Asianet News TeluguAsianet News Telugu

శ్రీవిష్ణు చేతుల మీదుగా 'రేడియో మాధవ్' ఫస్ట్ లుక్

విజయ్ సేతుపతి, జయరామ్ హీరోలుగా నటించిన మలయాళ సినిమా 'మార్కొని మతాయ్'.  సనల్ కలతిల్ దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా అక్కడ మంచి విజయం సాధించింది. 

Radio Madhav First look released by sri vishnu
Author
Hyderabad, First Published Oct 7, 2020, 7:49 PM IST


విజయ్ సేతుపతి సినిమాలకు తెలుగులో మంచి గిరాకీ ఉంది. ఇక్కడ ప్రేక్షకులు ఆయన నటనకు అలవాటు పడుతున్నారు. త్వరలో విజయ్ సేతుపతి విలన్ గా చేసిన ఉప్పెన చిత్రం సైతం రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో విజయ్ సేతుపతి నటించిన ఓ మళయాళ చిత్రం తెలుగులో డబ్బింగ్ అవుతోంది. ఓ ఫీల్ గుడ్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందని చెప్తున్నారు. 

వివరాల్లోకి వెళితే...
విజయ్ సేతుపతి, జయరామ్ హీరోలుగా నటించిన మలయాళ సినిమా ‘మార్కొని మతాయ్’.  సనల్ కలతిల్ దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా అక్కడ మంచి విజయం సాధించింది. అతి తక్కువ సమయంలో తమిళంలో కథానాయకుడిగా, నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి మలయాళంలో నటించిన తొలి చిత్రమిది. తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘రేడియో మాధవ్’గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు లక్ష్మీ చెన్నకేశవ ఫిలిమ్స్ అధినేత, నిర్మాత కృష్ణస్వామి. ఈ సినిమా తెలుగు వెర్షన్ ఫస్ట్ లుక్ ను బుధవారం హీరో శ్రీవిష్ణు విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ “విజయ్ సేతుపతిగారు నటించిన ‘రేడియో మాధవ్’ తెలుగులో అనువాదం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దర్శక, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.
నిర్మాత కృష్ణస్వామి మాట్లాడుతూ “మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన శ్రీవిష్ణుగారికి చాలా చాలా స్పెషల్ థాంక్స్. మా సంస్థ రెండో చిత్రమిది. ఇంతకు ముందు దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి నటించిన ‘హే పిల్లగాడ’ విడుదల చేశా. ఇప్పుడు ‘రేడియో మాధవ్’ తీసుకొస్తున్నాను. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా కనిపిస్తారు. తన నిజ జీవిత పాత్రలో ఆయన నటించారు. 

భాగమతి, అల వైకుంఠపురం చిత్రాలలో విలన్ గా తండ్రిగా నటించిన జయరామ్ ఈ చిత్రంలో మిలటరీ నుంచి బయటకి వచ్చి బ్యాంకు సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ ఉండే పాత్ర పోషించాడు. ఎఫ్.ఎం. రేడియో స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ప్రేమకథ ఈ ‘రేడియో మాధవ్’ సినిమా” అని అన్నారు.
సహ నిర్మాత చలం మాట్లాడుతూ “కేరళ పచ్చటి అందాల మధ్య ఉన్న చంగనసేరి అనే చిన్న పట్టణంలో నడిచే చక్కటి సినిమా ‘రేడియో మాధవ్’. ఇందులో పాటలు చాల బాగుంటాయి. థియేటర్లలో పరిస్థితిని బట్టి విడుదలపై నిర్ణయం తీసుకుంటాం” అని చెప్పారు.


చిత్ర నిర్వాహకుడు శ్రీనివాస మూర్తి  మాట్లాడుతూ “రేడియో మాధవ్’ ఒక ఫీల్ గుడ్ సినిమా. హీరో హీరోయిన్లు ఎప్పుడు కలుస్తారా? అని ప్రేక్షకులు ఎదురు చూసేలా ఉంటుంది” అని అన్నారు.

తెలుగులో మాటలు, పాటలు రాసిన భాష్య శ్రీ మాట్లాడుతూ “తెలుగులో వెంకటేష్ గారు నటించిన ‘రాజా’, ‘సంక్రాంతి’ తరహా మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఇది. మలయాళంలో పెద్ద విజయం సాధించింది. తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. ఎంజాయ్ చేస్తూ చేసిన డబ్బింగ్ సినిమా ఇది” అని అన్నారు.

విజయ్ సేతుపతి, జయరామ్, ఆత్మీయ రాజన్, పూర్ణ, నరేన్, అజూ వర్గీస్ తదితరులు సినిమాలో నటించారు. ఈ చిత్రానికి సమర్పణ: గుండేపూడి శీను, మాటలు & పాటలు : భాష్య శ్రీ, ఎడిటింగ్‌: షామీర్ ముహమ్మెద్, కెమెరా: సజన్ కలతిల్, సంగీతం: ఏం. జయచంద్రన్, పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు-ఫణి కందుకూరి (Beyond Media), ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఎన్. శ్రీనివాస మూర్తి, సహ- నిర్మాత: డి.వి . చలం, నిర్మాత: డి.వి . కృష్ణస్వామి, కధ-దర్శకత్వం: సనల్ కలతిల్ 

Follow Us:
Download App:
  • android
  • ios