ఇటీవల నిర్వహించిన 65వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవంలో తాప్సీ మొదటిసారి ఉత్తమనటి (క్రిటిక్స్) అవార్డుని సొంతం చేసుకుంది. 'సాండ్ ఖీ ఆంఖ్' చిత్రానికి గాను తాప్సీ, భూమి ఫడ్నేకర్ ఈ అవార్డుని సొంతం చేసుకున్నారు.

అయితే ఈ ఏడాది నిర్వహించిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాప్సీ స్పందించింది. తాజాగా ఓ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆమె ఈ విషయంపై స్పందించారు.

ఆమె మాట్లాడుతూ.. '2016 నుండి అవార్డులను సొంతం చేసుకుంటే స్టేజ్ పై ఏం మాట్లాడాలనే విషయంలో స్పీచ్ సిద్ధం చేసుకునేదాన్ని. గడిచిన నాలుగేళ్లలో నాకు మాట్లాడే అవకాశం రాలేదు. ఈ ఏడాది మాత్రం నేను ఎలాంటి స్పీచ్ సిద్ధం చేసుకోలేదు. కానీ స్టేజ్ పై మాట్లాడాల్సి వచ్చింది. ఇన్నేళ్లు సమయం తీసుకునప్పటికీ అవార్డు గెలుపొందడం నాకు సంతోషాన్ని కలిగించింది. ఇంతకుమించి నేనేం చెప్పగలను'' అంటూ వెల్లడించింది.

అనంతరం ఫిల్మ్ ఫేర్ కాంట్రవర్శీ గురించి మాట్లాడుతూ.. ''నిజానికి ఎప్పుడూ ఏదొక కాంట్రవర్శీలో నేను ఉండేదాన్ని. కానీ ఈ సారి కాంట్రవర్శీలో నా పేరు లేకపోవడం బాగుంది. దాన్ని బట్టి చూస్తుంటే ఈ ఏడాది ఫిల్మ్ ఫేర్ అవార్డుకి నేను అర్హురాలినేనని చాలా మంది నమ్ముతున్నారు'' అంటూ చెప్పుకొచ్చింది.