‘పేట’తో ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపిన రజనీకాంత్‌ ‘దర్బార్‌’తో మరోసారి పలకరించనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలోని ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా పూర్తయిన విషయం తెలిసిందే. అలాగే ఈ మధ్యన రెండు రోజులుగా రజనీకాంత్‌ తనకు సంబంధించిన సన్నివేశాలకు డబ్బింగ్‌ సైతం చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.  ఆదిత్య అరుణాచలం అనే పోలీసు అధికారి పాత్రలో రజనీకాంత్‌ కనిపించనున్నారు. ఈ నేపధ్యంలో తమిళంలో ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చి పూర్తి స్దాయిలో  బిజినెస్ జరుగుతోంది. అయితే తెలుగు పరిస్దితి ఏమిటి అనేది క్వచ్చిన్ మార్క్ గా మారింది.

ఒకప్పుడు తెలుగులో రజనీ సినిమాలకు క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. డిస్ట్రిబ్యూటర్స్ సినిమా రైట్స్ కోసం ఎగబడేవారు. అయితే గత మూడు సంవత్సరాలుగా రజనీ నటించిన ఒక్క సినిమా కూడా తెలుగులో ఆడటం లేదు. మరీ ముఖ్యంగా ఆయన సినిమాలు తెలుగువారికి రొటీన్ గా ఉన్నాయని ప్రక్కన పెట్టేస్తున్నారు. మొన్న సంక్రాంతికి వచ్చిన పేట సైతం తెలుగులో డిజాస్టర్ అయ్యింది. ఈ ప్రభావం ఇప్పుడు తాజా చిత్రంపై పడనుంది. తెలుగు పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ ఈ సినిమాని తీసుకోవటానికి ఉత్సాహం చూపించటం లేదు. దానికి తోడు తమిళ క్రేజ్ ని చూసి తెలుగులో కూడా అదే స్దాయి బిజినెస్ చేయాలని నిర్మాతలు భావించటం దెబ్బ కొడుతోంది. ఈ నేపధ్యంలో ఏ స్దాయిలో బిజినెస్ జరిగి, రిలీజ్ అవుతుందనేది ట్రేడ్ వర్గాల్లో సస్పెన్స్ గా మారింది.  ఇదంతా చూసిన వారు రజనీకు ఇలాంటి సిట్యువేషన్ రావటం అవమానమే అంటున్నారు.

నయనతార హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో... నివేదా థామస్‌, ప్రకాశ్‌రాజ్‌, యోగిబాబు, మనోబాలా, సుమన్‌, హరీష్‌ ఉత్తమన్‌, ఆనంద్‌రాజ్‌, శ్రీమన్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  ఈ  సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని డిసెంబరు ఏడో తేదీన నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించనున్నట్లు సమాచారం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు 12న ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. అయితే తన పుట్టిన రోజున సాధారణంగా ఏకాంతాన్నే కోరుకుంటారు రజనీకాంత్‌. అందువల్ల ఆ రోజున ఆడియో వేడుక ఉండకపోవచ్చని తెలుస్తోంది.