దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్న చిత్రాల్లో ఆర్ ఆర్ ఆర్ ఒకటి. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ విజువల్ వన్టర్ పై భారీ అంచనాలున్నాయి. లాక్ డౌన్ వరకు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ నిరవధికంగా సాగింది. కరోనా వైరస్ వ్యాప్తితో ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఐదునెలలకు పైగా షూటింగ్ కి బ్రేక్ పడింది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ శ్రియా శరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై శ్రియా కొద్దిరోజుల క్రితమే స్పష్టత ఇచ్చారు. తాను ఆర్ ఆర్ ఆర్ లో హీరో అజయ్ దేవ్ గణ్ పాత్రకు జోడిగా నటిస్తున్నట్లు ఆమె చెప్పడం జరిగింది. కాగా తాజా ఇంటర్వ్యూలో తన పాత్ర గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు శ్రియా శరణ్ వెల్లడించారు. 

శ్రియా శరణ్ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుందట. అజయ్ దేవ్ గణ్ పాత్రతో ఆమె కాంబినేషన్ సన్నివేశాలు ఉంటాయట. ఐతే ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో శ్రియా పాత్రకు ఎటువంటి లింక్ ఉండదట. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, చరణ్ లతో తన పాత్రకు కాంబినేషన్ సన్నివేశాలు లేవని ఆమె చెప్పుకొచ్చారు. దీనితో ఆర్ ఆర్ ఆర్ లో శ్రియా శరణ్ పాత్రపై ఒక క్లారిటీ వచ్చింది. శ్రియా గతంలో రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమాలో హీరోయిన్ గా నటించింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం 2005లో విడుదలై బ్లాక్ బస్టర్ అందుకుంది. 

దాదాపు 15ఏళ్ల తరువాత తిరిగి రాజమౌళి గారితో పనిచేయడం గొప్ప అనుభూతిని పంచినట్లు శ్రియా శరణ్ తెలియజేశారు. అలాగే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి చేసి, విడుదల చేయాలని శ్రియా కాంక్షించారు. మరో వైపు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తిరిగి ప్రారంభించాడని సిద్ధం అవుతున్నారు. దసరా తరువాత ఆర్ ఆర్ ఆర్ సెట్స్ పైకి వెళ్లనుందని టాలీవుడ్ టాక్. ఇప్పటికే అనుకున్న సమయానికంటే ఏడాది ఆర్ ఆర్ ఆర్ విడుదల ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది.