Asianet News TeluguAsianet News Telugu

అల్లు అర్జున్‌ సినిమాల్లో నటించాల్సిన అవసరం లేదు.. ఎవరూ తొక్కేయలేరు.. కిర్రాక్‌ ఆర్పీ సంచలన స్టేట్‌మెంట్‌

కిర్రాక్‌ ఆర్పీ మరోసారి రెచ్చిపోయాడు. అల్లు అర్జున్‌ విషయంలో ఆయన మరోసారి ఫైర్‌ అయ్యాడు. ఇండస్ట్రీలో ఎవరూ ఎవరినీ తొక్కేయలేరు అంటూ హాట్‌ కామెంట్‌ చేశారు. 
 

kiraak rp sensational statement on allu arjun create new controversy arj
Author
First Published Jul 2, 2024, 11:51 AM IST

జబర్దస్త్ షో ద్వారా పాపులర్‌ అయ్యాడు కిర్రాక్‌ అర్పీ. షో ప్రారంభంలోనే ఆయన కమెడియన్‌ గా మంచి పేరుతెచ్చుకుని స్టార్‌ కమెడియన్‌గా ఎదిగాడు. ఈ క్రమంలో సినిమా ఆఫర్లు రావడంతో జబర్దస్త్ షోకి గుడ్‌ బై చెప్పాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మెరిసి అలరించాడు. నవ్వులు పూయించాడు. అనంతరం వంటల వ్యాపారంలోకి దిగాడు కిర్రార్‌ ఆర్పీ. `నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు` పేరుతో కర్రీ సెంటర్స్ ఏర్పాటు చేసి మరింత పాపులర్‌ అయ్యారు. ఆయన తయారు చేసే చేపల పులుసుకి ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో బ్రాంచ్‌లను విస్తరించారు. హైదరాబాద్‌, తిరుపతి, వైజాగ్‌ వంటి ప్రాంతాల్లో ఆయన కర్రీ సెంటర్స్ ఏర్పాటు చేశాడు. 

వ్యాపార పరంగా దుమ్ములేపుతున్న కిర్రాక్‌ ఆర్పీ ఇప్పుడు రాజకీయాలపై ఫోకస్‌ పెట్టాడు. ఏపీ ఎన్నికలకు ముందు నుంచే యాక్టివ్‌గా మారాడు. టీడీపీకి  సపోర్టర్‌గా నిలుస్తూ వస్తున్నారు. ప్రెస్‌ మీట్లు పెట్టి వివాదస్పద కామెంట్లు చేస్తూ దుమ్ము రేపుతున్నాడు. మాజీ మంత్రి రోజాపై ఆయన రెచ్చిపోయి కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఎన్నికలకు ముందు అల్లు అర్జున్‌పై కూడా కామెంట్‌ చేశారు. పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కి ట్వీట్‌ ద్వారా సపోర్ట్ చేసిన బన్నీ, తన భార్య స్నేహారెడ్డి స్నేహితురాలి భర్త నంధ్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం స్వయంగా వెళ్లి ప్రచారం చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. 

సొంత మామ పవన్‌కి ప్రచారం చేయకుండా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేయడమేంటి? ఆయన కోసం స్వయంగా వెళ్లి ప్రచారం చేయడమేంటి? అంటూ జనసేన, టీడీపీ కార్యకర్తలు విమర్శించారు. మెగా అభిమానులు సైతం బాగా హర్ట్ అయ్యారు. ఆ సమయంలో బన్నీపై దారుణంగా ట్రోల్స్ కూడా నడిచాయి. ఆ సందర్భంలోనే అల్లు అర్జున్‌పై విమర్శలు చేశాడు కిర్రాక్‌ ఆర్పీ. బన్నీ చేసింది తనకు నచ్చలేదని తెలిపారు. ఓపెన్‌గా విమర్శలు చేయడం హాట్‌ టాపిక్‌ అయ్యాయి. 

ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి దీనిపై మాట్లాడాడు కిర్రాక్‌ ఆర్పీ. సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో మాట్లాడుతుండగా, అల్లు అర్జున్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. దీనికి కిర్రాక్‌ ఆర్పీ స్పందిస్తూ షాకింగ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అల్లు అర్జున్‌ సినిమాల్లో తాను నటించనని ప్రకటించారు. తనకు నటించాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు హోటల్‌తోనే పోల్చాడు. తినడానికి మెస్‌కి వెళ్తాం. అక్కడ సాంబారు, చట్నీ బాగా లేదు, దీంతో  ఆ హోటల్‌ యజమానికి మంచి కోసం చెబుతాం. అలాగని నా హోటల్‌కి రావద్దని చెబుతాడా? అలా చెబితే నాకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చేసుకుని తింటా, లేదంటే వేరే హోటల్‌కి వెళ్లి తింటా. బయట ఎన్ని లేవు,  అల్లు అర్జున్‌ విషయంలోనూ అంతే అని, ఆయన సినిమాలు కాకపోతే వేరేవి. చాలా మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఉన్నారు. చాలా సినిమాలు వస్తున్నాయి. 

చిత్తూరు నాగయ్య నుంచి చిరంజీవి దాకా, ఇప్పుడు కొత్త జనరేషన్‌ వస్తుంది. అలాగే దర్శకుడు, నిర్మాతలు, కెమెరామెన్లు, అసిస్టెంట్లు, ఇలా సినిమాకి సంబంధించిన 24 క్రాఫ్ట్ లు ఉన్నాయి. ఒకటి కాకపోతే మరోటి. ఇక్కడ ఎవరూ ఎవరినీ అణచి వేయలేరు, ఎవరినీ తొక్కలేరు అని ఘాటుగా స్పందించాడు కిర్రార్‌ ఆర్పీ. అల్లు అర్జున్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, జీవితాంతం ఇదే మాట మీద ఉంటానని స్పష్టంచేశాడు. ప్రశ్నిద్దామని రాజకీయాల్లోకి వచ్చానని, ప్రశ్నిస్తూనే ఉంటానని వెల్లడించారు. ప్రస్తుతం కిర్రాక్‌ ఆర్పీ కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. 

అల్లు అర్జున్‌ ప్రస్తుతం `పుష్ప2`లో నటిస్తున్నాడు. సుకుమార దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఆగస్ట్15న రావాల్సిన ఈ మూవీ వాయిదా పడిన విషయం తెలిసిందే. డిసెంబర్‌ 6న విడుదల చేయబోతున్నట్టు టీమ్‌ ప్రకటించింది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, ఫహద్‌ ఫాజిల్‌, అనసూయ, సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో `పుష్ప 2` తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మూడేళ్ల క్రితం వచ్చిన `పుష్ప`కిది పార్ట్ 2 గా వస్తుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios