సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను పోలీస్ కస్టడీలో ఉన్నానని సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. వివరాల్లోకి వెళితే.. వర్మ తెరక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్‌' సినిమా మే 1న ఏపీలో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. 

ఈ సినిమా ప్రచారంలో భాగంగా వర్మ విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రయత్నించారు. కానీ ఆయన్ను హోటల్ లో దిగకుండా, బుకింగ్ రద్దు చేశారని వర్మ కొద్ది గంటల క్రితం తెలిపారు. దీంతో నడిరోడ్డు మీద ప్రెస్ మీట్ పెడుతున్నానంటూ వర్మ వెల్లడించారు. ఈరోజు నాలుగు గంటలకు ప్రెస్ మీట్ ఉంటుందని అన్నారు. 

అయితే తాజాగా వర్మ ఓ వీడియో షేర్ చేశారు. ''మా కార్లను ఆపి మమ్మల్ని బలవంతగా వేరే కార్లలో ఎక్కించారు. విజయవాడకి రావడానికి వీలు లేదంటూ వార్నింగ్ ఇచ్చి మమ్మల్ని తీసుకొచ్చి ఎయిర్ పోర్ట్ లో పడేశారు'' అంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు.

ఎందుకు ఇలా చేశారో తనకు అర్ధం కావడం లేదని, పోలీసులు చట్టపరంగా వ్యవహరించరా..? వారికి బాధ్యత లేదా..? అంటూ ప్రశ్నించారు. ''నిజం చెప్పేందుకు ప్రయత్నించినందుకు ఇప్పుడు నేను పోలీసు కస్టడీలో ఉన్నా. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం అనేదే లేదు'' అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చారు. ఈరోజు జరగాల్సిన ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయినట్లుగా వెల్లడించారు.