విశాఖ రైల్వే జోన్ : ఆలస్యం క్షమించలేం

Vizag railway should not be  delayed

 

 

తూర్పు కోస్తా ప్రాంతంలో చెన్నయి, కలకత్తా మహానగరాల మధ్య గల అతి పెద్ద నగరం విశాఖపట్నం మాత్రమే. దేశంలోనే ప్రముఖమైన పారిశ్రామిక కేంద్రమే కాకుండా, వ్యూహాత్మకంగా నావికాదళం ప్రధాన కేంద్రాలలో ఒకటి. పేరుపొందిన విద్యా కేంద్రం. ప్రముఖ వాణిజ్య కేంద్రం. ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం కూడా. ఇది మూడు రాష్ట్రాల - ఆంధ్ర ప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీస్ ఘర్ ల కూడలి. 

అన్ని రకాల అర్హతలు గల ఈ నగరంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు గత రెండు దశాబ్దాలకు పైగా కోరుతున్నారు. పలు పోరాటాలు జరుపుతున్నారు. ఈ విషయమై ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ సహితం గతంలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అయినా కేవలం రాజకీయ నాయకత్వం నిష్క్రియత్వం కారణంగా అది కార్యరూపం దాల్చడం లేదు. 

గతంలో పివి నరసింహారావు ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉన్న జాఫర్ షరీఫ్ ఇక్కడ రైల్వే జోన్ ఏర్పాటు చేయడం కోసం నిర్ణయం తీసుకొని, ఆ పక్రియను చేపట్టారు. అది కార్యరూపం దాల్చెలోగా ఆ ప్రభుత్వం పదవీకాలం పూర్తి కావడంతో, ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఆసక్తి చూపక పోవడంతో ఈ ప్రాంత ప్రజల  ఆకాంక్షలు నెరవేరనే లేదు. 

ఈ లోగా `ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్తీకరణ బిల్లు-2014' లో కొత్తగా ఏర్పడే అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం విశాఖపట్నంలో ఆరు నెలల్లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించి అనుకూల నిర్ణయం త్వరగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ  నిబంధనలు చేర్చడంతో తమ ఆకాంక్షలు త్వరలో నెరవేరబోతున్నట్లు ఈ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. 

అయితే రాష్ట్ర విభజన అనంతరం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్ళు కావస్తున్నది. ఈ విషయమై బిజెపి ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రణాళికలో సహితం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని స్పష్టంగా వాగ్ధానం కూడా చేశారు. ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు అనేక పర్యాయాలు ఈ విషయమై కేంద్రం వేగంగా తగు చర్యలు చేబడుతున్నట్లు కూడా ప్రకటించారు. అయినా ఇంకెవరకు ఒక్కడుగు కూడా ముందుకు జరగక పోవడం, పైగా రైల్వే జోన్ ఏర్పాటుకు సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉన్నాయని అంటూ సంకేతాలు ఇస్తూ ఉండడంతో రైల్వే జోన్ విషయంలో ఈ ప్రభుత్వం కూడా వెనుకడుగు వేస్తున్నదనే బలమైన అభిప్రాయం కలుగుతున్నది. 

దేశంలో ప్రతి రాష్ట్రంలో ఒకొక్క రైల్వే జోన్ ను ఏర్పాటు చేశారు. గతంలో వాజపేయి ప్రభుత్వంలో కొత్తగా ఏర్పాటైన ఛత్తీస్ ఘర్, ఝార్ఖండ్ రాష్టాలతో సహా కొత్తగా ఆరు రైల్వే జోన్ లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజనతో దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్ కేంద్రంగా ఉండడంతో ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు రైల్వే జోన్ లేకుండా పోయింది. అసలే అభివృద్ధిలో వెనుకబడిన ఈ రాష్ట్రం సత్వర అభివృద్ధి సాధించడం కోసం రైల్వే జోన్ అవసరాన్ని రాష్ట్ర పునర్విభజన చట్టంలో కూడా గుర్తించారు. అందుకు తగు ప్రతిపాదనలను అందులో చేర్చారు. 

పునర్విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని చిత్తశుద్ధితో అమలు జరుపుతున్నామని అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుండి, పలువురు కేంద్ర మంత్రులు, బిజెపి నాయకులు ప్రతి నిత్యం చెప్పుకొంటూ వస్తున్నారు. అయితే అత్యంత కీలకమైన రైల్వే జోన్ విషయంలో మాత్రం నోరు మెదపటం లేదు. రైల్వే జోన్ ఏర్పాటుకు కు కొన్ని సాంకేతిక అంశాలను  అడ్డు వస్తున్నాయనే సంకేతాలతో తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ అడ్డంకులు ఏమిటో చెప్పే సాహసం చేయడం లేదు. 

రైల్వే జోన్ కు అన్ని అర్హతలున్న విశాఖ 

ఒక రైల్వే జోన్ ఏర్పాటు చేయడం కోసం విశాఖపట్నంకు ఉన్నన్ని అర్హతలు, సదుపాయాలు బహుశా ఈ మధ్య కాలంలో కొత్తగా రైల్వే జోన్ ఏర్పాటు చేసిన ఏ జోన్ కు కూడా లేవని గమనించాలి. రైల్వే బోర్డు ప్రమాణాల ప్రకారం కొత్తగా రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి 600 కి మీ రైల్వే లైన్ ఉండాలి. అయితే గతంలో ఎన్డీయే ప్రభుత్వం 292 కి మీ మాత్రమే రైల్వే లైన్ లు ఉన్న ఛత్తీస్ ఘర్ లో, 411 కి మీ మాత్రమే రైల్వే లైన్ లు ఉన్న ఝార్ఖండ్ లో సహితం రైల్వే జోన్ లను ఏర్పాటు చేసింది. కానీ విశాఖపట్నం కు ఆంధ్ర ప్రదేశ్ లో 1,052 కి మీ పొడవైన రైల్వే మార్గాలు ఉన్నాయి. 

విశాఖపట్నం కేంద్రంగా ఉన్న వాల్తేర్ డివిజన్ దేశం మొత్తం మీద అత్యధికంగా ఆదాయం గల రైల్వే డివిజన్ లలో నాలుగవది కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ డివిజన్ భాగంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ కు 2015-16 లో రు 15,978 కోట్ల ఆదాయం రాగా, అందులో సుమారు సగం మేరకు రు 7,035 కోట్ల వరకు ఈ డివిజన్ నుండే సమకూరింది. 

రైల్వే బోర్డు ప్రస్తుత ప్రమాణాల ప్రకారం రైల్వే జోన్ ఏర్పాటుకు 200 కి మీ స్థలం అవసరం కాగా విశాఖపట్నంలో రైల్వే ల వద్దనే 782 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలానికి అదనంగా రైల్వే హాస్పిటల్, రైల్వే క్వార్టర్స్, ఆఫీసర్స్ క్లబ్ వంటి పలు స్థలాలు కూడా ఉన్నాయి. రైల్వే జోన్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉండడంతో ప్రభుత్వం రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం. క్షణాలలో జోన్ ఏర్పాటుకు ఇక్కడ సదుపాయాలు ఉన్నాయి. 

దేశంలోనే అతిపెద్ద డీజిల్ లోకో షెడ్ ఇక్కడే ఉన్నది. 210 లోకో సామర్ధ్యం గల డీజిల్ లోకో షెడ్ తో పాటు 185 లోకి సామర్ధ్యం గల ఎలక్ట్రికల్ లోకో షెడ్ కూడా ఉంది. వ్యాగన్ వర్క్ షాప్, కోచ్ డిపో వంటి అనేక కీలక రైల్వే మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక ఈ నగరానికి గల రోడ్ల కనెక్టివిటీ బహుశా మరే నగరానికి సమకూరే అవకాశం ఉండకపోవచ్చు. కొత్తవలస-కిరాండల్ ల మధ్య నుండి  ప్రతిరోజూ 8.8 రేక్ ల మూడు ఇనుము రవాణా జరుగుతున్నది. 

పారిశ్రామికాభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతమే రైల్వేలకు సహితం లాభదాయకం కాగలదు. మున్ముందు సహితం ఈ ప్రాంతంలో భారీ పారిశ్రామిక పెట్టుబడులకు రంగం సిద్ధమవుతున్నది. వీటన్నింటికి తోడుగా రైల్వే జోన్ ఏర్పాటు కు బహుశా విశాఖపట్నంలో ఉన్నంత అనుకూల పర్యావరణ పరిసరాలు దేశంలో మరెక్కడా లేవని చెప్పవచ్చు. రెండు పెద్ద ఓడరేవులు - విశాఖపట్నం, గంగవరం ఇక్కడ ఉండగా, తూర్పు నావికాదళం కమాండ్ ప్రధాన కార్యాలయం ఇక్కడనే ఉన్నది. భారత నావికా దళానికి దేశంలో గల అతి ప్రధానమైన మూడు స్థావరాలలో ఇదొక్కటి కావడం గమనార్హం. 

దేశానికి తలమానికంగా నిలచిన అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడ ఉన్నాయి. హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్, బి డి యల్, హిందూస్తాన్ జింక్, భారత ఆహార సంస్థ, భారత గ్యాస్ అథారిటీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వంటివి ఈ సందర్భంగా ప్రముఖంగా పేర్కొన దగినవి. ఇక ప్రతిష్టాకరమైన విద్య సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ, గీతం లతో పాటు 30 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విశాఖ-చెన్నయి పారిశ్రామిక కారిడార్ ఇక్కడి నుండే ప్రారంభం కానున్నది. ప్రముఖ వైద్య కేంద్రంగా కూడా ఈ నగరం పేరొందింది. 

ఈ పరిస్థితులలో రైల్వే జోన్ ఏర్పాటు కు ఈ ప్రాంతానికి గల ప్రాధాన్యత, ఇక్కడ గల సదుపాయాలు దేశంలో మరే ప్రాంతంతో పోల్చదగినవి కావని చెప్పవచ్చు. ఇటువంటి సమయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో క్రియాశీలకంగా పనిచేస్తున్న కొద్దిమంది మంత్రులలో ఒక్కరుగా పేరొందిన సురేష్ ప్రభు ఆంధ్ర ప్రదేశ్ నుండి ఈ మధ్య రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఇక రైల్వే జోన్ సమకూరడం తధ్యం అనే అభిప్రాయానికి ఈ ప్రాంత ప్రజలు వచ్చారు. అయితే ఈ విషయమై రైల్వే మంత్రి నిర్దుష్టంగా ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయక పోవడం ఈ ప్రాంత ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నది. 

శుష్క వాగ్దానాలతో కాలం గడుపుతున్న చంద్రబాబు 

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు సహితం రైల్వే జోన్ విషయంలో శుష్క వాగ్ధానాలు చేస్తూ ఉండటమే గాని అందుకోసం చేయవలసిన ప్రయత్నాలు చేయడం లేదని భావించవలసి వస్తున్నది. వాస్తవానికి గతంలో కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్, ఎన్ డి ఏ ప్రభుత్వాలు ఉన్న సమయంలో ఆయా కూటముల కన్వీనర్ గా చక్రం తిప్పిన్నట్లు చెప్పుకొంటున్న చంద్రబాబునాయుడు రైల్వే జోన్ విషయమై కేంద్రం వద్ద పట్టు పట్టలేదని స్పష్టం అవుతుంది. 

గతంలో కేంద్రంలో చంద్రబాబునాయుడు కీలకమైన పలుకుబడి సాగిస్తున్న సమయంలోనే ఎన్డీయే ప్రభుత్వం కొత్తగా రైల్వే జోన్ లను ఆరు చోట్ల ఏర్పాటు చేసిన సమయంలో అంతకు ముందు పివి నరసింహారావు ప్రభుత్వం ప్రాధమిక చర్యలు తీసుకున్న విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటుకు ఎటువంటి ప్రయత్నం ఆయన జరిపిన దాఖలాలు లేవు. పైగా అప్పుడే కొత్తగా భువనేశ్వర్ కేంద్రంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ను ఏర్పాటు చేసి,  ఆగ్నేయ రైల్వేస్ లో ఉన్న విశాఖపట్నం డివిజన్ ను అందులో కలిపారు. అప్పుడే చంద్రబాబునాయుడు అడ్డుపడి ఉంటె ఆనాడే విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పడి ఉండెడిది. 

చంద్రబాబు నాయుడు తానే ప్రధానమంత్రులుగా ఎంపిక చేసిన్నట్లు చెప్పుకొంటున్న దేవెగౌడ, ఐ కె గుజ్రాల్ ప్రభుత్వాల సమయంలో సహితం విశాఖపట్నం రైల్వే జోన్ కోసం ఎటువంటి కృషి చేసిన దాఖలాలు లేవు. దేశంలో మరే రాష్ట్రానికి లేని విధంగా ఉన్న విస్తారమైన 974 కి మీ కోస్తా ప్రాంతాన్ని రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు ఉపయోగించు కోవడం కోసం పలు కొత్త ఓడరేవులు మాత్రమే కాకుండా మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం కోసం పధకాలు వేస్తున్న చంద్రబాబునాయుడు రైల్వే జోన్ విషయంలో మాత్రం చెప్పుకోదగిన ఆసక్తి కనిపించక పోవడం విచారకరం. 

రైల్వే జోన్ ఏర్పాటుకు అత్యవసరమైనది రాజకీయ సంకల్పం. అటువంటి సంకల్పం నేడు కేంద్రములో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో కనిపించడం లేదు. అందుకనే ఈ విషయంలో ప్రజలు మనోభావాలను వంచించే ప్రయత్నాలు చేస్తున్నారు. 1996లో ఎన్డీయే ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉన్న రామ్ విలాస్ పాశ్వాన్ తన నియోజకవర్గ కేంద్రం హాజీపూర్ చిన్న పట్టణమే అయినా రైల్వే జోన్ గా చేయగలిగారు. 

అదే విధంగా మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో కలకత్తా మెట్రోను ఒక ప్రత్యేక రైల్వే జోన్ గా మలచుకో గలిగారు. ఛత్తీస్ ఘర్, ఝార్ఖండ్ వంటి చిన్న రాష్ట్రాలలో గతంలో రైల్వే జోన్ లను ఏర్పాటు చేసిన ఎన్డీయే ప్రభుత్వం ఇప్పుడు ఐదు కోట్లకు మందికి పైగా జనాభా గల ఆంధ్ర ప్రదేశ్ లో రైల్వే జోన్ ఏర్పాటుపై తాత్సారం చేస్తూ కాలం గడపడం క్షమించరాని అపరాధం అని గుర్తించాలి. 

* రచయిత కొణతాల రామకృష్ణ మాజీ మంత్రి, మాజీ  లోక్ సభ సభ్యుడు. ఇపుడు ఉత్తరాంధ్ర హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. ఈ  అభిప్రాయలు అయన సొంతం.