కమల్ హాసన్‌కు కరోనా లక్షణాలు కనిపించాయని.. ఆయన ఇంటి బయట కూడా దానికి సంబంధించిన నోటీస్ ఉందంటూ ప్రచారం మొదలైంది. అంతేకాదు ఆయన ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు పూర్తిగా సెల్ఫ్ క్వారెంటైన్ చేసుకున్నాడని వార్తలొచ్చాయి. దాంతో తమ అభిమాన హీరోకి ఏమైంది? కరోనా బారిన పడ్డాడా? అని కమల్ ఫ్యాన్స్ అంతా దేశ వ్యాప్తంగా టెన్షన్ పడ్డారు. అయితే కాసేపటికి అలాంటిదేమీ లేదని స్వయంగా కమల్ హాసన్ చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అవన్నీ రూమర్స్ అని కమలే స్పష్టం చేశారు. అంతేకాదు, అధికారులు కమల్ ఇంటికి అతికించిన హోం క్వారంటైన్ స్కిక్టర్ ని తొలగించేశారు.

ఇంతకీ ఏం జరిగింది...
చెన్నైలోని ఆల్వార్‌పేట్‌లో ఉన్న కమల్ హాసన్ ఇంటికి గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు ‘హోం క్వారంటైన్’ స్టిక్కర్‌ను అతికించారు. ఆ తర్వాత కాసేపటికి ఆ స్టిక్కర్‌ను తొలగించారు. ఈ లోపలే ఆ సమాచారం అభిమానులకు చేరింది. హోం క్వారంటైన్ స్టిక్కర్ అంటించిన కమల్ ఇంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో తమ హీరోకు ఏమైందో అని ఫ్యాన్స్ భయపడ్డారు. ఎంక్వైరీలు మొదలుపెట్టారు. ఈ విషయం కమల్ వరకు చేరింది. దీంతో ఆయన స్పందించారు. అభిమానులను ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆ ప్రకటనలో ఏముంది..
‘‘నా ఇంటి బయట గోడకు నోటీస్ అంటించడం వల్ల నేను క్వారంటైన్‌లో ఉన్నానని ఒక వార్త వ్యాపించింది. అలాంటిదేమీ లేదు. కొన్నేళ్లుగా ఆ ఇంట్లో నేను ఉండటం లేదు. ప్రస్తుతం ఆ ఇంటిని మక్కల్ నీది మయ్యం పార్టీ ఆఫీస్ గా వినియోగిస్తున్నాం. కాబట్టి, నేను క్వారంటైన్‌లో ఉన్నానని వచ్చిన వార్తలు అవాస్తవం’’ అని తన ప్రకటనలో కమల్ హాసన్ స్పష్టం చేశారు. అంతేకాదు ముందు జాగ్రత్తగా, కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడంలో భాగంగా తాను సామాజిక దూరాన్ని పాటిస్తున్నానని కమల్ తెలిపారు. ప్రజలు కూడా సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

తమ కుటుంబం మొత్తం సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉందని ఇప్పటికే కమల్ కూతురు, హీరోయిన్ శృతిహాసన్ ప్రకటించింది. ఇటీవల లండన్ నుంచి వచ్చిన శృతిహాసన్.. తాను, తన తల్లి సారిక ముంబైలో వేర్వేరు ఇళ్లలో ఒంటరిగా ఉంటున్నామని చెప్పారు. అలాగే, తన తండ్రి కమల్ హాసన్, చెల్లెలు అక్షర చెన్నైలోని వేర్వేరు ఇళ్లలో ఒంటరిగా ఉంటున్నారని చెప్పింది.