సాధారణంగా క్రికెట్ అభిమానులు సినీ అభిమానులు డిఫరెంట్‌గా ఉంటారు. కానీ ఇటీవల ఓ ఆస్ట్రేలియన్ క్రికెటర్ మాత్రం క్రికెట్‌ అభిమానులను, సినీ అభిమానులను కలిపేశాడు. అతను మరెవరో కాదు ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా క్రికెట్ టోర్నమెంట్స్‌ కూడా అన్ని ఆగిపోయాయి. దీంతో ఇంటికే పరిమితమైన వార్నర్‌ తన ఫ్యామిలీతో కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. 

వరుసగా తెలుగు పాటలకు, డైలాగ్స్‌కు టిక్ టాక్‌ వీడియోలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. బుట్టబొమ్మ, పోకిరి, బాహుబలి డైలాగ్స్‌తో టాలీవుడ్‌ అభిమానులను అలరించిన వార్నర్‌కు ఇతర హీరోల అభిమానుల నుంచి రిక్వెస్ట్‌లు వచ్చాయి. ముఖ్యంగా ఒక్క మహేష్ బాబు పాటకు డ్యాన్స్ చేయాలంటూ చాలా మంది అభిమానులు కోరారు. దీంతో వార్నర్‌ కూడా మైండ్‌ బ్లాక్‌ పాటకు డ్యాన్స్ చేస్తానంటూ ముందే చెప్పాడు.

ఈ రోజు సరిలేరు నీకెవ్వరు సినిమాలోని మైండ్ బ్లాక్‌ పాటకు టిక్ టాక్ వీడియో చేశాడు. ఫస్ట్ పార్ట్ అంటూ ఆ వీడియోను పోస్ట్ చేశాడు. మైండ్‌ బ్లాక్‌ పాటకు మైండ్ బ్లాక్‌ అయ్యే రేంజ్‌లో స్టెప్స్‌ వేశాడు వార్నర్‌. 15 సెకన్ల వీడియో కోసం 51 సార్లు ప్రాక్టిస్ చేశాడట వార్నర్‌. ఈ విషయాన్ని కూడా తానే స్వయంగా వెల్లడించాడు వార్నర్‌. ఈ వీడియోలో వార్నర్‌తో పాటు ఆయన సతీమణి కూడా ఆడిపాడింది.