ఇదీ కైలాసానికి కాలిబాట...
శ్రీశైలం...ఇలలో కైలాసం అని భక్తుల నమ్మకం.
మన దేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు,అష్టాదశ శక్తి పీఠాలున్నా ఆ రెండు కలిసి ఉండే క్షేత్రాలు మూడు.అవి కాశి,ఉజ్జయిని,శ్రీశైలం..
కానీ ఒకే ప్రాంగణం లో జ్యోతిర్లింగం,శక్తి పీఠమున్న అరుదైన ఆలయం శ్రీశైలం.పూజాపునస్కారాల్లో చెప్పుకునే సంకల్పంలో మేరు పర్వాతానికి దక్షిణభాగంలో శ్రీశైలానికి..అంటూ చెప్పుకోవడం మనకు తెలిసిందే...
ఈ ఆలయ సందర్శనకు వచ్చిన ఆదిశంకరులు ఇక్కడి ఫాలధార-పంచధారల్లో తపమాచరించి శివానందలహరి రాసాడంటారు...ఇక వీరశైవానికీ ఆధారం ఈ స్వామే..అక్కమహాదేవి,హేమారెడ్డి మల్లమ్మ లాంటి భక్తులూ ఇక్కడే శివైక్యం చెందారంటారు.
శాతవాహన,ఇక్ష్వాకు,చాళుక్య,పల్లవుల నుంచి ఎందరో నిర్మాణాలు చేసినా..కాకతీయ ప్రతాపరుద్రుడు,తదనంతర కాలంలో రెడ్డిరాజులు ఆలయ నిర్మాణాలే కాకుండా భక్తుల సౌకర్యం కోసం ఎన్నో నిర్మాణాలు చేసారు.అనవేమారెడ్డి నిర్మించిన వీరశిరో మంటపంలో వీరశైవులు తమ తలలను నరుక్కునేవారట.
ఆ రోజుల్లో దట్టమైన అడవిలో ఉన్న ఈ ఆలయం చేరాలంటే నాలుగు మార్గాల నుంచి రావాలి. ఈ మార్గాలను శ్రీశైల ద్వారాలుగా చెబుతారు..అవి ప్రస్తుతం కడప జిల్లాలోని సిద్ధవటం,మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపురం,ఉమామహేశ్వరం,ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం...
ఎన్నో వ్యయప్రయాసలకోర్చి,చోరులు,కృఊరమృగాల బెడద తప్పించుకుని భక్తులు ఆలయం చేరాల్సి వచ్చేది.
మరీ పాతకాలం సంగతులు కాకపోయినా 1830 లో ఏనుగుల వీరాస్వామయ్య(ఫోటో) గారు రాసిన తొలితెలుగు యాత్రాసాహిత్యం కాశీయాత్ర చరిత్ర వల్ల అప్పటి ప్రయాణ విశేషాలు,మార్గాల గురించి తెలుసుకోవచ్చు.
ఆ పుస్తకంలోని విశేషాలు ఇలా ఉన్నాయి....తిరుపతి..ఒంటిమిట్ట..పుష్పగిరి...అహోబిలం చేరి ఆ తర్వాత మహానంది మీదుగా బండి ఆత్మకూరు చేరాడు...
అక్కడ ఇండ్లు గొప్పవి.ఆవులను పాలుపితుకుటలేదు.దూడలను ఆవులతో మేతకు తోలుతున్నారు.అక్కడివాళ్లకు బర్రెల పాడి ఎక్కువగా ఉంది.పశువులకు తాము కాపురముండే ఇల్లకన్నా చక్కని కొట్టములు కట్టి కాపాడుతున్నారు...వరిధాన్యం లేదు.మెట్టసేద్యమే సమృద్ధిగా పండుతున్నది..శూద్రులు బాగా కష్టపడి పనిచేస్తున్నారు...
ఆ తర్వాత వేలపనూరు చేరాడు...ఇల్లు గొప్పవి.బట్టల అంగళ్లూ ఉన్నాయి.సకలపదార్థాలు దొరుకుతాయి..గ్రామకరణమైన శేషప్ప అన్నదానం చేస్తున్నాడు.
(ఇప్పటి అన్నదానాలు)
ఇక్కడి నుంచి వేంపెంట చేరాడు.అడవి బలిసింది,మృగభయం ఉందని చెప్పాడు.అక్కడి నుంచి ఆత్మకూరు చేరాడు.
కందనూరు(కర్నూలు)నవాబు తాలూకా ఉద్యోగులుండే శివారు స్థలము.ఈ నవాబు కుంఫిణీకి సాలుకు లక్ష రూపాయలు కడుతున్నాడు.అతని రాజ్యం బళ్లారి కలెక్టర్ ఆజ్ఞకు లోబడి ఉంది.ఇక్కడ శ్రీశైలం అర్చకులు,యాత్రచేయాలని వచ్చిన వారి నుండి హాశ్శీలు పుచ్చుకునే నవాబు ముసద్దీలున్నారు.ఇక్కడి నుండి శ్రీశైలం 4 ఆమడలు.మధ్యలో కొన్ని గ్రామాలున్నా పదార్థాలు దొరకవు కాబట్టి శ్రీశైలం చూసి తిరిగి ఇక్కడికి వచ్చేంతవరకు కావలసిన సామానులాన్నీ మరచిపోకుండా తీసుకుని పోవాలి.ఈ యాత్రికుల హాశ్శీలు కందనూరు నవాబుకు చేరుతున్నాయి.శివరాత్రి ఉత్సవంలో శూద్రజనం ఒకరికి 7 రూ,గుర్రానికి 5,అభిషేకానికి 3,వాహనోత్సవానికి ఆ ఉత్సవపు సెలవు(expense)గాక దర్పణ సేవోత్సవానికి రూ.3 పుచ్చుకుంటున్నారు.
కడప దాటిన తర్వాత ఆవుపాలు,పెరుగు చూడాలంటే శ్రీశైలం మీద చూడాల్సిందే..ఇతరప్రాంతాల్లో ఆవు పాలను దూడలకే వదులుతున్నారు.జాగ్రత్తగా పశువులను కాపాడినా ఎద్దులను నెల్లూరు సీమ నుంచి తెచ్చేవారి నుండి 10,20 వరహాలు పెట్టి కొంటున్నారు. ఈ ఆత్మకూరు గ్రామస్థులు చిన్నాపెద్దా ఎందరో యాత్రీకులను చూసినందున వారి ఎడల ఉపకారబుస్ద్ధి లేక అలక్ష్యంగా ఉన్నారు.ఇక్కడుండే వడ్లవారితో 2 రూపాయలకు 3 డోలీలు చేయించాను.
ఆ తర్వాత ఉప్పాడబోయీలను,బోయీలను,కావటివాండ్రను,బంట్రోతులను కిరాయికి తీసుకుని శ్రీశైలానికి బయలుదేరాడు....
రాధాపురము,కృష్ణాపురము,వెంకటాపురము,సిద్ధాపురము అన్న గ్రామాలు దాటి దట్టమైన అడవిలో ఉన్న నాగలూటి చేరాను...ఈ సిద్ధాపురం,నాగలూటిల్లో వేటకు వచ్చిన చెంచులను చూడాలే తప్ప ఇతరులెవరూ కనిపించిన కారడవి అది.
ఈ నాగలూటిలో వీరభద్రస్వామి గుడి ఉంది. ఒక జంగము ఆత్మకూరు నుండి వారానికి రెండుసార్లు వచ్చి పూజచేసిపోతున్నాడు.ఇక్కడ మద్యాహ్న భోజనం చేసి 2గంటలకు బయలుదేరి 5 కోసుల దూరంలోని పెద్దచెరువు కు సాయంత్రం 6 కు చేరాము.నాగలూటి వదలింది మొదలు కష్టమైన కొండ ఎక్కుడు,దిగుడుగా ఉంది ఆ తర్వాత బాగాకట్టిన మెట్లున్నాయి...మళ్లీ దట్టమైన అడవి,రాతిగొట్టు దారిలో ప్రయాణించాము..
ఈ పెద్దచెరువులో పందులు తోలను చాలేపాటి 20 కిరాతకుల గుడిసెలున్నవి. చెరువులో రమణీయ తామర పుష్పాలున్నాయి.
ఆ చెరువుకట్ట మీద వంట,భోజనం చేసుకుని వర్షం వస్తే ఆ గుడిసెల్లో కూర్చోవాలి.ఆ చెంచుబోయీలనే కిరాతకులకు ఒకడు యజమానిగా నాయకుడనే బిరుదు వహించి ఉన్నాడు.వాడు ధర్మాత్ముడు.నవాబు ఆజ్ఞ ప్రకారం మనిషికి 3 రూ.డబ్బు హాశ్శీలు తీసుకున్నా పస్తుగా ఉండేవానికి బియ్యం,పాత్రనిచ్చి వంట చేసుకొమ్మని ఉపచరింపుచున్నాడు.
అక్కడికి 5 కోసుల దూరంలో ఉన్న శ్రీశైలం చేరాము..పెద్దచెరువు దాటాక ఒక కోసెడు ఎగుడుదిగుడుగా ఉంది.మెట్లు ఉన్నాయి.అటుతర్వాత కోసెడు దూరము సమభూమి.ఆ పిమ్మట భీమునికొలను వరకు ఎక్కుడు దిగుడుగా ఉంది.అక్కడ మెట్లు ఏర్పరచి ఉన్నాయి.భీమునికొలను అగాధమైన కొండ దొనలో ఒక వాగు పారుచున్నది.అక్కడ సేద తీర్చుకుని 2000 మెట్ల పర్యంతం మిక్కిలి పొడుగుగా ఎక్కవలసినది.చుట్టూ చూస్తే కళ్లు తిరుగును.ఈ ప్రకారం రెండు కోసులు ఎక్కిన వెనుక సమభూమిలో రాతిగొట్టు గల మార్గము శ్రీశైల పర్యంతం పొవుచున్నది.
ఆత్మకూరు బోయీలకు సంవత్సరానికొకసారి పనిపడుచున్నది కావున నిండా పనిలేక తిరుపతి బోయీల వలే వాడికెపడినవారు కాదు.
శ్రీశైలము గుడికి చుట్టూ గొప్ప పట్టణ ముండెను.ఆ పట్టామంతా పాడుబడి పోయెను.ఇంటింటనున్న బావులు శిధిలములైనవి.వేశ్యాస్త్రీల ఇండ్లు మట్టుకు 360 ఉండినవి.
500 ఏండ్లనాడు అనవేమారెడ్డికి భగవంతుని కటాక్షము చేత బంగారములు పండినవని వాడుక కలిగిఉన్నది.అతడు స్వామి గర్భగృహమునకు,ముఖమంటపమునకు,పైనందులకును,విమానమునకు,ద్వజస్థంభానికి బంగారు మొలాగా చేసిన రాగి తగుళ్లు కొట్టించినాడు.అవి ఇప్పుడు నిండా శిధిలములుగా ఉన్నవి.
శివరాత్రి మొదలు చైత్ర మాసం వరకు ప్రతిదినం పల్లకి సేవ జరుగుచున్నది.చైత్రమాసంలో భ్రామరీదేవికి తామస పూజ చేసి శ్రీశైలం మీద వచ్చి ఉండే జనులు విరామము పొందుచున్నారు.ఆ తర్వాత ఒకరిద్దరు అర్చకులు మాత్రం ఆత్మకూరు నుండి మీర్చిమార్చి వచ్చి ఉందురు.ఎక్కువ దినములుంటే నీళ్లు వంటక రోగములు కలుగును.గుడి సమీపంలో 20 చెంచు గుడిసెలున్నవి.వారు అవి వదలి భాద్రపద మాసంలో వలసపోతారు.
ఈ విధంగా వర్ణిస్తూ ఒక కీకారణ్యమైన బాట నెల్లూరు మీద వచ్చి చుక్కల పర్వతము ఎక్కవలసి ఉంది.మరొక బాట పడమటి దేశస్తులు కృష్ణా నది దాటి రావలసినది.ఆ కృష్ణ కు పాతాళ గంగ అని పేరు.ఆ గంగకు పోవాలంటే రెండు కోసులు ఎక్కిదిగవలెను.మరొక దోవ కంభం,దూపాటి మీద వచ్చి చుక్కల కొండ ఎక్కవలెను.....ఈ ఆత్మకూరు దోవ ఉత్సవసమయాల్లో తప్ప తలచుకొన్నప్పుడు నడవకూడదు...అంటున్నాడు.
ఈ యాత్రా మార్గం ఇప్పుడూ ఉందా?లేకేం?కడప,చిత్తూరు జిల్లాల వాళ్లు నంద్యాల ఆ తర్వాత బండి ఆత్మకూరు మీదుగా ఆత్మకూరు చేరుతారు...కొత్త రోడ్ మార్గాలున్నందున ఈ యాత్రలో వర్ణించిన వేల్పనూరు,వేంపెంట ఎదురు కావు...ఇక కర్నూలు,కన్నడ భక్తులు కర్నూలు,నందికొట్కూరు మీదుగా ఆత్మకూరు చేరుతారు.
మామూలుగా బస్సు ప్రయాణమైతే ఆత్మకూరు దాటి నల్లమల లో ప్రయాణించి(KG ROAD..Kurnool-Guntur Road) మీదుగా ప్రయాణించి ప్రకాశం జిల్లా దోర్నాల చేరుకుని అడవి మార్గం గుండా శ్రీశైలం చేరుతారు.
కానీ లక్షలాది భక్తులు ఈ యాత్రలో చెప్పిన వెంకటాపురం చేరి నాగలూటి మీదుగా పెచ్చెరువు(పెద్దచెరువు),భీముని కొలను మీదుగా....హటకేశ్వరం,సాక్షిగణపతి మీదుగా శ్రీశైలం చేరుతారు.
శివరాత్రికి లక్ష పైచిలుకు భక్తులు కాలి మార్గం గుండా ప్రయాణిస్తారు...ఇక ఉగాది సమయం మండు వేసవిలో కన్నడిగులు రెండు లక్షలకు పైగా ఈ మార్గం గుండా ప్రయాణిస్తారు.
నంద్యాల-ఆత్మకూరు మధ్య....కర్నాటక-కర్నూలు జిల్లాల సరిహద్దు నుంచి తోవ వెంట అనేక అన్నదాన శిబిరాలు,చలివేంద్రాలు వెలుస్తాయి.ఇక నాగలూటి అడవిలో,పెచ్చెరువులో అతి క్లిష్టమైన ప్రయాణం సాగే భీముని కొలను లోయలోనూ అన్నదానం చేస్తారు.
పెచ్చెరువు దాటాక మోకాళ్ల నొప్పులొచ్చే పర్వతాన్ని మోకాళ్ల పర్వతం అని,చుక్కలు కనిపించేలా ప్రయాసపెట్టే పర్వతాన్ని చుక్కల పర్వతం అంటారు....ఇక అంతదాకా హరోం హరా,శివశంకరా అన్న భక్తులు భీముని కొలను ఎక్కుతూ "చెవిటి మల్లయ్యా చేదుకోవయ్యా" అంటూ ఎక్కుతారు...మార్గమధ్యలో ఒకప్పుడు అత్తాకోడళ్లు యాత్రీకులకు మజ్జిగ ఇచ్చిన సత్రాన్ని అత్తాకోడళ్ల సత్రంగా వ్యవహరిస్తారు...భీమునికొలను ఎక్కాక వచ్చే ద్వారం పేరు కైలాస ద్వారం.
ఎప్పుడైనా ఈ యాత్రీకులను చూడాలంటే కన్నడిగులు వచ్చే ఉగాది సమయంలో చూడాలి...వింతవింత విన్యాసాలతో వస్తారు..మండుటెండల్లో చెప్పులు వేసుకోనివారు,అడుగడుగు దండాలవారు,వెనకనడక..కాళ్లను నేలమీద ఉంచకుండా వెదురుబద్దలు కట్టుకుని వచ్చేవారు....ఇలా ఎందరో...భ్రమరాంబాదేవిని ఇంటి ఆడపడుచుగా భావించి చీరెసారె మిరియాలు తీసుకు వస్తారు...
ఇక ఉగాది సమయంలో జరిగే తామస(?)పూజలు బలుల స్థానంలో సాత్విక పూజలు కూష్మాండ బలి,అన్నపురాశిలో కుంకుమ కలిపి నివేదించడం,లక్షలాది నిమ్మకాయలతో తోరణాలు కడుతున్నారు.
సుమారు 200 ఏళ్ల క్రితం వీరాస్వామి నడిచిన బాటలో భూ కైలాస యాత్ర ఇలా నేటికీ కొనసాగుతున్నది.