ఉడుపిలో కొలువైన కొత్త స్వామీజీ
ఆంధ్రులు దేశ దిమ్మరులు అంటె తప్పు కాదేమో. హిందీ తరువాత ఈ దేశములొ అతి ఎక్కువగా వాడకంలో ఉండే భాష తెలుగు. దేశమంతటా దాదాపు 10 కోట్ల మంది దాకా మాట్లాడే భాష. ప్రపంచములొ హిందీ 4 వ స్థానములొ ఉంది. తరువాత మన దేశ భాషలలొ బెంగాళీ (బంగ్లా దేశ్ తో కలిసి) 7 వ స్థానం, 10 వ స్థానం పంజాబీ (పాకిస్థాన్ తొ కలిసి) అక్రమిస్తాయి. తెలుగు 15 వస్థానంలో ఉంది. సుమారు పది కోట్లమంది మాట్లాడతారని అంచనా. తరతరాలుగా సింగపూర్, మలేసియా, మారిషస్, తదితర దేశాలలో తెలుగు వారున్నారు. అంతర్జాల ప్రభావంగా, అమెరికా, ఇంగ్లాండ్, ఐరోపా దేశాలలొ మనవాళ్ళ సంఖ్య గణనీయముగా పెరిగింది. ఈ వలసలన్నీ ఉద్యోగావకాశాలు వెదుకుతూ వెళ్ళిన బాపతు. స్వాతంత్రా నంతరం పెద్ద, పెద్ద నీటి పారుదల ఆనకట్టలు ఏర్పడడంతో పంజాబ్ లొని బాక్రానంగాల్ మొదలు, కేరళలోని మాళంపూళా వరకు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ, ఉభయ గోదావరి రైతాంగం కదిలి వెళ్ళింది. కొట్టాలలొ నివసిస్తూ, "హరిత విప్లవం" లో ప్రముఖ పాత్రం పోషించారు.
ఇక యాత్రల మాటాకు వస్తే కాశీలో హిందీ తరువాత అతి ఎక్కువ దూకాణాల నామఫలకాలు ఉండేది తెలుగులోనే. దాదాపు 10-15 తరాలుగా అక్కడ ఉంటూ, ‘శ్రీనాథ కవి సార్వభౌముడు మన ఇంట్లోనే మకాం ఉన్నాడు; ఇక్కడే కాశి ఖండం రాశాడు’ అనే వారి సంఖ్య చాలా ఎక్కువ. ప్రస్తుతం యాత్రికులలొ కూడా అగ్రస్థానం మనదే. షిరడిలోనూ, మహారాష్ట్ర వాళ్లకు దీటుగా మనం ఉంటాము. నిత్యాన్నదాన సత్రాలు కూడా మనవే ఎక్కువ. అలాగే బదరి, ప్రయాగ, గయాలలో కూడా అంతే. ఈ మధ్య మలెనాడులోని శృంగేరి, హొరనాడు, కళస మరియు కోస్తా కర్ణాటకలోని, కుక్కె సుబ్రహ్మణ్యం, ధర్మస్థల, కోల్లూరు, ముర్డేశ్వర, గోకర్ణ, ఉడుపి క్శేత్రాలలొ మనవాళ్ల సంఖ్య గణనీయముగా పెరిగింది. దేశములొ శ్రీ కృష్ణ దేవాలయాలలో మథురా, ద్వారకా, గురువయ్యారు, ఉడుపి ప్రసిద్ధిజెందినవి. ఉడిపి ఉత్సవాల గురించి తెలుగువాళ్లకి తెలియం కోసమే ఈ వ్యాసం.
ఉడుపి అనగానే శ్రీకృష్ణుడితొ పాటు జ్ఞాపకం వచ్చే వ్యవస్థలు ’ఉడుపి హోటేళ్లు’, ఆ ప్రాంతంనుంచి వచ్చిన బ్యాంకులు( సిండికేట్, కెనరా, విజయ, కొర్పోరేషన్, కర్ణాటక బ్యాంకులు). ఈ వ్యవస్థలు ఒకదానికి ఒకటి ముడి పడి ఉన్నవే. ద్వైత సిద్దాంత ప్రబోధకుడైన మధ్వాచార్య పదమూడవ శతాబ్దములొ శ్రీ కృష్ణ్ణ దేవాలయాన్ని స్థాపించి అక్కడ వచ్చిన బ్రాహ్మణ భక్తాదులకంతా ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించారు. వేదరికాన్ని అధిగమించలేక, ఉత్తమ జీవన విధానాన్ని కాం క్షిస్తూ కింది మధ్య తరగతి బ్రాహ్మణులు అక్క డ వంట పనులు నేర్చుకొని 19 వ శతాబ్దం మధ్య భాగం నుండి, దూర ప్రాంతాలకు వలస వెళ్ళడం మొదలు పెట్టారు. ఇప్పటి పాకిస్థాన్, బంగ్లాదేశ్, బర్మా, సిలోన్ లలోనే మలేషియా, సింగపూర్ వంటి దేశాలలొ స్థిర పడ్డారు. ఫూట కూళ్ళమ్మ వ్యవస్థకు ప్రత్యామ్నాయముగా, ప్రస్తుత ఆధునిక తారా(star) హోటళ్లకు వారిధిగా ’ఉడుపి హోటేళ్లు’ వెలిసాయి.
వీటి గురించి చాలా కథలు ప్రచారములో ఉన్నాయి; ఉదా: గౌరి శంకర్ శిఖరాన్ని, తెన్ సింగ్ నొర్కె, ఎడ్మండ్ హిల్లరీ ఎక్కినప్పుడు, వాళ్ళకి వేడి, వేడి ఇడ్లి చాయ్ ఉడుపి హోటేల్ వాడు అక్కడికి ముందే వెళ్లి సరఫరా చేశాడని. బ్యాంక్ దిగ్గజాలు, సిండికేట్ బ్యాంక్, మణిపాల్ పై కర్ణాటక బ్యాంక్ అధ్యక్షులు సూర్యనారాయణ అడిగ కథనం ప్రకారం- వాళ్ల పూర్వీకులకు"ఏ స్థిరత్వం లేని, పెట్టుబడి లేని, ఏ శిక్షణ లేని ఈ హోటల్ వారు, కట్టు బట్టలతొ, పోయి ఇంత సాహసం చేస్తున్నప్పుడు మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు?" అని. ఎక్కడ పది ఉడుపి హోటళ్లు ఉన్నాయో, అక్కడ ఒక బ్యాంక్ శాఖ తెరిచారు. వ్యాపారం లేక సిబ్బందికి జీతం ఇవ్వడం ఇబ్బంది అయినప్పుడు, "ఆకలయినప్పుడు తిను; నీదగ్గర ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వు" అనే సిద్దాంతం చెప్పి హోటళ్లను బతికించుకున్నారు. తదుపరి రోజులలో, బ్యాంకుల జాతీయీకరణకంటే ముందే, ఈ బ్యాంకులు హోటళ్లను పరిశ్రమగా గుర్తించి చాలా సౌకర్యాలు చేకూర్చాయి. వాటిని ప్రోత్సహించాయి.
ఉడుపి (శ్రీ కృష్ణ దేవాలయం కాదు) మఠం మీద దేవాదాయ, ధర్మాదాయ, శాఖావారి ఆదిపత్యంలో లేదు. అక్కడ మధ్వాచార్యులవారు నియమించిన ఎనిమిది మంది, బ్రహ్మచర్యం స్వీకరించిన యతులు, రెండు నెలకొకరు పూజలు నిర్వహించేవారు. ఆ మఠాలు: 1. పేజావర. 2. పలిమారు. 3. అదమారు. 4. పుత్తిగె. 5. సొధె. 6. కాణియూరు.7. శిరూరు. 8. కృష్ణాపుర.
(ఇవి గాక దేశమంతా మాధ్వ సిద్దాంతానికి సంబందించి 23 మఠాలున్నాయి.) మాధ్వ సిద్దాంత వారసత్వములొ అతిపెద్ద యతులలొ ఒకరైన సోధె మఠాదీశులైన వాదిరాజ తీర్థులవారు (c.1480-c.1600 ) ఈ సాంప్రదాయాన్ని దిద్ది, రెండు సంవత్సరాలకొకరిని పూజకు నియమించారు. వారు 120 సంవత్సరాలు జీవించి, ఐదు సార్లు పర్యాయ పీఠాన్ని ఎక్కినట్లు చరిత్ర చెబుతుంది. ఆ తరువాత అంతటి భాగ్యం సంపాదించిన యతివర్యులు పేజావర మఠాదీశులైన శ్రీ శ్రీ శ్రీ విశ్వేశ తీర్థ శ్రీపాదులవారు (పై ఫోటో). వారు ఐదవ సారి, జనవరి 18, 016న పూజా కైంకర్యాన్ని జేపట్టి మకర మాసం, శుక్ల, పాడ్యమి, జనవరి 18, 2018 న పలిమారు మఠాధీశులైన శ్రీ శ్రీ శ్రీ విధ్యాదీశ తీర్థ స్వామీజీ వారికి అప్పజెప్పారు.
ఈ కార్యక్రమం "పర్యాయ మహోత్సవం" అని ప్రఖ్యాతిజెందింది. ఈ ఉత్సవానికి దేశ నలుమూలలునుండి అసంఖ్యాక భక్తాదులు ఊడుపి చేరుకున్నారు. ఈ ఉత్సవానికి పూర్వ భావిగా పీఠారోహణ చెేయనున్న శ్రీ శ్రీ శ్రీ విద్యాధీశ తీర్థ స్వామిజీ ఇలా ముస్తాబయ్యారు. ఆయన రెండు సంవత్సరాల పాటు దేశ పర్యటన చేసి, అనుచరులకు, భక్తాదులకు ఉత్సవానికే, గాక, రెండు సంవత్సరాల కాలంలో తరచుగా ఉడుపి సందర్శించి శ్రీ కృష్ణుణ్ని దర్శించుకొని, తీర్థ ప్రసాదం స్వీకరించవలసినదిగా ఆహ్వానిస్తారు. అనుచరులు వారి వారి శక్త్యానుసారం కానుక/ సంభావన సమర్పించి సంతృప్తులవుతారు. మధ్య కాలములొ కొన్ని ఇప్పుడు సాంకేతికమైన, పూర్వ కాలంలో ఆవశ్యమైన విధులు, కృష్ణ మఠం ఆవరణలో నిర్వహించారు. 4-12-2016 న వృశ్చిక మాస, శుక్ల పంచమి నాడు, బాళె (అరటీ) మొక్కలు నాటడం; 20-1-2017 న, ధనుర్మాస కృష్ణ పక్షం, అష్టమి నాడు అక్కి (బియ్యం) సేకరించే ముహుర్తం; 27-8-2017. సింహ మాసం, శుక్ల పక్షం షష్ఠి నాడు కట్టీగె (కట్టెల) ముహూర్తం, రథం ఆకారములొ కట్టెలు జోపాసన. 7-12-2017, వృశ్చిక మాసం, కృష్ణ పక్షం బత్త (ఒడ్లు) సేకరణ.
పూర్వకాలంలొ రోజుకి కొన్ని వందల మంది మాత్రమే భోజనం చేసే సమయంలొ రెండు సంవత్సరాలకి కావలిసిన ముడిసరకులను మాత్రమే పోగు చేసుకొనేవారు. అరోజులలో ఎప్పుడంటె అప్పుడు ఈ వస్తువులన్నీ దొరికేవి కూడా కాదు. అరటి తోట పెంచెే స్థలములొ ఇప్పుడు కాంక్రీట్ సభాంగణం నెలకొన్నది. ఈ ఉత్సవాలన్నీ సాంకేతికమయ్యాయి. 1950 దశకమునుండి విద్యార్థులకు ప్రత్యేకమైన భోజన సదుపాయం మొదలయింది. ఇప్పుడు, "చిణ్ణర సంతర్పణె" (చిన్నారుల సంతర్పణ - Midday meal for school children). అన్నికలిపి, ప్రస్తుతం, సగటున ప్రతి రోజు, కుల మతాల భేదం లేకుండా 30,000 మందికి అన్నదానం జరుగుతుంది.
తదుపరి 3--1-2018 న ధనుర్మాసం, కృష్ణ పక్షం ద్వితీయ నాడు, శ్రీ శ్రీ శ్రీ విద్యా ధీశ తీర్థ స్వామీజీ పురప్రవేశం. దేశ నలుమూలలనుండి భక్తాదులు వేల సంఖ్యలొ గుమి గూడి, దాదాపు రెండు కి.మీ. దూరం మానవ హారముతో ఊరు పొలిమేరలొ స్వామీజీకి స్వాగతం పలికి, ఉరేగింపుగా రథవీదిలొ బ్రహ్మాండంగా తోడ్కొని వస్తారు. కుల మతాతీతముగా, అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్న బహిరంగ సభ జరుగుతుంది. వక్తలందరూ రెండు సంవత్సరాల పాటు మఠం విధి విధానాల నిర్వహణలొ వారివంతు సహాయ సహకారాల వాగ్ధానాలు చేస్తారు. స్వామీజీ వారందరికి కృష్ణానుగ్రహ ఆశీస్సులు పలుకుతారు. ఆ నాటినుండి స్వామీజీ తన మఠంనుండి కదలకుండా, ఆంతరంగిక సలహాదారులతొ కలిసి తదుపరి రెండు సంవత్సరాల పాటు, పరిపాలనా విధానాన్ని, అధికారుల నియామకాలు, వనరుల సేకరణ, పౌర సంబంధ విషయాల గురించి సూచనలు ఇస్తూ సలహాలు స్వాగతిస్తూ, చర్చలు జరుపుతూ ఉంటారు.
జనవరి 12 నుండి సప్తోత్సవం: కన్నుల పండువగా ఏడు రోజులు సాగుతుంది. రుచ్యమయిన భోజనం, పూజలు పునస్కారాలు, రథోత్సవం జరుగుతుంది. దూర ప్రాంతములోని బంధు, మిత్ర, బాందవులను, కలుసుకోవడానికి ఇది ఒక సదవకాశం. ఈ రోజులలొ ప్రతి రోజూ, ఉడుపి మరియు దక్షిణ కన్నడ జిల్లాలనుండి భక్తాదులు, బియ్యం, బ్యాళ్ళు, కూరగాయులు, నూనె, నెయ్యి, కొబ్బరికాయితొ సహా వివిధ రకాల వంట సామగ్రి ఉరేగింపుతో పోటా పోటిగా తరలిస్తూంటారు; పూలు, అలంకరణ వస్తువులు కూడా. పర్యాయ సమయంలోనే గాక, తరువాత కూడా వాడుకొవడానికి వీలుగా చెడి పోని వస్తువులను కూడా సేకరిస్తారు.
17,18-1-2018, న మకరమాసం శుక్ల మక్షం, పాడ్యమి పర్యాయోత్సవం నాడు అర్థరాత్రి దాటిన వెంటనే ఏడుగురు స్వామిజీలు, ఉడుపికి 13 కి.మీ దూరాన గల పాజకా క్షేత్రములోని, మధ్వాచార్యులవారు జన్మించి, బాల్యం గడిపిన ఈతగొట్టిన"కణ్వ తీర్థం" లొ స్నానం చేసి, జపానుష్టాలు ముగించి, బ్రాహ్మీ ముహూర్తములొ, పల్లకిపై ఉరేగింపులొ ఊడుపి పయనమవుతారు. పల్లకి మొయ్యడానికి, పోటా పోటి పడతారు ఆబాల గోపాలం; కోటీశ్వరులనుంచి, సామాన్యల దాకా ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులునుండి, దళవాయివరకు. ఈ ఉరేగింపు, సూర్యోదయానికి సరిగ శ్రీ కృష్ణ సన్నిధి చేరుకొన్నప్పుడు ప్రస్తుత పీఠాధిపతి, శ్రీ పేజావర మఠాదీశులైన శ్రీ శ్రీ శ్రీ విశ్వేశ తీర్థ శ్రీపాదులవారు వారికి స్వాగతం పలికి శ్రీ కృష్ణ దర్శనానంతరం "రాజాంగణ" లొ, ఫీఠారోహణ చేయ్య బోయె శ్రీ పలిమారు శ్రీ శ్రీ శ్రీ విద్యాదీశ తీర్థ స్వామీజీ ఆధ్యక్షతన పర్యాయ దర్బార్ మొదలవుతుంది. ఇక్కడ యతీంద్రులు, తమ పర్యాయ కాలములొ వివిధ శాఖల విధి విధానాల, పరిపాలనాధికారుల పేర్లను, మఠానికి, సమాజానికి వెల్లడిస్తారు. తాను చెయ్య బోయె సేవలను ప్రకటిస్తారు. అదే సందర్భంలొ కొందరు సమాజానికి, మఠానికి విశేష సేవలందిచ్చిన మహనీయులకు సత్కారం చేస్తారు. సుమారు ఉదయం ఎనిమిది గంటల సమయములొ కార్యక్రమం ముగిస్తుంది. మరుక్షణమునుండి పరిపాలన చేతులు మారుతుంది. ఈ కార్యక్రమం కనువిందుగా నిన్న ముగిసింది. ఈ మార్పిడి ఎంత సవ్యంగా సాగుతుందంటే వూహించనే లేం. మధ్యాహ్నం ఒంటి గంటకు, దాదాపు లక్షమందికి, మృష్టాన్న భోజనం తయ్యారవుతంది. ఆ నాటినుండి పర్యాయ స్వామీజి రెండు సంవత్సరాల పాటు రథవీధినుండి బయటకు పోకూడదనేది నియమం. కింది ఫోటో నిన్న విద్యాధీశ స్వామీజీని పల్లకిలో తీసుకువస్తున్నప్పటి ఫోటో.)
ప్రజాస్వామ్యానికి ఇది ద్యోతకం. స్వామీజీల మధ్య చిన్న, చిన్న సైద్దాంతికమైన విభేదాలుండినా 800 సంవత్సరాల చరిత్రలొ ఇంతవరకు ఈ సాంప్రదాయంలో ఎక్కడా చిచ్చు కనబడలేదు. అన్ని సవ్యముగా జరిగి పోతుంటయి. పీఠం వదలుకొవడానికి ఎవరూ, తిరస్కరించిన ఉదంతం లేదు. ఇతరుల పరిపాలన పై ఎలాంటి విమర్శలూ లేవు.
యతివర్యులు శ్రీ పేజావర మఠాదీశులైన శ్రీ శ్రీ శ్రీ వెశ్వేశ తీర్థ శ్రీపాదులవారి గురించి రెండు పలుకులతో ముగిస్తాను. 1931లో కర్ణాటక రాష్ట్రంలొ, దక్షిణ కన్నడ జిల్లా, పుత్తూరు తాలుకా, రామకుంజ గ్రామములో జన్మించిన వెంకటరమణ, తన 8 వ ఏట, 1938 లో, హంపీ క్షేత్రంలో సన్యాసం స్వీకరించి వరుసగా 1954, 1968, 1984, 2000, 2016, ఐదు సార్లు పూజా విధులు నిర్వహించారు. వాదిరాజుల తరువాత ఆ సుకృత ఫలం దక్కిన ఏకైక యతివ ర్యులు వీరు కావడం విశేషం. కృశక కాయులైన (దాదాపు 45 కెజిలు) వీరికి అసాధారణమైన సామాజిక స్పృహ ఉంది. రాజ్యాంగం అమలుకు వచ్చిన నాటినుండి అస్పృశ్యత నివారణకొరకు కంకణం కట్టుకొని, ఏ ఊరు వెళ్ళినా, అక్కడ ఒక హరిజనవాడలో పాదయాత్ర చేపట్టడం వారి దినచర్య. అటు సాంప్రదాయానికి లోటు లేకుండా, దర్మాన్ని కాపాడుతూ, ’కాలాయ తస్మీనమః:" భగవానుడి వాక్యాన్ని పరిపాలిస్తున్నారు. ఇంకా ఎన్నెన్నో సంఘ సంస్కరణ కార్యక్రమాలను చేపట్టారు. అన్ని రాజకీయ పార్టిలతో తత్సంబంధం నెరపుతారు. ఎమర్జెస్సి సమయంలో ఇందిరా గాంధీని నిలదిశారు. ఆ నాడు, వాజపేయిగారితోనూ, ఈ నాడుమోదిగారితొనూ సయోధ్య. కర్ణాటకలోని అందరూ ముఖ్యమంత్రులతొ అనుబంధం. కోట్ల విజయ భాస్కర రెడ్డిగారితొ, నందమూరిగారితో స్నేహం. గత పర్యాయానికి, చంద్రబాబుగారు హాజరయినారు. ఇక్కడ ఆంధ్రత్వం నిలబెట్టుకొన్నాం.