- Home
- Andhra Pradesh
- IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం పొంచివుందా..? ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం పొంచివుందా..? ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతోంది. ఓ రాష్ట్రంలో వర్షాలు, మరో రాష్ట్రంలో చలిగాలుల బీభత్సం కొనసాగనుంది. సంక్రాంతి పండగ సమయంలో వాతావరణ మార్పుల హెచ్చరికలతో ప్రజలు కంగారుపడుతున్నారు.

మళ్లీ వర్షాలు..
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలుకానున్నాయా..? అంటే అవుననే అంటోంది వాతావరణ శాఖ. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని... తెలంగాణలో కేవలం వాతావరణ మార్పులు ఉంటాయని వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాలు యాక్టివ్ గా మారడం, బంగాళాఖాతంలో వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడటంతో దక్షిణాదిన జోరువానలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
శ్రీలంక సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం ఏర్పడి అంతకంతకూ బలపడుతోంది... ఇప్పుడది తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే ఇది మరింత బలపడి తుపానుగా మారితే మాత్రం దక్షిణాది రాష్ట్రాల్లో వర్షబీభత్సం తప్పదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇది తుపానుగా మారే అవకాశాలున్నాయో లేదో వాతావరణ శాఖ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
తీరంవైపు దూసుకొస్తున్న వాయుగుండం
తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి తీరంవైపు దూసుకువస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు వర్షాలు కురుస్తాయట. తమిళనాడులో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలుండటంతో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తమిళనాడులోని పుదుచ్చేరి, కారైక్కాల్ వంటి తీరప్రాంత జిల్లాల్లో అతి భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఈ రెండ్రోజులు ఏపీలో వర్షాలే వర్షాలు...
డిసెంబర్ 10, 11 తేదీల్లో ఆంధ్ర ప్రదేశ్ లో మోస్తరు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్సెస్ ఉన్నాయట. ఇక తమిళనాడు తీరప్రాంతం పుదుచ్చేరి, కారైక్కాల్‌లో ఉరుములతో కూడిన వర్షాలు... కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది.
తెలంగాణపై చలి పంజా
ఇక తెలంగాణ విషయానికి వస్తే కొద్దిరోజులుగా చలి తీవ్రత తక్కువగా ఉండగా తాజాగా మళ్లీ పెరిగింది. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాదారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలితో పాటు దట్టమైన పొగమంచు కురుస్తుందని తెలిపింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ 5-10 డిగ్రీల అత్యల్ప స్థాయికి చేరతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఇక్కడే అత్యల్ప ఉష్ణోగ్రతలు
మంగళవారం అంటే జనవరి 6న నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... అత్యల్పంగా ఆదిలాబాద్ లో 9.7 డిగ్రీలు నమోదయ్యింది. ఇక మెదక్ లో 12, రామగుండంలో 13, నల్గొండలో 14, హన్మకొండలో 14, నిజామాబాద్ లో 16, ఖమ్మంలో 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లో అత్యల్పంగా పటాన్ చెరులో 10.2 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది... రాజేంద్ర నగర్ లో 11.5, హయత్ నగర్ లో 14.6, హకీంపేటలో 16.1, బేగంపేటలో 15.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుందంటే..
ఇవాళ (బుధవారం, జనవరి 7న) హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం లేదా రాత్రి వేళల్లో పొగమంచుతో కూడిన పరిస్థితలు ఉంటాయని... గరిష్ఠ ఉష్ణోగ్రత 28°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 14°C మధ్య ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

