8th Pay Commission: ఎనిమిదో వేతన సంఘం నుండి 69 లక్షల మంది పెన్షనర్లను తప్పించారా?
8th Pay Commission: ఎనిమిదో వేతన సంఘం గురించి లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వేచి ఉన్నారు. అయితే పెన్షనర్లను మాత్రం తప్పించారనే సమాచారం వచ్చింది. ఇది ఎంతవరకు నిజమో ఇంకా తెలియరాలేదు. ప్రభుత్వం కూడా స్పందించలేదు.

8వ వేతన సంఘంలో మార్పులు జరిగాయా?
కేంద్ర ప్రభుత్వం ఇటీవల 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులు, పదవీవిరమణ తర్వాత లభించే ప్రయోజనాలు వంటి అంశాలను పరిశీలించి సిఫార్సు చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా విడుదలైన టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఒక ముఖ్యమైన అంశం లేకపోవడంతో దేశవ్యాప్తంగా పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిబ్బంది సంఘాల ప్రధాన కమిటీ అయిన నేషనల్ కౌన్సిల్ – జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసింది.
పెన్షనర్లను మర్చిపోయారా?
మనదేశంలో సుమారు 69 లక్షల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ఉన్నారు. వీరి పింఛను కూడా వేతన సంఘం సిఫార్సుల ఆధారంగానే సవరణలు జరుగుతాయి. కానీ తాజాగా ప్రభుత్వం జారీ చేసిన 8వ వేతన సంఘం టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (ToR) లో పెన్షనర్ల గురించి స్పష్టమైన ప్రస్తావన లేదు. దీంతో ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు ఆందోళనపడుతున్నారు. తాము వేతన సంఘం పరిధిలో లేమా అనే సందేహంతో ఎంతోమంది పెన్షనర్లు కేంద్రానికి లేఖలు రాయడం ప్రారంభించినట్టు సమాచారం.
దీంతో నేషనల్ కౌన్సిల్ – జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ నాయకులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఉద్యోగులకే కాకుండా, పదవీవిరమణ చేసిన వారి ప్రయోజనాలు కూడా వేతన సంఘం పరిధిలో ఉండాలని మెషినరీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. ఈ సమాఖ్య నేతలు ప్రభుత్వం విడుదల చేసిన ToR ను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తారు.
పెన్షనర్ల గురించిన ప్రస్తావన లేకపోవడం
Terms of Reference లో వేతనాలు, అలవెన్సులు, ఉద్యోగుల బెనిఫిట్స్ గురించి ప్రస్తావించినా.. పెన్షనర్లు, కుటుంబ పెన్షన్ పొందేవారికి సంబంధించిన అంశాలు కనిపించలేదు. దీనివల్ల వీరిని వేతన సంఘం పరిధిలో నుండి తప్పించే ప్రయత్నం జరుగుతోందన్న అనుమానం బలపడుతోంది. 7వ వేతన సంఘం నివేదిక 2016 జనవరి 1 నుండి అమల్లోకి వచ్చిందని అప్పుడే స్పష్టంగా చెప్పింది. కానీ 8వ వేతన సంఘం విషయంలో ఈ అమలు తేదీ ఇప్పటికీ క్లారిటీ లేదు. స్పష్టమైన తేదీ లేకపోవడం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడు సవరణలు అమలులోకి వస్తాయో తెలియక ఇబ్బందిపడుతున్నారు.
ప్రతి పదేళ్లకు ఒకసారి వేతన సంఘం
ఇప్పటి వరకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వేతన సంఘం ఏర్పాటు చేయడం ఆనవాయితీ. కానీ ఈసారి సవరణలు తరచుగా చేయవచ్చని ToR లో సూచన ఉండటం వల్ల భవిష్యత్తులో వేతన పెంపు ఎలా ఉంటుంది? ఎప్పుడు జరుగుతుంది? అనే కొత్త సందేహాలు తలెత్తాయి. 9 లక్షల పెన్షనర్లను వేతన సంఘం పరిధి నుంచి తొలగించడం అంటే కోట్లాది కుటుంబాలపై ప్రభావం పడుతుంది.