విజయవాడ: విజయవాడ నడిరోడ్డుపై ప్రెస్ మీట్ పడుతునానని లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించి రంగంలోకి దిగిన తర్వాత ఏడు గంటల హై డ్రామా నడిచింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఏడు గంటల పాటు విజయవాడలో ఆ హైడ్రామా నడిచింది. చివరకు గన్నవరం విమానాశ్రయం నుంచి రామ్ గోపాల్ వర్మను పోలీసులు విమానంలో హైదరాబాదు తరలించారు. 

గన్నవరం విమానాశ్రయం వెలుపలికి వచ్చిన వెంటనే పోలీసులు వర్మను అడ్డుకున్నారు. విమానాశ్రయం నుంచి ఆయనను బయటకు రాకుండా చూశారు. చివరకు సాయంత్రం హైదరాబాదు తరలించారు. తనను గన్నవరం ఎయిర్ పోర్టులో పడేశారని వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. 

హైదరాబాదు వెళ్లిన తర్వాత తాను స్పందిస్తానని వర్మ చెప్పారు. ఆయన హైదరాబాదు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. విజయవాడకు తాను రాకూడదా, విజయవాడలో ఉండకూడదా అని వర్మ ప్రశ్నించారు. విజయవాడలో తన సినిమా గురించి చెప్పుకునే హక్కు తనకు లేదా అని అడిగారు. 

రామ్ గోపాల్ వర్మను అదుపులోకి తీసుకున్నారనే సమాచారం అందడంతో మల్లాది విష్ణు, అంబటి రాంబాబు తదితర వైఎస్సార్ కాంగ్రెసు నేతలు విమానాశ్రయానికి చేరుకున్నారు. పోలీసుల తీరును వారు తీవ్రంగా తప్పు పట్టారు. 

విజయవాడలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉందని పోలీసులు అంటున్నారు. వర్మ ప్రెస్ మీట్ పెడుతానని ప్రకటించిన స్థలం రద్దీగా ఉంటుందని, ఆయన ప్రెస్ మీట్ పెడితే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని పోలీసులు వాదిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

నేను పోలీస్ కస్టడీలో ఉన్నా.. వీడియో షేర్ చేసిన వర్మ!

బెజవాడలో ఆర్జీవీ అరెస్ట్: వర్మకు వైసీపీ నేతల మద్ధతు

అందుకే వర్మను అడ్డుకొన్నాం: విజయవాడ పోలీసులు

బెజవాడలో రామ్‌గోపాల్ వర్మ హైడ్రామా, అదుపులోకి తీసుకొన్న పోలీసులు