దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలై ఇప్పటికే ఏడాది సమయం గడచిపోయింది. 

నటీనటుల వివరాలు మినహా రాజమౌళి ఈ చిత్రం గురించి ఎలాంటి విశేషాలు తెలియజేయలేదు. అటు రాంచరణ్ అభిమానులు, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి ఈ చిత్రం కోసం విభిన్నమైన కాన్సెప్ట్ ఎంచుకున్నారు. 

స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతా రామరాజు, కొమరం భీం యుక్తవయసులో ఉన్నప్పుడు రెండేళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ సమయంలో వీరిద్దరూ కలుసుకుని స్నేహితులుగా మారి ఉంటే ఎలా ఉండేది అనే ఆసక్తికర అంశాన్ని కల్పిత గాధగా చిత్రీకరిస్తున్నారు. 

ఆర్ఆర్ఆర్ మూవీ 1920 బ్రిటిష్ కాలం నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది. ఇదిలా ఉండగా చిత్రాన్ని ప్రారంభించిన సమయంలోనే 2020 జులై 30న రిలీజ్ చేస్తామని రాజమౌళి ప్రకటించారు. దీనితో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు సరిగ్గా 250 రోజుల సమయం ఉంది. దీనితో అభిమానులు సోషల్ మీడియాలో కౌంట్ డౌన్ ప్రారంభించారు. 250DaysToMassiveRRR పేరుతో ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. 

సినిమా రిలీజ్ కు 250 రోజుల ముందే కౌంట్ డౌన్ ప్రారంభించారంటే ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థం అవుతోంది. ఇక రాజమౌళిదే ఆలస్యం. సినిమాని అనుకున్న సమయానికి పూర్తి చేసి విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ 70 శాతం షూటింగ్ పూర్తయినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఈ చిత్రంలో రాంచరణ్ కు హీరోయిన్ గా అలియా భట్, ఎన్టీఆర్ కు హీరోయిన్ గా ఒలివియా అనే బ్రిటిష్ భామ నటిస్తోంది. ఐర్లాండ్ కు చెందిన హాలీవుడ్ నటులు అలిసన్ డూడి, రే స్టీవెన్సన్ విలన్లుగా నటిస్తుండడం విశేషం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డిడివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు.