ఈ పండును ఉదయం పూట తీసుకుంటే.. శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది.
మనం తీసుకునే ఆహారం మీదే మన ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన సత్యమే. ముఖ్యంగా ఉదయం పూట అల్పాహారంలో తీసుకునే ఆహారం విషయంలో మరింత శ్రద్ధగా ఉండాలి. ఎందుకంటే.. ఆ ఆహారమే.. మనల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచడంలో సహాయపడుతుంది. మనలో దాదాపు అందరూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరీ లాంటివి తింటూ ఉంటారు. ఇవి తిన్న తర్వాత ఏవైనా పండ్లు తింటూ ఉంటారు. కానీ, అలా కాకుండా మన ఉదయాన్నే పండ్లతో మొదలుపెడితే ఏమౌతుంది? అది కూడా బొప్పాయి పండుతో.. క్రమం తప్పకుండా నెల రోజుల పాటు ఉదయం పూట ఒక మీడియం సైజు గిన్నెడు బొప్పాయి ముక్కలను తింటే ఏమౌతుంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...
1.బొప్పాయి పండు పోషకాల గని...
బొప్పాయి పండును పోషకాల గని అని చెప్పొచ్చు. ఈ పండు లో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫోలేట్, పొటాషియం,ఫైబర్, లైకోపీన్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. దీనిని రోజూ తినడం వల్ల శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. ఇక, ఈ పండును ఉదయం పూట తీసుకుంటే.. శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. ముఖ్యంగా ఆక్సీకరణ నుంచి , రక్త కణాలను రక్షించడం ద్వారా చాలా రకాల వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది.
2.జీర్ణక్రియకు సహాయపడే బొప్పాయి పండు
బొప్పాయి పండులో పపైన్ అనే జీర్ణ ఎంజైమ్ ప్రోటీన్ ఉంటుంది. ఇది.. మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం అవ్వడంలో సహాయపడుతుంది. ఇది అజీర్ణం, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలను నివారించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. బొప్పాయి పండులో ఉండే ఫైబర్ ప్రేగు కదలికలను మెరుగుపరిచి, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా పని చేయడానికి సహాయపడుతుంది. అందుకే బొప్పాయి పండును ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిది అని నిపుణులు చెబుతుంటారు.
3.రోగనిరోధక శక్తిని పెంచే బొప్పాయి..
విటమిన్ C అధికంగా ఉండటం వల్ల బొప్పాయి రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. ఇది శరీరంలోని తెల్ల రక్త కణాల పనితీరును మెరుగుపరచి, వైరస్‌లు, బ్యాక్టీరియా నుంచి రక్షణ కలిగిస్తుంది. బొప్పాయిలో కెరోటినాయిడ్లు , యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని మంటలను తగ్గించడంలోనూ సహాయపడతాయి. దీని వల్ల మీరు తేలికగా జబ్బులు పడకుండా ఉంటారు. ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది.
4.గుండెను ఆరోగ్యంగా ఉండే బొప్పాయి..
బొప్పాయిలో లైకోపీన్, ఫైబర్, పొటాషియం సమృద్ధిగా ఉండడం వల్ల ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. అలాగే, రక్తప్రసరణ మెరుగుపడుతుంది, హై బిపి సమస్యల నివారణలోనూ ఇది సహాయపడుతుంది.
5.షుగర్ ని కంట్రోల్ లో ఉంచే బొప్పాయి..
బొప్పాయిలో గ్లైసెమిక్ సూచిక తక్కువగా ఉండటంతో, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తక్షణమే పెంచదు. ఇందులో ఉండే ఫైబర్ చక్కెర శోషణను నెమ్మదిపరచి, ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి ఆదర్శమైన అల్పాహార ఎంపిక. తీపి తీపిగా ఉండినా, ఇది శరీరానికి మేలు చేసే ఆహారమే. డయాబెటీస్ సమస్య ఉన్నవారు ఎలాంటి ఇబ్బంది లేకుండా దీనిని ఆస్వాదించవచ్చు.
6. చర్మం, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బొప్పాయి..
బొప్పాయిలో బీటా కెరోటిన్, విటమిన్ A, C వంటి పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి చర్మాన్ని తేజంగా, నిగారింపుగా ఉంచడంలో సహాయపడతాయి. కంటి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు కూడా ఇందులో పుష్కలంగా ఉండి, మాక్యులర్ డిజెనరేషన్ వంటి సమస్యల నుంచి రక్షించగలవు. చర్యాన్ని అందంగా మారుస్తాయి. ఫేస్ లో తెలీకుండానే గ్లో వచ్చేస్తుంది.
7.బరువు తగ్గించడంలో సహాయపడే బొప్పాయి..
బొప్పాయి తక్కువ కేలరీలు కలిగి ఉంటాయి. రోజూ తిన్నా బరువు పెరుగుతామనే భయం ఉండుద. ఈ పండులో నీరు, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది తేలికగా కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. దీని వల్ల మితంగా తినే అలవాటు పెరుగుతుంది. అంతేకాదు, దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి, కొవ్వు పదార్థాల నిల్వలను తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు బొప్పాయిని ఉదయం డైట్‌లో చేర్చాలి.
8.యాంటీ ఆక్సిడెంట్ల పవర్ హౌస్..
బొప్పాయిలో ఉండే లైకోపీన్, కెరోటినాయిడ్లు, ఇతర ఫైటోన్యూట్రియెంట్లు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు. ఇవి ఫ్రీ రాడికల్స్‌కి వ్యతిరేకంగా పోరాడి, కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించి, ఆరోగ్యాన్ని నిలబెట్టడంలో ఇది విశేషంగా సహాయపడుతుంది.
ఫైనల్ గా...
ఉదయాన్నే బొప్పాయితో మొదలుపెట్టడం అనేది ఆరోగ్యకరమైన, సహజమైన అలవాటు. ఇది కేవలం రుచికరమైన పండు కాదు. ఇది ఆరోగ్యానికి ఒక నిఖార్సయిన బహుమతి. బరువు నియంత్రణ నుంచి మొదలుకొని గుండె ఆరోగ్యం, చర్మ కాంతి, రోగనిరోధకత వరకు ఇది అనేక లాభాలను కలిగిస్తుంది. రోజులో ఈ చిన్న అలవాటు, మీ జీవిత నాణ్యతను మెరుగుపరచగలదు.
