వివాదం లేనిదే ప్రొద్దుకూకదు రామ్ గోపాల్ వర్మకు. ఆయన తనలాంటి వివాదాస్పద వ్యక్తులను చూస్తే మరింత మురిసిపోతారు.వారితో కలవటానికి,ముచ్చటానికి ఉత్సాహం చూపిస్తారు. మరో ప్రక్క వ్యంగ్య ధోరణిలో మాట్లాడటంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దిట్ట. వైఎస్సార్‌సీపీకి దూరమైన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు నోటితో మాట్లాడుతూ... నొసలితో ఎక్కిరించేలా  వ్యవహారం నడుపుతూంటారు. గత కొంతకాలం నుంచి రఘు...వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, సీఎం జగన్‌ని వెటకారంగా పొగడటం చేస్తున్నారు.

అలాంటి వ్యక్తి సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మతో కలిసి సందడి చేశారు.  వీరిద్దరి భేటీకి సంబంధించిన ఫొటోలను వర్మ తన ట్విట్టర్ అకౌంట్ లో  షేర్ చేసున్నారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు అనేక చిత్రాతి చిత్రమైన ఎక్స్ ప్రెషన్లను తన ముఖంలో పలించారు. ఎవరికో సీరియస్ వార్నింగ్ ఇస్తున్నట్టు వర్మతో కలిసి పోజులు ఇచ్చారు.

దీనిపై వర్మ స్పందిస్తూ.... ఆర్ఆర్ఆర్ (రఘురామకృష్ణరాజు) ఎవరికి వార్నింగ్ ఇస్తున్నాడో చెప్పగలరా అని ప్రశ్నించారు. తాను కూడా రఘురామకృష్ణరాజు పొలిటికల్ గాంగ్ లో చేరుతున్నానని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఆర్ఆర్ఆర్ గా గుర్తింపు పొందిన రాజమౌళి, రామ్ చరణ్, రామారావు (జూనియర్ ఎన్టీఆర్) లు కేవలం సినిమా వరకే పరిమితం అని, కానీ, ఆర్ఆర్ఆర్ అంటే రఘురామకృష్ణరాజేనని, ఆయన రియల్ హీరో అని పేర్కొన్నారు.