సారాంశం

మనం ఎక్కువగా తినే కూరగాయల్లో ముందు వరుసలో ఉండేది టమాట. వీటిని మనం రోజూ వారి వంటల్లో వాడుతూనే ఉంటాం. అయితే రోజూ ఉదయం లేదా మధ్యాహ్నం భోజనానికి ముందు, తర్వాత ఒక టమాట తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు నిపుణులు. మరి రోజూ టమాట తినడం వల్ల కలిగే లాభాలెంటో ఇక్కడ చూద్దాం.

టమాట ఏడాది పొడవునా దొరుకుతుంది. వంటలకు రుచిని పెంచడంలో టమాట ఎంతో ప్రత్యేకమైంది. అంతేకాకుండా దీనిలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. చాలామంది పచ్చి టమాట తినడానికి ఇష్టపడతారు. భోజనానికి ముందు సలాడ్‌లో, బ్రేక్‌ఫాస్ట్ శాండ్‌విచ్‌లో లేదా పండుగా మొత్తం టమాటాను తింటారు. అందం పెంచుకోవడంలో కూడా దీనికి మంచి పేరుంది. చర్మంపై టాన్ తొలగించడానికి టమాట బాగా ఉపయోగపడుతుంది.

టమాటాలో విటమిన్ ఎ, సి, కె, ఫోలేట్, లైకోపీన్, బీటా కెరోటిన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. వాతావరణం మారే సమయంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్ల నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తుంది. బరువు తగ్గించే ఆహారంలో టమాటాను చేర్చుకోవచ్చు. రోజువారీ పండ్ల అవసరాన్ని తీర్చడానికి ప్రత్యామ్నాయంగా టమాటాను తీసుకోవచ్చు. ఎందుకో ఇక్కడ చూద్దాం.

రోజూ టమోటా తింటే ఎన్ని లాభాలో తెలుసా?

1. టమాటాలో విటమిన్ ఎ, విటమిన్ సి ఉంటాయి. ఇవి చర్మం మెరుపును పెంచుతాయి. మొటిమలు లేదా ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు రాకుండా నిరోధిస్తాయి. జుట్టు ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి.

2. టమాటాలో విటమిన్ కె, కాల్షియం ఉంటాయి. ఈ రెండు పదార్థాలు ఎముకల పోషణకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎముకలను దృఢంగా ఉంచుతాయి.

3. టమాటాలో విటమిన్ ఎ, బి, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. మెరుగైన రక్త ప్రసరణకు సహాయపడతాయి. టమాటాలోని లైకోపీన్, ఇతర పదార్థాలు రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తాయి. ఇది గుండెకు మంచిది. ఫలితంగా గుండె చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటుంది.

4. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో టమాటా చాలా మంచిది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియకు మంచిది. ఇందులో అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. కాబట్టి శరీరంలో అదనపు కేలరీలు లేదా కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. బరువు తగ్గాలకునేవారు రోజూ ఒక టమాటాను తినవచ్చు.

5. టమాటాలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రెండు టమాటాలను కట్ చేసి, 2 కప్పుల నీటిలో ఉప్పు లేదా చక్కెర వేసి, ఉడికించి ప్రతిరోజూ ఈ సూప్ తాగండి. తాజా టమాటా రసం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వాతావరణం మారే సమయంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లను రాకుండా నిరోధిస్తుంది.

6. టమాటాలోని విటమిన్ సి కళ్లకు చాలా మంచిది. దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

7. టమాటాలో లైకోపీన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. అంతేకాకుండా ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణాల అనియంత్రిత పెరుగుదలను నిరోధించి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.