- Home
- Careers
- ఉద్యోగం పోతుందని భయంగా ఉందా? ప్రభుత్వం అందిస్తోన్న ఈ ఏఐ కోర్సులను ఉచితంగా నేర్చుకోండి
ఉద్యోగం పోతుందని భయంగా ఉందా? ప్రభుత్వం అందిస్తోన్న ఈ ఏఐ కోర్సులను ఉచితంగా నేర్చుకోండి
AI courses: ఏఐ రాకతో ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఈ తరుణంలో ఉద్యోగులు అప్‌డగ్రేడ్ కావాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది. ఇందుకోసమే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు, విద్యార్థులకు ఉచితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులను అందిస్తోంది.

పైథాన్‌తో ఏఐ, మిషిన్ లెర్నింగ్
ఈ కోర్సులో AI, మెషిన్ లెర్నింగ్ మౌలిక అంశాలు బోధిస్తారు. Python ద్వారా డేటా విశ్లేషణ, డేటా విజువలైజేషన్, లీనియర్ అల్జీబ్రా, గణాంకాలు, ఆప్టిమైజేషన్ పద్ధతులు వంటివి నేర్పిస్తారు. విద్యార్థులు రియల్ టైమ్ డేటాతో ప్రాక్టికల్‌గా పని చేయడం నేర్చుకుంటారు. డేటా సైన్స్ రంగంలో కెరీర్ చేయాలనుకునేవారికి ఇది ఉపయోగకరం.
క్రికెట్ అనలిటిక్స్‌లో AI వినియోగం
క్రీడల విశ్లేషణపై ఆసక్తి ఉన్నవారికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. ఇందులో క్రికెట్ డేటా సేకరణ, డేటా ప్రిపరేషన్ పద్ధతులు, స్ట్రైక్ రేట్, BASRA ఇండెక్స్ లాంటి పనితీరు సూచీలు, పైథాన్ ద్వారా గ్రాఫ్‌లు, చార్ట్లు తయారీ, క్లిష్టమైన క్రికెట్ గణాంకాలను సులభంగా అర్థం చేసుకునే విధంగా AI ఎలా సహాయపడుతుందో ఇందులో నేర్పిస్తారు.
ఉపాధ్యాయుల కోసం AI కోర్సు
ఈ కోర్సు ప్రత్యేకంగా టీచర్ల కోసం రూపొందించారు. ఇందులో..
* పాఠ్య ప్రణాళికలో AI వినియోగం
* ఆన్‌లైన్ అసెస్‌మెంట్లు తయారు చేయడం
* విద్యార్థుల అభ్యాసాన్ని వ్యక్తిగతీకరించడం
* క్లాస్‌రూమ్‌లో ఉత్పాదకత పెంపు
* AI టూల్స్‌తో బోధన మరింత సమర్థంగా ఎలా చేయాలో ఇందులో చూపిస్తారు.
సైన్స్ విద్యార్థులకు AI – ఫిజిక్స్, కెమిస్ట్రీ, అకౌంటింగ్
ఈ విభాగంలో మూడు ప్రత్యేక కోర్సులు ఉన్నాయి:
AI in Physics:
మెషిన్ లెర్నింగ్ మోడల్స్, న్యూరల్ నెట్‌వర్క్స్ ఉపయోగించి ఫిజిక్స్ సమస్యలు పరిష్కరించడం నేర్పిస్తారు. డేటా ఆధారిత సిమ్యులేషన్లపై ప్రాక్టికల్ అనుభవం ఇస్తారు.
AI in Chemistry:
మాలిక్యులర్ ప్రిడిక్షన్, రియాక్షన్ మోడలింగ్ వంటి అంశాల్లో AI వినియోగాన్ని నేర్పిస్తారు. రియల్ డేటాసెట్‌లతో పని చేసే అవకాశం ఉంటుంది.
AI in Accounting:
ఫైనాన్స్ రంగంలో ఆటోమేషన్, ఫ్రాడ్ డిటెక్షన్, ఫోర్‌కాస్టింగ్ వంటి అంశాల్లో AI ఎలా ఉపయోగపడుతుందో వివరిస్తారు. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అనలిటిక్స్ కెరీర్ కోరుకునేవారికి ఇది ఉపయోగపడుతుంది.
ఎలా నమోదు చేసుకోవాలి?
ఈ అన్ని కోర్సులు SWAYAM పోర్టల్‌లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం ముందుగా SWAYAM అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. కోర్సు పేరు సెర్చ్ చేయాలి. నమోదు చేసి కోర్సులో చేరాలి. కోర్సు పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్ అందుతుంది. ఇది విద్యార్థుల రిజ్యూమేలో మంచి విలువను ఇస్తుంది. AI రంగంలో నైపుణ్యాలు పెంచుకోవాలనుకునే వారికి ఈ ఉచిత కోర్సులు మంచి అవకాశంగా చెప్పొచ్చు.

