IMD Rain Alert : ఈ సంక్రాంతికి వర్ష గండం.. ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలం తప్పేలా లేదు
Sankranti 2026 Weather Alert : ఈ సంక్రాంతికి వేడుకలకు వర్షగండం పొంచివుంది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం పండగ వేడుకలను డిస్టర్బ్ చేసేలా ఉంది. వచ్చేవారం వాతావరణం ఎలా ఉంటుందంటే…

సంక్రాంతి పండగవేళ వర్షాలు
IMD Rain Alert : మరో వారంరోజుల్లో సంక్రాంతి పండగ... ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు తెలుగు ప్రజలు సిద్దం అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగను వైభవంగా జరుపుకుంటారు... ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఇది అతిపెద్ద పండగ. ఉద్యోగాలు, ఉపాధి కోసం దేశ విదేశాల్లో స్థిరపడినవారు కూడా ఈ పండక్కి సొంతూళ్ళకు వస్తారు. కోడి పందేలు, భోగి మంటలు, రంగురంగుల ముగ్గులు, పిండివంటలు, పంతంగులు, గంగిరెద్దులు... అబ్బో.. సంక్రాంతి వేడుకలు మామూలుగా ఉండవు.
బంగాళాఖాతంలో అల్పపీడనం
ఎప్పటిలాగే ఈసారి సంక్రాంతిని కూడా ఘనంగా జరుపుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు సిద్దం అవుతున్నారు. కానీ వాతావరణం వారి వేడుకలకు ఆటంకం కలిగించేలా కనిపిస్తోంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఓ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా సరిగ్గా సంక్రాంతికి ముందు ఇది అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. జనవరి 8 లేదా 9న శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని... దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఏపీలో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావం ప్రదానంగా తమిళనాడుపై ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. తొమ్మిదో తేదీ నుండి వర్షాలు మొదలవుతాయని... సంక్రాంతి సమయంలో కూడా కొనసాగుతాయని చెబుతున్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
బంగాళాఖాతంలో తుపాను..?
బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం బలపడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వాతావరణ విభాగం చెబుతోంది. ఒకవేళ పరిస్థితి అనుకూలించి బలపడిందంటే వాయుగుండం, తుపానుగా మారే అవకాశాలుంటాయి... అప్పుడు మరింత భారీ వర్షాలుంటాయని హెచ్చరించింది. ఇదే జరిగితే తమిళనాడులో పొంగల్, ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి వేడుకలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది.
తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు.. తగ్గిన చలి
ఇదిలా ఉంటే తెలంగాణలో వాతావరణం ప్రశాంతంగా మారింది... చలిగాలుల తీవ్రత తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతోంది... దట్టమైన పొగమంచు కురుస్తోంది. రాబోయే మూడురోజులు తెలంగాణలో మెరుగైన వాతావరణమే... ఎక్కడా సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ ఉండవని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కామారెడ్డి, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో 11 నుండి 15 డిగ్రీలు... మిగతా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలకు పైగానే టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు
నిన్న (జనవరి 5, సోమవారం) మెదక్ లో 13.2, ఆదిలాబాద్ లో 13.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక భద్రాచలంలో 18.2, హన్మకొండలో 15.0, ఖమ్మంలో 17, మహబూబ్ నగర్ లో 16.1, నల్గొండలో 14.6, నిజామాబాద్ లో 16.7, రామగుండంలో 16 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నాయి.
హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లోని పటాన్ చెరు ప్రాంతంలో 12, రాజేంద్ర నగర్ లో 12.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హకీంపేటలో 16.7, హయత్ నగర్ లో 15.6, బేగంపేటలో 15.6, దుండిగల్ లో 15.6 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నారు. ఇవాళ(మంగళవారం) హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని... ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచుతో కూడిన వాతావరణం ఉంటుందని హెచ్చరించింది. నగరంలో గరిష్ఠంగా 27 డిగ్రీలు, కనిష్ఠంగా 15 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

