ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న బాగా మాట్లాడుతున్నార‌ని చెప్పారు. ఇటీవ‌ల త‌న అన్న‌య్య ఫొటో చూసిన కొంద‌రు దానిపై స్పందించాల‌ని అడిగార‌ని అందుకే మాట్లాడుతున్నాన‌ని చెప్పారు. అంద‌రి అభిమానానికి వంద‌నాలు చెబుతున్నాన‌ని అన్నారు.

ప్రముఖ తెలుగు సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావుకు సంబంధించిన ఓ ఫొటో ఇటీవ‌ల బాగా వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. ఆ ఫొటోలో ఆయన వీక్ గా కనపడ్డారు. అలాగే పీక్కు పోయినట్లు కనిపించారు. దాంతో ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై ఆయ‌న త‌మ్ముడు పరుచూరి గోపాలకృష్ణ వివ‌ర‌ణ ఇచ్చారు. త‌న‌ అన్నయ్య బాగానే ఉన్నార‌ని చెప్పారు. 2017లో ఆస్ట్రేలియా వెళ్లి వ‌చ్చాక ఆరోగ్యం విష‌యంలో కొంత తేడా వచ్చిందని, దీంతో పరీక్షలు చేయించుకున్నార‌ని చెప్పారు.

'అన్నయ్య బాగానే ఉన్నాడు. కాకపోతే 2017లో ఆస్ట్రేలియా వెళ్లి వచ్చినప్పుడు కొంత తేడా వచ్చింది. పరీక్షలు చేయించుకుంటే కొన్ని ఆహార నియమాలు పాటించమని చెప్పారు. ఆ తర్వాత ఆయన 10 కిలోలు తగ్గారు. ఈ రెండు సంవత్సరాలలో నేనూ 10 కిలోల బరువు తగ్గాను. కానీ ఆయన మేధస్సు అలాగే ఉంది. జుట్టుకు రంగు వేయకపోయేసరికి అలా ఉన్నాడు. ఆ ఫొటో షేర్‌ చేసిన జయంత్‌ను కూడా అడిగాను. ఎందుకయ్యా అలాంటి ఫొటో పెట్టావు, ఆయన ఎలా ఉన్నాడో మన కంటితో చూడొచ్చుగా అన్నాను.

చిక్కిపోయాడు, జుట్టుకు రంగేసుకోలేదని ఇలా చాలామంది అన్నారు. ఒక్క వ్యక్తి మాత్రం 80 ఏళ్లు వచ్చాక ఇంకెలా ఉంటాడు? ఎందుకిలా మాట్లాడుతున్నారు? నేను ఫోన్‌లో ఆయనతో మాట్లాడుతుంటాను. వయసు మీదపడే కొద్దీ శరీర ధర్మాలు మారుతూ ఉంటాయి. అన్నయ్య క్షేమంగా ఉన్నాడు. అభిమానులు, అన్నయ్యను ప్రేమించే వారు ధైర్యంగా ఉండండి ' అని గోపాల కృష్ణ చెప్పుకొచ్చాడు.

 అలాగే య‌వ్వ‌నంలో ఉన్న‌ప్పుడు ఎలా ఉండేవారో వృద్ధాప్యంలోనూ అలాగే క‌న‌ప‌డాల‌ని కొంద‌రు భావిస్తార‌ని చెప్పారు. ఎంజీఆర్ క‌ళ్ల‌జోడు, త‌ల‌పై టోపీ లేకుండా ప్ర‌జ‌ల‌కు ఎన్న‌డూ క‌న‌ప‌డ‌కూడ‌ద‌ని నియమం పెట్టుకుని అలాగే ఉన్నార‌ని ఆయ‌న వివ‌రించారు.

శోభ‌న్ బాబు కూడా అలాగే భావించి వృద్ధాప్య ఛాయ‌లు క‌న‌ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ని అన్నారు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు కూడా మొద‌ట అలాగే భావించార‌ని, కానీ, ఓ సినిమాలో న‌టించిన త‌ర్వాత త‌న అభిప్రాయాన్ని మార్చుకున్నార‌ని చెప్పారు. హీరోలుగా ఉన్న స‌మ‌యంలో ఎలా క‌న‌ప‌డ్డామో జీవితాంతం అలాగే క‌న‌ప‌డాల‌ని కొంద‌రు భావిస్తార‌ని అన్నారు.

త‌న అన్న‌య్య వెంక‌టేశ్వ‌ర‌రావు ఎన్నో గొప్ప స్క్రీన్ ప్లేలు అందించార‌ని చెప్పారు. ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న బాగా మాట్లాడుతున్నార‌ని చెప్పారు. ఇటీవ‌ల త‌న అన్న‌య్య ఫొటో చూసిన కొంద‌రు దానిపై స్పందించాల‌ని అడిగార‌ని అందుకే మాట్లాడుతున్నాన‌ని చెప్పారు. అంద‌రి అభిమానానికి వంద‌నాలు చెబుతున్నాన‌ని అన్నారు.