కరోన లాక్‌ డౌన్‌ ఎంతో నష్టం చేసినా కొన్ని లాభాలు కూడా చేసింది. ఈ జనరేషన్‌ సమయం లేక పురాణాలు, ఇతిహాసాలను పక్కన పడేశారు. కానీ లాక్‌ డౌన్ కారణంగా సీరియల్స్ సినిమా షూటింగ్‌లు ఆగిపోవటంతో 80ల నాటి అద్భుత దృశ్యకావ్యం రామాయణ్ సీరియల్‌ను తిరిగి టీవీలలో టెలికాస్ట్ చేస్తున్నారు. దీంతో చాలా మంది అప్పటి అనుభవాలను అనుభూతులను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.

తాజాగా ఆ సీరియల్‌లో సీత పాత్రలో నటించిన దీపికా చిఖ్లియా షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ సంఘటనను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. వనవాసం ఎపిసోడ్ చిత్రీకరణ జరుగుతుండగా తీసిన ఫోటోలను షేర్ చేసిన దీపిక అప్పుడు జరిగిన ఓ భయానక ఘటనను వివరించింది.. `ఈ ఫోటోల వెనుక ఓ కథ ఉంది. ఆ షూటింగ్ ఓ మర్రి చెట్టు కింద జరుగుతోంది. అంతా షూటింగ్‌లో బిజీగా ఉన్నాం. నేను, రాముడు, లక్ష్మణుడు డైలాగులు ప్రాక్టిస్‌ చేస్తున్నాం.

ఆ సమయంలో అక్కడి వచ్చిన కెమెరామెన్‌ అజిత్ నాయక్‌ గట్టిగా అందరినీ చెట్టు దగ్గర నుంచి దూరంగా వెళ్లాలని అరిచాడు. ఎవరికీ ఏమీ అర్ధం కాలేదు. దర్శక నిర్మాత సాగర్‌ కూడా అలా చూస్తూ ఉండిపోయారు. మిగతా వారిని కూడా వెళ్లిపోయాలని ఆయన సూచించాడు. తెరుకొని చెట్టు మీదకు చూడగా అక్కడ ఓ పెద్ద పాము ఉంది. దీంతో ఒక్కసారిగా అందరం ప్రాణభయంతో అక్కడి నుంచి పురుగులు తీశాం` అంటూ గుర్తు చేసుకున్నారు.