కన్నడ హీరో యశ్ హీరోగా వచ్చిన  ‘కేజీఎఫ్ చాప్టర్ 1’  ఎంత సూపర్ హిట్  అయిందో వేరే చెప్పనవసరం లేదు. ఆ సినిమా కలెక్షన్స్ ఓ రేంజిలో అదరకొట్టాయి.  ఏకంగా వరల్డ్ వైడ్ గా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. రిలీజ్ అయిన అన్ని భాషల్లో సక్సెస్ కావడంతో ఇప్పుడు దాని సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరో ప్రక్క కేజీఎఫ్ చిత్రం శాటిలైట్ రైట్స్‌కి సంబంధించిన ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ స‌మ‌యంలో తెలుగు లోక‌ల్ ఛానెల్ ఈ చిత్రాన్ని ప్ర‌సారం చేయ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు కేజియఫ్ నిర్మాత కార్తీక్ గౌడ. 

ఎవ్రీ అనే తెలుగు లోక‌ల్ ఛానెల్ కేజీఎఫ్ చిత్రాన్ని అక్ర‌మంగా ప్ర‌సారం చేసింది . వారిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటాము. ఓ వైపు శాటిలైట్ డీల్స్ దాదాపు ఫైన‌ల్ అవుతున్న స‌మ‌యంలో కేబుల్ ఛానెల్ చిత్రాన్ని ప్ర‌సారం చేసింది. తమ దగ్గర ఆ ఛానెల్‌లో ప్రసారమైనట్టు స్క్రీన్ షాట్స్, వీడియోలు ఉన్నాయని తెలిపాడు కార్తిక్ గౌడ. ఇలాంటి నీచమైన సంస్క‌ృతి లోకల్ చానెల్స్‌లో ఉందని.. శాటిలైట్ రైట్స్‌పై, డిజటల్ హక్కులపై వారికి కనీస గౌరవం కూడా లేద‌ని స్ప‌ష్టం చేశాడు.   

ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘కేజీఎఫ్ 2’ టైటిల్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. అక్టోబర్ లో రిలీజ్ కానున్న ఈచిత్రం కోసం అమెజాన్ ప్రైమ్ భారీ ధరకి దక్కించుకుంది . ఎన్నడూ లేని విధంగా ఓ దక్షిణ భారత చిత్రానికి 55 కోట్లను చెల్లించినట్టు సమాచారం.