విజయవాడలో సీనీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ హైడ్రామా నడిపారు.నడిరోడ్డుపై మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని వర్మ  ప్రకటించారు. రామ్‌గోపాల్ వర్మను విజయవాడలో ఆదివారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. మధ్యాహ్నం వర్మను పోలీసులు గన్నవరం ఎయిర్ పోర్టు నుండి  తిరిగి హైద్రాబాద్‌కు పంపనున్నారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్‌ చిత్రాన్ని  మే 1వ తేదీన ఏపీ రాష్ట్రంలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ విషయమై విజయవాడలో నడిరోడ్డుపై ప్రెస్ మీట్ పెడతానని ట్విట్టర్ వేదికగా ఆదివారం నాడు ప్రకటించారు.

స్పైస్ జెట్ విమానం‌లో రామ్ గోపాల్ వర్మ ఇవాళ ఉదయం విజయవాడకు చేరుకొన్నారు. ఆ తర్వాత ఆయన హోటల్ ఐలాపురం‌కు వెళ్లనున్నట్టుగా వర్మ ట్వీట్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో  హోటల్‌కు చేరుకొంటానని ఆయన ట్వీట్ చేశారు.


అయితే ఐలాపురం హోటల్‌లో వర్మ రూమ్‌ బుకింగ్‌ను క్యాన్సిల్ చేసినట్టుగా హోటల్ యాజమాన్యం ప్రకటించింది. ఓ వ్యక్తి బెదిరింపుల వల్లే హోటల్‌లో తన రూమ్‌ బుకింగ్‌ను క్యాన్సిల్ చేశారని ఆయన ఆరోపించారు.

నోవాటెల్ ,ఐలాపురం హోటల్స్‌లో కూడ ప్రెస్ మీట్ పెట్టాలని రామ్ గోపాల్ వర్మ భావించాడు. అయితే ఈ రెండు హోటల్స్‌‌లో కూడ వర్మకు అనుమతి నిరాకరించారు. బుకింగ్స్‌ను క్యాన్సిల్ చేశారు.

దీంతో రామ్ గోపాల్ వర్మ సింగ్‌నగర్‌లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రెస్ మీట్ పెడతానని ట్వీట్ చేశారు. విజయవాడకు వర్మ చేరుకోగానే పోలీసులు ఆయనను  అనుక్షణం ఫాలో అయ్యారు.

రోడ్డు మీద ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల  శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించారు. దీంతో రామ్ గోపాల్ వర్మ‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఆయనను తిరిగి హైద్రాబాద్‌కు పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఉన్న విమానంలో  ఆయనను హైద్రాబాద్‌కు పంపనున్నారు. విమానంలో హైద్రాబాద్‌కు పంపడం సాధ్యం కాకపోతే రోడ్డు మార్గంలో పంపాలని పోలీసులు నిర్ణయం తీసుకొన్నారు.