అధికారులు దర్యాప్తు చేపట్టాలి.. అభిమాని మృతిపై ఎమోషనల్ అయిన ఎన్టీఆర్..
జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ మరణంపై తాజాగా ఎన్టీఆర్ భావోద్వేగమయ్యారు. అతని కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తూ తారక్ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ (NTR) వీరాభిమాని శ్యామ్ (Shyam) నిన్న అనుమానస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. శ్యామ్ మరణంపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటూ అభిమానులు అంటున్నారు. ఈ సందర్భంగా శ్యామ్ కుటుంబానికి న్యాయం చేయాలని సోషల్ మీడియాలో పోరాటం చేస్తున్నారు. We Want Justice for Shyam NTR అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు.
తూరుప్పు గోదావరి జిల్లాలోని కొప్పిగుంటకు చెందిన శ్యామ్ మరణం సంచలనంగా మారింది. ‘దాస్ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజీపైకి వచ్చి ఎన్టీఆర్ ను హత్తుకున్న వ్యక్తే శ్యామ్. దీంతో ఆయన మరణం వెనక ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో ప్రభుత్వం విచారణ చేయాలంటూ తారక్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఎన్టీఆర్ కూడా స్పందించారు. ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. ప్రెస్ నోట్ విడుదల చేశారు. దాని ప్రకారం.. శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన. శ్యామ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలిచి వేస్తోంది. ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని కోరుతున్నాను... అంటూ పేర్కొన్నారు.
ప్రస్తుతం తారక్ విడుదల చేసిన ప్రెస్ నోట్ నెట్టింట వైరల్ గా మారింది. తన అభిమాని మరణంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేయడంతో ఫ్యాన్స్ మరింత బలంగా న్యాయం కోరుతున్నారు. ఇప్పటికే ఈ విషయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు కూడా స్పందించిన విషయం తెలిసిందే. శ్యామ్ అనుమానాస్పదంగా మరణించారని, దీని వెనకాల అధికారిక పార్టీ నేతల హస్తం ఏమైనా ఉందేమోనని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.