మే20వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్బంగా  ప్రతి ఏడాది ఫ్యాన్స్ బర్తడే సెలబ్రేషన్స్ ను ఘనంగా జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే  క్రితం సంవత్సరం తన పుట్టిన రోజు వేడుకలకు ఎటువంటి హడావిడి చేయవద్దని జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులను కోరారు. తన తండ్రి హరికృష్ణ చనిపోయి ఇంకా ఏడాది కూడా పూర్తికాలేదని, ఈ విషాద ఘటన నుంచి తాను ఇంకా తేరుకోలేదని ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో అప్పుడు చేయలేదు. ఆ యేడుది, ఈ సంవత్సరానిది అన్నట్లుగా ఇప్పుడు జరిపేయాలని ఫ్యాన్స్ ఫిక్స అయ్యారు. 

దాంతో ఎన్టీఆర్ కి ఇది మరింత ప్రత్యేకమైన పుట్టినరోజు అని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ పుట్టినరోజున తాను ఒక స్పెషల్ గిఫ్ట్ ను సిద్ధం చేసినట్టుగా నారా రోహిత్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఆ స్పెషల్ గిఫ్ట్ ఏమిటో తెలుసుకోవాలంటే ఈ నెల 20వ తేదీ వరకూ వేచి వుండవలసిందేనని అన్నాడు. ఎన్టీఆర్ - నారా రోహిత్ ఇద్దరి మధ్య మంచి రాపో వుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కి నారా రోహిత్ ఇవ్వనున్న స్పెషల్ గిఫ్ట్ ఏమై ఉంటుందా అనేది ఫిల్మ్ సర్కిల్స్ లో, అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.

 ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అలాగే  త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లటానికి రంగం సిద్దమైంది. ఇక కేజీఎఫ్ తో  సంచలన దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోను ఒక సినిమా చేయనున్నాడు. ఈ పుట్టిన రోజు సందర్భంగా 'ఆర్ ఆర్ ఆర్' నుంచి స్పెషల్ వీడియో .. త్రివిక్రమ్ మూవీ నుంచి టైటిల్ పోస్టర్ .. ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు గురించిన ప్రకటన వెలువడనున్నాయి.