లాక్‌డౌన్‌ టైమ్‌లో విశేషంగా సేవా కార్యక్రమాలు చేపట్టి రియల్‌ హీరో అనిపించుకున్న నటుడు సోనూ సూద్‌ జీవితం ఆధారంగా ఆయన బయోగ్రఫీ పుస్తకరూపంలోకి రాబోతుంది. పెంగ్విన్‌ రాండమ్‌ హౌజ్‌ అనే సంస్థ సోనూ సూద్‌ ఆత్మకథ రాస్తుంది. మీనా అయ్యర్‌ సహ రచన చేస్తున్నారు. తాజాగా దీనికి టైటిల్‌ని ఖరారు చేశారు. `ఐ యామ్‌ నో మెస్సీయ` అనే పేరుని ఖరారు చేశారు. 

సోనూ సూద్‌ తెలుగులో విలన్‌గా ఎంతగా పాపులర్‌ అయ్యారో తెలిసిందే. ఆయన్ని ఆడియెన్స్ విలన్‌గానే చూశారు. కానీ ఆయన మనసులో రియల్‌ హీరో ఉన్నాడని, గొప్ప సేవా వ్యక్తిత్వం ఆయన సొంతమని కోవిడ్‌ -19 వల్ల ఏర్పడిన లాక్‌డౌన్‌ నిరూపించింది. ఆపదలో ఉన్న ఎంతో మంది పేదలకు ఆపన్న హస్తమయ్యాడు. ముంబయిలో ఇరుక్కున్న వలస కార్మికుల పాలిట దేవుడయ్యాడు. వందల మందికి రోజూ భోజనం పెట్టి, వారిని సురక్షితంగా ఇంటికి చేరవేశాడు. లాక్ డౌన్ లో వలస కార్మికులకు అతను చేసిన సహాయం దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును అందించింది. వారి సొంత పట్టణాలను సురక్షితంగా చేరుకోవడంలో సహాయపడటం ద్వారా ఒక గొప్ప పేరును కూడా పెట్టారు.
 
`వలసదారుల మెస్సీయ` అని ప్రశంసిస్తున్నారు. `మెస్సీయా` అంటే కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు వచ్చిన ఓ గొప్ప వ్యక్తం అని అర్థం వస్తుంది. ఈ అర్థంతోనే సోనూసూద్‌ ఆటోబయోగ్రఫీకి పేరును ఖరారు చేశారు.  కొంతకాలం క్రితం, పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా సోను యొక్క ఆత్మకథ రాస్తున్నట్లు ప్రకటించింది, మహమ్మారి సమయంలో సోనూ అనుభవాలను అందులో వివరంగా ఉంటాయని తెలిపింది. ఆ పుస్తకానికి 'ఐ యామ్ నో మెస్సీయ' అని పేరు పెట్టడం విశేషంగా నిలిచింది. 

దీనిపై సోనూ సూద్‌ స్పందించారు. `ప్రజలు చాలా దయతో ఉన్నారు. నాకు ప్రేమగా మెస్సీయ అని పేరు పెట్టారు. కానీ నేను మెస్సీయని కాదని నమ్ముతున్నా. ఎందుకంటే నా హృదయం చెప్పేది నేను చేస్తాను. దయతో ఒకరికొరు సహాయం చేసుకోవడమే మనుషులుగా మన బాధ్యత` అని తెలిపారు. ఈ పుస్తకంలో సోనూ రక్షించిన వ్యక్తుల మనోగతాన్ని, చేపట్టిన మంచి పనుల సారాంశాన్ని తెలుపుతుంది. సోనూ విన్న అనేక కథలను, పరస్పర చర్యలను వివరిస్తారట. ఈ అనుభవం తన దృక్పథాన్ని మాత్రమే కాకుండా అతని జీవిత ఉద్దేశ్యాన్ని కూడా ఎలా మారుస్తుందో కూడా పంచుకుంటారని సమాచారం. అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ పుస్తకాన్ని ప్రత్యేకంగా ఆర్డర్ చేయవచ్చు.  'ఐ యామ్ నో మెస్సీయా' డిసెంబర్‌లో ఎబరీ ప్రెస్ ముద్రణ కింద విడుదల కానుంది.