో పవిత్ర త్రివేణి సంగమ స్నానం, జార్ఖండ్‌లోని బైద్యనాథ్ ధామ్ జ్యోతిర్లింగం, ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శించే అరుదైన అవకాశం లభిస్తుంది. రైలు ప్రయాణంతో పాటు వసతి, భోజనం వంటి అన్ని ప్రాథమిక సౌకర్యాలు ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. ఈ టూర్ లో భాగస్వామి కావాలనుకునేవారు ఐఆర్‌సీటీసీ అధికారిక టూరిజం వెబ్‌సైట్ ద్వారా తమ సీట్లను ముందస్తుగా బుక్ చేసుకోవాలి.

