సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుతో సంబంధం వున్న డ్రగ్స్ కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) మంగళవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో అరెస్టయిన వారిలో ఆమె పదో వ్యక్తి. దీనిపై బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే  మాట్లాడుతూ.. డ్రగ్స్ డీలర్లలో సంబంధాలున్నాయనే కోణంలోనే రియాను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.

రియాకు వ్యతిరేకంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బలమైన ఆధారాలే సంపాందించినట్లుందని ఆయన అభిప్రాయపడ్డారు. రియా నుంచి ఎన్సీబీ అధికారులు పూర్తి సమాచారం రాబట్టారని అనుకుంటే, ఆమెకు డ్రగ్స్ విక్రేతలతో సంబంధాలు కూడా ఖచ్చితంగా వెల్లడై ఉంటాయని గుప్తేశ్వర్ అన్నారు.

ఈ కోణంలో రియా పాత్ర స్పష్టం కావడంతో ఆమెను అరెస్ట్ చేసి వుంటారని పాండే అభిప్రాయపడ్డారు. కాగా ఇదే కేసులో రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తిని ఆమె సహచరుడు శామ్యూల్ మిరాండా ఇప్పటికే అరెస్టయిన సంగతి తెలిసిందే.

కాగా సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్‌తో పాటు ఢిల్లీలోని ఆర్ఎంఎల్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ తరుణ్ కుమార్‌లపై ఐపీసీ, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం, టెలీ మెడిసిన్ ప్రాక్టీస్ మార్గదర్శకాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రియా ఇంతకుముందే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ప్రియాంక సింగ్... డాక్టర్ తరుణ్ కుమార్ చేత ప్రిస్క్రిప్షన్ పంపించారని అతను నిషేధిత ఔషధాలను సుశాంత్‌కు ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సుశాంత్ మరణానికి సంబంధించి రియా సహా మరికొందరిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది

జూలై 28న సుశాంత్ తండ్రి కేకే సింగ్.. బీహార్‌లో రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జూలై 31న మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ముంబైలోని తన నివాసంలో సుశాంత్ సింగ్ జూన్ 14న అనుమానాస్పద స్థితిలో మరణించారు.