- Home
- Careers
- 8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
8వ వేతన సంఘం సిఫారసులు 2026 జనవరి 1 నుంచి అమలయ్యే అవకాశాలు ఉన్నాయని అనేక రిపోర్టులు చెబుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి.. ఏ స్థాయిలో పెరిగే అవకాశాలున్నాయో తెలుసా?

8వ వేతన సంఘం సిపార్సులు ఎలా ఉంటాయి..?
Government Employees Salary Hike: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే 8వ వేతన సంఘం ఏర్పాటుచేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా దేశాయ్ చైర్ పర్సన్ గా కమీషన్ ఏర్పాటయ్యింది. 2026 జనవరి 1 నుంచి ఈ వేతన సంఘం సిపారసులు అమల్లోకి వస్తాయని రిపోర్టులు చెబుతున్నాయి.
8వ వేతన సంఘం అమల్లోకి వస్తే సర్వీసులో ఉన్న కేంద్ర ఉద్యోగుల అలవెన్సులు, జీతాల్లో పెద్ద మార్పులు వస్తాయి... అలాగే రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ కూడా పెరుగుతుంది. జీతాల పెంపుతో పాటు ద్రవ్యోల్బణం ఆధారంగా కమిషన్ కరవు భత్యం (డీఏ)ను సర్దుబాటు చేసే అవకాశాలున్నాయి.
2026 జనవరి 1 నుండే జీతాల పెంపు
2025 అక్టోబర్‌లో జారీ చేసిన నోటిఫికేషన్‌లో 8వ వేతన సంఘం సిఫార్సులు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే స్పష్టం చేసింది. సాధారణంగా వేతన సంఘాల సిఫార్సులు ప్రతి పదేళ్ల విరామం తర్వాత అమలు చేస్తారు. ఈ సంప్రదాయం ప్రకారం చూసినా 8వ కేంద్ర వేతన సంఘం 01.01.2026 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం అవుతోంది.
ఉద్యోగుల జీతం ఎంత పెరుగుతుందో తెలుసా?
8వ వేతన సంఘం ప్రకారం జీతాల పెంపుదల వివరాలను ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. కానీ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కనీస వేతనం రూ.18,000 నుంచి రూ.51,480కి పెరుగుతుందని కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి.
ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండవచ్చు..?
రక్షణ సిబ్బందితో సహా సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారని మింట్ గతంలో నివేదించింది. 8వ వేతన సంఘం ద్రవ్యోల్బణంతో సహా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ద్రవ్యోల్బణ పోకడలు, వేతనాల్లో తగ్గుదల, ఆర్థిక సామర్థ్యం, విస్తృత పరిహార పద్ధతులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా నిర్ణయించే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 వరకు ఉండవచ్చని చెబుతున్నారు.
8వ వేతన సంఘం రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది..
అయితే కమిషన్ సిఫార్సులను అమలు చేయడానికి ప్రభుత్వం ఇంకా తుది తేదీని ప్రకటించలేదు. కొత్త జీతాలు ఎప్పుడు అమల్లోకి వస్తాయి, ఎంత నిధులు కేటాయిస్తారు అనే నిర్ణయాలు కమిషన్ రిపోర్ట్ సమర్పించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. కమిషన్‌కు తన సిఫార్సులను సమర్పించడానికి 18 నెలల సమయం ఉంది. ఈ రిపోర్ట్ 2027 మధ్య నాటికి వస్తుందని, ఆ తర్వాతే ప్రభుత్వం జీతాలు-పెన్షన్ల సవరణ చర్యలు చేపడుతుందని జాతీయ మీడియా నివేదించింది. కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం ప్రక్రియ పూర్తయితే జనవరి నుంచి బకాయిలతో సహా జీతాలు, ప్రయోజనాలు ఉద్యోగులకు అందుతాయి.

