'కోలా'తో తలగోక్కోవాలంటే అంత భయమా...
చోళ వంశపు రాజుల్లో ప్రముఖుడు రాజేంద్రచోళుడు.ఇతని పాలనలో ఉత్తరాన గంగా తీరం వరకు రాజ్యం విస్తరించింది.కొత్తరాజధానిగా గంగైకొండ చోళపురం నిర్మించాడు.తన తండ్రి రాజరాజ చోళుడు తంజావూరులో నిర్మించిన బృహదీశ్వరాలయం లాంటి నిర్మాణం ఇతనూ కొత్తరాజధానిలో చేసాడు.తండ్రి మీద గౌరవంతో తక్కువ ఎత్తుతో గుడి కట్టించాడు.గంగా తీరం వరకు విజయానికి గుర్తుగా ఆ నది నీళ్లు తెచ్చి ఇక్కడి బావిలో కలిపాడు.
ఈ గంగైకొండ చోళపురం కాకుండా తిరునల్వేలి జిల్లాలో మరొక గంగైకొండన్ అనే గ్రామం ఉంది...తమిళనాడు లో ఇండస్ట్రియల్ హబ్ ఇది..ఎన్నో దేశీవిదేశీ పరిశ్రమలకు నెలవీ ప్రాంతం. పశ్చిమ కనుమల్లో పుట్టి 125 కి.మీ ప్రయాణించే జీవనది తామ్రపర్ణి ఈ పరిశ్రమలకు కావలసిన నీటిని అందిస్తుంది.
ఇక్కడ రెండు బహుళజాతి శీతలపానీయాల కంపెనీలకు బాట్లింగ్ యూనిట్స్ ఉన్నాయ్.ఒక్కొక్కరు రోజుకు 15 లక్షల లీటర్ల నీళ్లు వాడుకునేందుకు అనుమతి ఉంది.ప్రతి 1000 లీటర్లకు 37 రూపాయలు చెల్లించాలి...కానీ శీతల పానీయాలు లీటర్ కే 40 పైచిలుకుండగా,మంచినీళ్ల మీద 20 రూపాయల వరకు మార్కెట్లో అమ్ముతున్నారు.
ప్రస్తుత కరువు పరిస్థితుల వల్ల ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..ఈ ఏడాది తమిళనాడులో సాధారణ స్థాయి కన్నా 60 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది...భూగర్భజలాలు అడుగంటాయి.ఇక తామ్రపర్ణి పరిసరాల్లో సాగు,తాగి నీటికి ఇబ్బందిపడకూడదని ఈ కంపెనీలకు నీళ్లివ్వడం ఆపాలని కొందరు ముధురై కోర్ట్ ను ఆశ్రయించారు.
తమిళనాడులోని 6000 అనుబంధ సంస్థలను,21 లక్షల దుకాణదారులు సభ్యులుగా ఉన్న తమిళనాడు వణిగర్ సంఘం వారు మార్చ్ 1 నుంచి ఈ బహుళజాతి సంస్థలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ముమ్మరం చెయ్యడమే కాకుండా ఆ ఉత్పత్తులను అమ్మొద్దని చెబుతున్నారు.ఇప్పటికే మధురై,కోయంబత్తూర్,తిరుచ్చి లాంటి చోట్ల అనేక చోట్ల శీతలపానీయాలు అమ్మడం లేదు.
ఈ కోలాల రాక మనదేశంలో ఎప్పుడు మొదలైందో గానీ చర్చమాత్రం 1977 తర్వాత కోకాకోలా ను నిషేధించిన తర్వాత ఎక్కువైంది.అప్పటి జనతా ప్రభుత్వము విదేశీ మారకద్రవ్యం అంటూ దీన్ని నిషేధించినా జనం మాత్రం రెండు దశాబ్దాలకు పైగా దీని ఫార్ములా చెప్పనందుకు,కాస్త మద్యం కలుపుతున్నందుకు నిషేధించారని కథలు చెప్పుకునేవారు.సరే ఈ కోకాకోలా మనదేశం నుంచి నిష్క్రమించాక ఎన్నో దేశీ బ్రాండ్లు వచ్చాయి...77,కాంపకోలా వగైరా..మద్యం తయారీదారులు మెక్ డోనాల్డ్స్ వారూ థ్రిల్,రష్,స్ప్రింట్ అంటూ వచ్చినా పార్లే వారి ఉత్పాదనలు గోల్డ్‌స్పాట్,థమ్సప్ ,లిమ్కా ముందు నిలదొక్కుకోలేకపోయారు.
ఆది నుంచీ ఈ వ్యాపారంలో అనారోగ్యకరమైన పోటీనే!బాటిళ్లలో సరఫరా చేసే వీటిలో ఒక బాటిల్లో సగటున 10 సార్లు నింపి మార్కెట్లోకి పంపితేకానీ బాటిల్ ధర గిట్టుబాటు కాదు...ఇంకేముందీ...కడుపు నిండిన కంపెనీ వాళ్ల పోటీదారుల బాటిళ్లు తెచ్చి దాచెయ్యడం...వారి బ్రాండ్ బాటిళ్లు వారికి వేసవి సీజన్లో దొరకవు.
సరే..ఆ తర్వాత రాజీవ్ గాంధి ప్రధాని అయ్యాడు..పెప్సీ ని మన దేశానికి తేవాలనుకున్నాడు....అప్పుడంతా లైసెన్స్ రాజ్ కాబట్టి పార్లమెంట్ లో ఎన్నో గంటల చర్చలు,వందల ఫైల్స్ నడిచాయి...మొత్తానికి పంజాబ్ రైతులకు ఆశలు చూపిస్తూ "లెహర్"పెప్సి అంటూ వచ్చింది...
ఇక్కడా పోటీనే....దేశీ కంపెనీలన్నీ 200 మి.లీ ఇచ్చే ధరకే మేము 250 మి.లీ ఇస్తామంటూ వీళ్లు వచ్చారు...పోటీలో నిలబడాలి కాబట్టి పార్లే వాళ్లూ బాటిల్లన్నీ పడేసి కొత్త బాటిళ్లతో అప్పుడు టీవీలో మహాభారత్ సీరియల్ స్సెజన్ కాబట్టి "మహా" అనే టాగ్ తగిలించుకొచ్చారు...
ఆ తర్వాత పీవీ హయాంలో సరళీకృత ఆర్ధిక విధానాలు వచ్చేసాయి..ఇంకేముంది..కోకాకోలా కు రాజమార్గం దొరికింది...వీళ్లూ ప్రత్యర్ధులను దెబ్బకొట్టాలని 300 మి.లీ వచ్చేసారు.....
ఆబోతుల కొట్లాటల మధ్య లేగదూడలా నలిగిపోతానని తెలుసుకున్న పార్లే అధినేతలు చౌహాన్లు తమ బ్రాండ్లను కోక్ కు అమ్మేసారు....
ఒకప్పుడు అమెరికాలో అమ్మకాలు పెంచుకోవాడానికి ఈ కోలా కంపెనీలు పాప్‌కార్న్ లో కాస్త ఉప్పెక్కువ దట్టించేవాళ్లట..దాహమై జనం ఈ పానీయం తీసుకోవాలని...
ఇక ఈ రెండు బహుళజాతి కంపెనీలొచ్చాక పల్లెల్లోనూ గోలీ సోడాలు మాయమయ్యాయి..ఇక ఊరికి 10,12 బెల్టు షాపులుంటాయి కాబట్టి వీటి వినియోగమూ పెరిగింది....
భారతదేశం లాంటి అధిక జనాభా ఉన్న దేశం ఈ కంపెనీలకు బంగారు గుడ్ల బాతు...వంద కోట్ళ పైబడి జనాభా...తలసరి వినియోగం ఒక బాటిల్ పెంచుకున్నా...లెక్కలేనంత ఆదాయం...అందుకే సినిమా,క్రికెట్ తారల వాణిజ్య ప్రకటనలు....ఏ గోడలు చూసినా ప్రకటనలు....
ఆఫ్రికా ఖండంలోని టూరిజం ప్రాముఖ్యతున్న దేశాల్లో అమ్మకాలకోసం ప్రభుత్వాలనే మార్చే ఘనులు..ఇక మనదేశం విషయానికొస్తే ఒక సంఘటన గురించి గుసగుసలున్నాయి...అది సుస్మిత సేన్,ఐశ్వర్య రై ప్రపంచ సుందరీమణులు కావడం...
అప్పట్లో అమెరికాలో డైట్ పెప్సి కి యాడ్ చేసారు..దాన్ని మనదేశంలో ఆమీర్ ఖాన్ తో చేసారు...ఇంట్లో ఒంటరిగా చెస్ ఆడుతున్న ఖాన్ ను పక్కింటమ్మాయి(మహిమా చౌదరి..పర్‌దేశ్ ఫేం)పెప్సి అడుగుతుంది..ఇంట్లో ఖాళీ బాటిల్ చూసుకుని దొడ్డిదారిన పరిగెత్తి ఒక పెప్సి తెచ్చి ఈవిడకిస్తాడు..ఈలోగా ఇంకో ఆవిడొచ్చి "నేను సంజనా ను,ఇంకో పెప్సి ఉందా" అని అడుగుతుంది...ఈ నీలి కళ్ల సుందరిని చూసి అప్పట్లో ఎందరో మనసు పారేసుకున్నారు(ఇప్పట్లా నెట్ లేదు కాబట్టి ఎవరెవరో తెలిసేది కాదు)...ఆ తర్వాత ఈవిడ ఫెమినా అందాలపోటీ లో పాల్గొంటే రన్నర్ అప్ గా వచ్చింది..విజేత సుస్మిత సేన్ విశ్వసుందరి కాగా ఈవిడ ప్రపంచసుందరైంది...ఆమే ఐశ్వర్యా రై...ఆ వీశ్వసుందరి సుస్మిత కోక్ మోడెల్ అయింది....
పై స్థాయిలో ఇవైతే..కింది స్థాయిలో దుకాణదారులకు లంచాల ఎర చూపుతారు...మోనోపలీ వ్యాపార నిషేధమున్నా బస్‌స్టాండుల్లో ఒకే బ్రాండ్ అమ్మేస్తారు(మా కుర్రాడు ఆ బ్రాండ్ వి ఫ్రిజ్ లో పెట్టలేదనే కబుర్లు చెబుతారు)దీనికి వాళ్లకు ఉచితంగా ఫ్రిజ్జులు ఇవ్వటమే కాదు 40 శాతం సరుకూ ఉచితంగా ఇస్తారు....
సరే మొత్తానికి ఎన్నో విధాలుగా అమ్మకాలు పెంచుకున్నారు...ఒకప్పుడు దేశీ కంపెనీలకు కొన్ని ప్రాంతాల్లో చిన్న బాట్లింగ్ యూనిట్లుండేవి..నిమిషానికి ఏ 60 బాటిళ్లో నింపేవి..ఈ బహుళ జాతి కంపెనీలొచ్చాకా వేలబాటిళ్లు నిమిషంలో నింపేస్తున్నారు..అంతేనా ఈ రంగునీళ్లే కాకుండా మంచినీటి వ్యాపారమూ పెట్రేగిపోయింది..ఇంకేముంది..విచ్చలవిడిగా భూగర్భజలాలు తోడేస్తున్నారు...
ఇక కాస్త పంచదార,ఎసెన్స్ కలిపిన నీళ్లు చెడిపోకూడదని ఏవో రసాయనాలు కలిపేస్తారు...ఈ పానీయాల ఆకర్షణీయమైన ప్రకటనలతో జనాన్నివశ పరచుకుంటున్నారు....
***
ఈ గ్లోబలైజేషన్ అంటేనే అగ్ర రాజ్యాలు సామెత చెప్పినట్టు..."మీ ఇంట్లోంచి పప్పులు తీసుకురా,మా ఇంట్లోం నుంచి పొట్టు తెస్తాను,రెండూ కలిపి ఊదుకు తిందాము" వ్యవహారమే...పాపం ఏదో పెరక్క తిందామనుకున్నారు..ఎవరిది వారికి కాలేసరికి...ఇన్ని గడ్డలు కోసినా నా కడపులో గడ్డంత నొప్పి ఎవరికీ ఉండదన్న డాక్టర్ లా మాట్లాడుతున్నారు...బ్రిటన్ వాళ్లు బ్రెగ్జిట్ అంటారు..అమెరికా వాళ్లు వీసా ఆంక్షలు అంటున్నారు...
మరి మన వనరులు దోచుకుంటుంటే చూస్తూ ఉండాలా?ఈ కంపెనీల బదులు ఎన్నో దేశీ కంపెనీలు మనకు ఉండేవి కాదా?ఈ రోజుకు మన దేశంలో ఎక్కువ అమ్ముడయ్యే కోలా మన దేశీ బ్రాండ్ ధమ్సప్ యే...ఇక రాజమండ్రి లాంటి ఊర్లలో ఆర్టోస్,నెల్లూరు పెండెం సోడా..రాయలసీమ నన్నారి ఉండనే ఉన్నాయి...
మొత్తానికి ఈ కోలా వ్యతిరేక ఉద్యమం పురుడు పోసుకుంది మొన్నటి జల్లికట్టు ఉద్యమంలోనే...మరి ఆ ఉద్యమానికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం దీనికీ స్పందించగలరా?ఒకప్పుడు స్వదేశీ జాగారణ్ మంచ్ అంటూ పెప్సీ వస్తున్నరోజుల్లో కరపత్రాలు పంచిన ఈ ప్రభుత్వ అనుబంధ సంస్థల వైఖరి ఇప్పుడెలా ఉందో!
ఈ బహుళజాతి సంస్థల కొరివితో తలగోక్కోలేమని వదిలేస్తారా?
ఈ ఉద్యమమే కాదు భవిష్యత్తులో ఎన్నో ఉద్యమాలొచ్చే రోజులొచ్చేసాయి...పప్పులు,పొట్టు కలిపి పంచుకోకుండా ఎవడి కొంపలో వాడు తలుపేసుకుని తినేరోజులు రాబోతున్నాయా?
ఏమో..కాలమే సమాధానం చెప్పాలి.