అమరావతి:విజయవాడ నగర పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని అలాంటి సమయంలో నడిరోడ్డుపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ‌ను  అదుపులోకి తీసుకొన్నట్టుగా విజయవాడ పోలీసులు తెలిపారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను మే 1వ తేదీన ఏపీలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను విడుదల చేసే విషయమై వర్మ ఇవాళ విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టాలని భావించారు. అయితే విజయవాడ నోవాటెల్, ఐలాపురం హోటల్స్ లో రామ్ గోపాల్ వర్మకు అనుమతి ఇవ్వలేదు. దీంతో సింగ్‌నగర్‌లో రోడ్డుపై ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రెస్ మీట్ పెడతానని వర్మ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌‌లో వర్మ దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. విజయవాడ నగరపరిధిలో సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌, సెక్షన్‌ 114 సీఆర్‌పీసీ, ఎలక్షన్‌ కోడ్‌ అమల్లో ఉన్నాయని పోలీసులు గుర్తు చేశారు. ఈ సమయంలో ప్రెస్ మీట్ నిర్వహించుకొనేందుకు ముందస్తుగా పోలీసులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.

నిత్యం రద్దీగా ఉండే విజయవాడలోని పైపులరోడ్డు, ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ప్రెస్‌ మీట్‌ నిర్వహిస్తే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగి ప్రజలకు అసౌక్యం ఏర్పడే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలోని ఐబీయమ్‌ కళాశాలలో పరీక్షలు జరుగుతున్నట్లు పోలీసులు విడుదల చేసిన ఓ నోట్‌లో పేర్కొన్నారు.

ఈ ప్రాంతంలో వర్మ నిర్వహిస్తే రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారి తీసే అవకాశం ఉందని భావించామన్నారు.  దీంతో ముందస్తుగా రామ్‌గోపాల్ వర్మను అదుపులోకి తీసుకొన్నట్టు  పోలీసులు తెలిపారు.

బహిరంగప్రదేశాల్లో నిర్వహించే ప్రెస్‌మీట్‌లో ఇతరులను కించపరిచే అనుచిత వ్యాఖ్యలు చేయరాదని పోలీసులు గుర్తు చేశారు. ఇతరుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి దూషణలు చేస్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి తద్వారా ఆస్తి, ప్రాణ నష్టాలకు నిర్వాహకులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.విజయవాడ పోలీసు కమిషనర్ పేరుతో రామ్ గోపాల్ వర్మకు అందించారు.

సంబంధి వార్తలు

బెజవాడలో రామ్‌గోపాల్ వర్మ హైడ్రామా, అదుపులోకి తీసుకొన్న పోలీసులు