Asianet News TeluguAsianet News Telugu

‘భీష్మ’పై పోలీసు కంప్లైంట్.. దర్శకుడు,హీరోలపై చర్య డిమాండ్!

మహాభారతంలోని గొప్ప వ్యక్తి అయిన భీష్మాచార్యుడిని అవమానించేలా ఈ సినిమా ఉందని మలక్‌పేట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంఘం అధ్యక్షుడు పెంటం రాజేశ్ ఆరోపించారు. 

Compliant on Bheeshma movie by Gangaputra welfare
Author
Hyderabad, First Published Feb 25, 2020, 10:01 AM IST

ఈ మధ్యకాలంలో ప్రతీ తెలుగు సినిమా ఏదో ఒక వివాదం ఎదుర్కొంటోంది. ముఖ్యంగా కుల సంఘాల నుంచి డైలాగుల గురించో లేక టైటిల్ గురించో వివాదం మొదలవుతోంది. ఆ మధ్యన వాల్మీకి వివాదం మొదలై అది టైటిల్ మార్చి గద్దలకొండ గణేష్ గా మార్చి రిలీజ్ చేసేదాకా వెళ్లింది. ఇప్పుడు రీసెంట్ గా విడుదలైన నితిన్ ‘భీష్మ’ సినిమాపై తెలంగాణ గంగపుత్ర సంక్షేమ సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మహాభారతంలోని గొప్ప వ్యక్తి అయిన భీష్మాచార్యుడిని అవమానించేలా ఈ సినిమా ఉందని మలక్‌పేట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంఘం అధ్యక్షుడు పెంటం రాజేశ్ ఆరోపించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమాపై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత  సూర్యదేవర నాగవంశీ, రచయిత, నటుడు నితిన్, సితార ఎంటర్‌ప్రైజెస్, పీడీపీ ప్రసాద్, ఎడిటర్ నవీన్ నూలిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

'భీష్మ' యూఎస్ కలెక్షన్స్ పరిస్దితి ఏంటి..?

ఆ కంప్లైంట్ లో ...ఇచ్చిన మాట కోసం ప్రతిజ్ఞ చేసి ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయిన భీష్మాచార్యుడి పేరును సినిమాలో అమ్మాయిల వెంట పడే లవర్ బాయ్‌కు పెట్టారని ఆక్షేపించారు. ఇందులో డైలాగులు సమాజంపైనా, యువతపైనా వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే ఈ సందర్భంగా భీష్మ సినిమాలోని డైలాగ్‌ను ఉటంకించారు. హీరో తన తల్లితో మాట్లాడుతూ.. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, యమధర్మరాజు, శని, శకుని వంటి ఎన్నో పేర్లు ఉండగా తనకు ఆజన్మ బ్రహ్మచారి అయిన భీష్ముడి పేరు తనకు ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తాడు. ఈ డైలాగ్‌పైనా సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సమాజంపై ఇది చెడు ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉందని ఆరోపించింది. పైన పేర్కొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సంఘం ఫిర్యాదులో కోరింది.

ఇక ఈ కంప్లైంట్ పై మలక్‌పేట పోలీసులు స్పందించారు. భీష్మ సినిమా డైరెక్టర్, నిర్మాత, రచయిత తదితరులపై ఫిర్యాదు అందిందని తెలిపారు. వీరందరూ కలిసి ‘భీష్మ’ పేరుతో హిందువుల మనోభావాలను గాయపరిచారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios