- Home
- Andhra Pradesh
- IMD Rain Alert : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు, ఇక అల్లకల్లోలమే..!
IMD Rain Alert : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు, ఇక అల్లకల్లోలమే..!
Rain Alert : ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు, తెలంగాణలో చలి… తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు సంక్లిష్టంగా మారుతున్నాయి. సంక్రాంతి వేళ భారీ నుండి అతిభారీ వర్షాలు కంగారుపెడుతున్నాయి.

ఇక జోరువానలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. తెలంగాణలో చలిగాలుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతుండగా ఆంధ్ర ప్రదేశ్ లో అయితే వర్షాలు మొదలవుతున్నాయి. బంగాళాఖాతంలో వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడిందని... దీంతో తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో జోరువానలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికే వాయుగుండంగా మారింది. ఇది మరింత బలపడి నేడు(జనవరి 08, గురువారం) ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండంగా బలపడనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శని, ఆదివారాల్లో (జనవరి 10,11) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA పేర్కొంది.
తీరప్రాంతాల్లో అల్లకల్లోలమే..
తీవ్ర వాయుగుండం ప్రభావంతో తీరప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశాలుంటాయి కాబట్టి వేటకువెళ్లే మత్య్సకారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తీరప్రాంతాల్లోని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
తమిళనాడులో కుండపోత వానలు
తీవ్ర వాయుగుండం ప్రభావం ఏపీపై తక్కువగానే ఉంటుందని... తమిళనాడులో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరప్రాంత తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని... రాజధాని చెన్నైతో పాటు తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం, కడలూరు, మైలాడుతురై, తిరువారూర్, నాగపట్నం, కారైక్కాల్‌లో అతి భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణపై చలి పంజా
తెలంగాణ విషయానికి వస్తే.. వర్షాలు కురిసే అవకాశాలు లేవు కానీ చలిగాలుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. పొడి వాతావరణం కొనసాగుతూ రాబోయే 2 రోజుల్లో అక్కడక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుండి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, కామారెడ్డి, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో అత్యల్పంగా 5-10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. మిగతా జిల్లాల్లో 10 డిగ్రీల ఎక్కువగానే కనిష్ఠ ఉష్ణోగ్రతలుంటాయని తెలిపింది. జనవరి 9 నుండి రాష్ట్రవ్యాప్తంగా 10 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలుంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే..
బుధవారం (జనవరి 7న) అత్యల్పంగా ఆదిలాబాద్ లో 7.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక మెదక్ లో 11.8, రామగుండంలో 11, హన్మకొండలొ 11, నిజామాబాద్ లో 13.1, భద్రాచలంలో 15, ఖమ్మంలో 16, మహబూబ్ నగర్ లో 15.5, నల్గొండలొ 14.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లో అత్యల్పంగా పటాన్ చెరులో 10.2, రాజేంద్ర నగర్ లో 11.5, హయత్ నగర్ లో 14.6, హకీంపేటలో 16.1, బేగంపేటలో 15.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

