ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య,పి.హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక... శాసనమండలిలో ఖాతా తెరిచిన జనసేన
ఏపీ శాసనమండలిలో జనసేన పార్టీ ఖాతా తెరిచింది. శాసనమండలిలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ తరఫున సి.రామచంద్రయ్య, జనసేన తరఫున పి.హరిప్రసాద్ నామినేష్ వేయగా.. పోటీలో ఎవరూ లేకపోవడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీలుగా తెలుగుదేశం పార్టీ తరపున సి.రామచంద్రయ్య, జనసేన పార్టీ తరపున పి.హరి ప్రసాద్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం.విజయరాజు శుక్రవారం అసెంబ్లీ భవనంలో ప్రకటించారు. ఎమ్మెల్యేల కోటా కింద రాష్ట్ర శాసనమండలిలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి నామినేషన్ల ఉప సంహరణ గడువు శుక్రవారంతో ముగిసింది. కాగా, కేవలం ఇద్దరు అభ్యర్థులు సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. దీంత వారిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి విజయ రాజు ప్రకటించారు.
సి.రామచంద్రయ్య నేపథ్యమిదీ...
సి.రామచంద్రయ్య 1948 మే 27న వైఎస్‌ఆర్ జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం గుడ్లవారిపల్లె గ్రామంలో జన్మించారు. బీకామ్ వరకు చదివి.. చార్టర్ అకౌంటెంట్‌గా పనిచేశారు. 1981లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎన్టీయార్ మంత్రివర్గంలో 1986 నుంచి 1988 వరకు 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమ అమలు మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రెండుసార్లు తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1999 నుంచి 2004 వరకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్‌మెంట్ అండ్ ఫారెస్ట్స్ చైర్మన్‌గా పనిచేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు.
సి.రామచంద్రయ్య 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ తరపున 2011లో ఎమ్మెల్సీగా ఎన్నికై కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో 2012లో దేవదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.
2018లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధిగా వివిధ హోదాల్లో పనిచేశారు. 2021లో శాసనసభ్యుల కోటాలో వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2023 జనవరిలో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో 2024 మార్చి 12న శాసనమండలిలో రామచంద్రయ్యపై అనర్హత వేటు వేసినట్లు మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. ఇక, తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
జర్నలిజం నుంచి రాజకీయాల్లోకి ...
ఏలూరుకు చెందిన హరిప్రసాద్ డిగ్రీ వరకు అక్కడే చదివారు.. విజయవాడ సిద్ధార్థ న్యాయ కళాశాలలో బి.ఎల్. పూర్తిచేశారు. లా చదివినప్పటికీ జర్నలిజం వృత్తిని ఎంచుకున్నారు. ప్రింట్& ఎలక్ట్రానిక్ రంగంలో విశేషానుభవం ఉంది. సుమారు పాతికేళ్లపాటు మీడియా రంగంలో ఉన్నత స్థానాల్లో పనిచేశారు. ఈనాడు & ఈటీవీలో సుదీర్ఘకాలం పనిచేశారు. ఆ తర్వాత పలు టీవీ ఛానెళ్లలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. జనసేన ఆవిర్భావం తరువాత ఆ పార్టీ మీడియా హెడ్‌గా, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శిగా పార్టీకి సేవలు అందిస్తున్నారు.