సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఏపీలో తప్ప అన్ని ప్రాంతాల్లో విడుదలై సక్సెస్ అందుకుంది. ఏపీలో ఎన్నికల కారణంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని ఎన్నికలు పూర్తయ్యే వరకు వాయిదా వేశారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావడంతో మే 1న విడుదల చేయాలనుకున్నారు. 

ఈ క్రమంలో వర్మ విజయవాడలో ఓ ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నారు. కానీ ఏపీ పోలీసులు దానికి అడ్డుపడ్డారు. విజయవాడ వెళ్లిన వర్మని పోలీసులు మధ్యలోనే ఆపేసి తిరిగి హైదరాబాద్ పంపించేశారు. ఈ విషయంపై తాజాగా వర్మ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు.  

''టెర్రరిస్ట్ లపై కూడా ఇంతగా విరుచుకుపడతారో లేదో కానీ విజయవాడకి బయలుదేరిన మమ్మల్ని మా కార్లను ఆపేసి వేరే కార్ ఎక్కించి బలవంతంగా హైదరాబాద్ పంపించేశారు. వాళ్లకి ఆర్డర్స్ ఉన్నాయని చెప్పారు. అసలు ప్రజాస్వామ్య దేశంలోనే ఉంటున్నామా..? నాకు అర్ధం కావడం లేదని'' వర్మ మండిపడ్డారు. 

''జగన్ గారి మీద కత్తి దాడి జరిగినప్పుడు ఏపీ ప్రభుత్వం, అలానే కొందరు టీడీపీ నాయకులు మాకు ఎయిర్ పోర్ట్ సిబ్బందికి సంబంధం లేదని అన్నారు. కానీ మమ్మల్ని మాత్రం ఎయిర్ పోర్ట్ లోకి తీసుకెళ్లి ఓ రూమ్ లో ఏడు గంటల పాటు నిర్భందించారు. జగన్ మీద దాడి జరిగినప్పుడు వర్తించని రూల్స్ ఇప్పుడు ఎలా వర్తించాయని'' ప్రశ్నించారు.  

''రోడ్ మీద ప్రెస్ మీట్ పెడితే సెక్యురిటీ సమస్య వస్తుందని పోలీసులు అనడంతో నా ఫ్రెండ్ ఇంట్లో ప్రెస్ మీట్ పెడతానని చెబితే.. అప్పుడు పోలీసులు మిమ్మల్ని మాట్లాడనివ్వకూడదని మాకు రూల్స్ ఉన్నాయని చెప్పారు. ఇది కొత్త సినిమా కాదు.. మూడు నెలల నుండి ఈ సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నాం. ఇప్పుడేం మాట్లాడతానని 
మీరు భయపడుతున్నారని'' పోలీసులను ప్రశ్నించినట్లు వర్మ చెప్పారు. 

ఆదేశాలు ఎవరు ఇచ్చారో చెప్పడం లేదని ఏపీ పోలీసులపై ఫైర్ అయ్యారు. విజయవాడలోకి రానివ్వమని అంటున్నారని ఏపీలోకి రావడానికి వీసా తీసుకొని వెళ్లాలా..? అంటూ వర్మ ప్రశ్నించారు. తనకు జరిగింది అవమానంగా భావించిన వర్మ ఈ విషయంపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు.  

సంబంధిత వార్తలు

వర్మ చేసిన తప్పేమిటి: బాబు ప్రభుత్వంపై జగన్ ఫైర్

7 గంటల హైడ్రామా: బలవంతంగా హైదరాబాదుకు వర్మ తరలింపు

నేను పోలీస్ కస్టడీలో ఉన్నా.. వీడియో షేర్ చేసిన వర్మ!

బెజవాడలో ఆర్జీవీ అరెస్ట్: వర్మకు వైసీపీ నేతల మద్ధతు

అందుకే వర్మను అడ్డుకొన్నాం: విజయవాడ పోలీసులు

బెజవాడలో రామ్‌గోపాల్ వర్మ హైడ్రామా, అదుపులోకి తీసుకొన్న పోలీసులు