Asianet News TeluguAsianet News Telugu

వెండితెర వెలుగుతుందా? వెలవెలబోతుందా?

silver screen fading or shining

 

 

అప్పట్లో సుమారు లక్ష జనాభా ఉండే టౌన్ అది.సమయం రాత్రి 8.30.కొన్ని దుకాణాలు సగం షట్టర్ మూసి ఉన్నాయి.ఇంతలో హటాత్తుగా అందరూ ధనాధనా షట్టర్లు మూసెయ్యటం మొదలు పెట్టారు.ఇదేదో మీరు చూసిన సినిమాల్లో ఆ పేట రౌడీ వస్తుంటే మూసినవి కావు.ఆ టౌన్ లోని లేబర్ ఇన్స్ పెక్టర్  టాప్ లేని రిక్షాలో వస్తున్నాడు మరి.

 

ఇదేనా?మీకు వినోదాన్ని అందించిన సినిమాహాల్ల కథా వినండి.

 

అప్పట్లో సినిమా హాల్ యజమానులు టికెట్లను తహశీల్దార్ కార్యాలయానికి పంపేవారు.వాటి వెనకాల సీల్(రబ్బర్ అటాంప్) వేసి ఇచ్చేవారు.ఇక ఆ టికెట్లను ప్రేక్షకులకు ఇచ్చేవారు.ప్రతి షో అయ్యాక ఆ షో టికెట్ల వివరాలు DCR (Daily collection report) లో తరగతులవారీగా రాయాలి.మానవుడికుండే సహజమైన ఆశ..ఆ వివరాలు తక్కువగా రాసి చిలక్కొట్టుడు కొట్టేవారు.ఇప్పటన్ని వ్యాపారాలు లేవు కాబట్టి వాణిజ్య పన్నుల శాఖ వారు సినిమాహాల్ల తనికీకి వచ్చేవారు.ఇక చూడాలి వారి బాధలు.దొరికితే కేసులు పెట్టేవారు.కేసులు తమకు చుట్టుకోకూడదని  యజమానులు మేనేజర్లను పెట్టుకునేవారు. సమాజంలో ఇంతగా వ్యవస్థీకృత అవినీతి లేనిరోజుల్లో అధికారులంటే ఈ విధమైన భయం ఉండేది.

 

మొత్తానికి ఎంత భయమున్నా చిలకొట్టుల్లు జరుగుతుండేవి.సినిమాకు పంపిణీదారుల తరపున ఒక రెప్రెజెంటేటివ్ వచ్చేవాడు.ఇక్కడ DCR collections తక్కువ చూపినా అసలు వసూళ్లు వారి ఆఫీస్(కోస్తాంధ్ర కు విజయవాడ,నైజాం గా వ్యవహరించే తెలంగాణా కు సికింద్రాబాద్,సీడెడ్ గా వ్యవహరించే రాయలసీమ కు గుంతకల్లు కేంద్రాలుగా ఉండేవి)కు తెలిపేవారు.

 

ఒకానొక సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన,ఒక నాటి బాలనటుడు మోహన్ కందా వాణిజ్య పన్నుల అధికారిగా పనిచేస్తూ గుంతకల్లు లోని పంపిణీదారుల కార్యాలయాలు తనిఖీ చేసారు.ఇంకేం తీగలాగితే డొంక కదలినట్టు సినిమా హాల్ లెక్కలకు,ఇక్కడ ప్రత్యేకమైన పుస్తకాల్లో ఉన్న లెక్కలకు పొంతన కుదరలేదు.భారీ జరిమానాలు కట్టమన్నాడు.మొత్తం రాయలసీమ ప్రాంతంలో కొన్నాళ్లు సినిమా ప్రదర్శనలు నిలచిపోయాయి.

సరే...ఆ తర్వాత రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు.ఒక సినీ ప్రదర్శనశాల యజమానిగా సాధకబాదకాలు తెలిసిన వాడు కాబట్టి స్లాబ్ సిస్టం ప్రవేశ పెట్టాడు.దీనిలో కార్పోరేషన్లు,ఇతర మునిసిపాలిటీలను గ్రేడ్లగా విభజించి ప్రాంతాన్ని బట్టి పన్ను చెల్లించే విధానం మొదలు పెట్టారు.దీనిలో సినిమా హాల్ లో ఉన్న మొత్తం సీట్లు,నిండితే వచ్చే కలెక్షన్ ను బట్టి ఇంత శాతం పన్ను కట్టాలని చెప్పారు.అదే సమయంలో ఖైదీ,బొబ్బిలి బ్రహ్మన్న లాంటి సినిమాల నిర్మాతలు,పంపిణీదారులు విపరీతమైన లాభాలు కళ్ల చూసారు.దీనివల్ల ఒకనాటి కమీషన్ కు పంపిణీ చేసే విధానం మారి సినిమాలను కాంబినేషన్లు చూసి కొనే బయ్యర్ విధానం మొదలైంది.

 

రామారావు ప్రవేశ పెట్టిన ఈ విధానం మొదట్లో బాగున్నా ఆ తర్వాత గుదిబండగా మారింది.కారణం వీడియోలు,ఆ తర్వాత టీవీ చానెళ్ల రాక.ఈలోగా డార్విన్ సిద్ధాంతంలా ఒక ఊరిలో కొన్ని ప్రాంతాల్లో ఉన్న సినిమాహాల్లే నిలబడగలిగాయి..మిగిలినవి షాపింగ్ కాంప్ల్క్సులుగా,కళ్యాణ మండపాలుగా,గోడౌన్లగా మారిపోయాయి.ఒకనాడు NTR,ANR లాంటి అగ్రహీరోలు ఏడాదికి 5,6 సినిమాల్లో నటిస్తే కృష్ణ 18 సినిమాల్లో నటించిన రోజులున్నాయి.ఇక జనాల అభిరుచుల్లో మార్పు,కొందరి stardom వల్ల అత్యధిక పారితోషికాలు తీసుకుంటూ ఏడాదికి ఒక్క సినిమాలో నటించడం మొదలైంది.ఒకప్పుడు అగ్ర నటుల సినిమాలతో పాటు చంద్రమోహన్,మురళిమోహన్,రంగనాథ్,ప్రభ లాంటి వారు నటించిన సినిమాలూ వచ్చేవి.ఈ స్లాబ్ పద్దతి వచ్చాక ఆ సినిమాలు కనుమరుగయ్యాయి.ఎంత చేసినా పైరసీ జాడ్యం ఉండనే ఉంది.తన రాజకీయ జీవితం తొలినాళ్లలో సినిమాటోగ్రఫి మంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రైనా సినీ పరిశ్రమ గురించి ఆలోచించలేదు.

 

ఈలోగా ముఖ్యమంత్రైన YSR స్లాబ్ పద్దతిని తీసివేసి మళ్లీ ప్రేక్షకుల సంఖ్యను బట్టి పన్ను కట్టే విధానం తెచ్చాడు.ఇవాళ ఈ మాత్రం సినిమా హాల్లు ఉన్నాయంటే కారణం ఈ మార్పే.అయితేనేం ఈ సారి ఇవన్నీ పెద్దల చేతిలోకి వెళ్లాయి.ఈ పెద్దలు వారంవారం అద్దెలను సినిమాహాల్ యజమానులకు చెల్లిస్తూ మరింత ఎక్కువ అద్దెను పంపిణీదారుల దగ్గర వసూలు చేస్తారు.

 

ఇక కొందరు చిన్న నిర్మాతలు మాకు సినిమాహాల్లు దొరక్కుండా చేస్తున్నారని గగ్గోలు మొదలు పెడితే..మా ఆధీనం లో లేని వాటిలో మీరు ప్రదర్శించుకోండి,మీ బజట్ కు తగిన అద్దె ఇల్లు మీరు చూసుకోవాలి కానీ ఏ బంజారా,జుబ్లీ హిల్స్ లో కావలంటే ఎలా?ఇదో వ్యాపరం అని వీర్ సమాధానం.

 

ఇక సినిమాహాల్ యజమానులు ఈ పద్దతికి ఇష్టపడటానికి కారణం...అంతకు ముందు పంపిణీదారులు కాంబినేషన్లు చూసి సినిమా ప్రారంభం రోజు నిర్మాతలకు అడ్వాన్స్ ఇచ్చేవారు.ఒకప్పుడు ఒక్కో పంపిణీదారునికొక సినిమా హాల్ కే ఇచ్చేవాడు.కానీ ఈ నయా బయ్యర్లు వారిమధ్య ఒక అనారోగ్యకరమైన పోటీ పెట్టి సినిమాలు అమ్మడం,భారీ అడ్వాన్సులు తీసుకోవడం మొదలు పెట్టారు.సినిమా ఫట్టయిందా అడ్వాన్స్ తిరిగిరాదు,కంపెనీ బోర్డ్ తిప్పేస్తారు.ఈ బాధలు పడలేక పెద్దల చేతిలో పెట్టారు.

silver screen fading or shining

ఇప్పుడు మోడీ ప్రవేశ పెడుతున్న ఆర్ధిక సంస్కరణల వల్ల ఏం జరగబోతుంది?

 

అధిక శాతం నల్లడబ్బు లావాదేవీలు జరిగే పరిశ్రమ నిలబడగలుగుతుందా?

 

హిందీ పరిశ్రమలో ఇప్పటికే పెద్ద కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు పంపిణీ,నిర్మాణ రంగంలో ఉన్నారు.అక్కడ నల్ల డబ్బు ప్రవాహం తక్కువైంది.నటీనటుల రెమ్యూనరేషన్లూ లెక్క ప్రకారమే ఉంటున్నా..అగ్రనటుల పర్సనల్ మేకప్ మెన్, అసిస్టెంట్స్ కు ఏ 10 శాతం డబ్బో లెక్క లేకుండా ఇస్తున్నారు.

 

ఇక ఆ సినిమాలు చాలావరకు మల్టిప్లెక్స్ ల్లో మరి ప్రాంతీయ భాషా చిత్రాలు కంపెనీలు కాకుండా వ్యక్తులే నిర్మిస్తున్నారు.నిర్మాణం కోసం భారీ వడ్డీలు వసూలు చేసే ఫైనాన్షియర్లు ఉంటారు..ఇదంతా నల్లధనమే...ఇక అలవికానీ రెమ్యూనరేషన్లు,ఫారిన్ లొకేషన్లంటూ మితిమీరిన ఖర్చులు.పెద్ద నగరాల్లో మల్టీప్లెక్సులు ఉన్నా జిల్లా,తాలూకా స్థాయిల్లో మామూలు సినిమా హాల్లలో ప్రదర్శించాలి.ఇక ఇక్కడున్నదంతా తెగిన టికెట్లను బట్టే పన్ను కాబట్టి గోల్ మాల్ చేసి కలెక్షన్లు రికార్డుల్లో మరోరకంగా చూపించాలి.అంతెందుకు ఆ మధ్య బాహుబలి సినిమాకు 4 షోలు ప్రదర్శించాల్సిన చోట 6 షోలు ప్రదర్శింస్తే,కొన్నిచోట్ల బుకుంగ్ లో అమ్మాల్సిన ధరలకు కొన్ని రెట్లు అధిక ధరలకు అమ్మారు.ఇతర పెద్ద హీరోల సినిమాలకూ ఇదే పరిస్థితి.ఇదంతా లెక్కాపత్రం లేని నల్ల ధనమే.

 

ఇక పోయిన వారం రావలసిన కొన్ని సినిమాల్ను వాయిదా వేయగా మొన్న విడుదలైన ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా టాక్ బాగున్నా కలెక్షన్లు లేవు.ఇదేకాదు నగరంలోని GVK, Inorbit malls లో మొత్తం కొనుగోళ్లు 10% కు పడిపోయాయని వినికిడి.

 

ఇప్పుడంటే జనం ATM ల ముందు నిలుచున్నారనుకున్నా...త్వరలో రామ్‌చరణ్ ధృవ రాబోతోంది...మరి రేపు ఆ సినిమా కొనుగోలు దారులు నిర్మాతలకు,సినిమా హాల్ యజమానులు పంపిణీదారులకు ఏ రకంగా డబ్బు చెల్లిస్తారు.సినిమా విడుదలైనా జిల్లా,తాలూక కేంద్రాల్లో మంచి వసూళ్లు రాబట్టినా అవి పంపే మార్గాలు ఉన్నాయా?

 

ఇక నాలుగు డబ్బులు సంపాదించిన చాలా మందిని ఆకర్షించే రంగం ఇది..పాత నిర్మాణ సంస్థలైన సురేష్,వైజయంతి,వి.యం.సి లాంటి వారే నిర్మాణం ఆపి వేసినా ఎందరో కొత్తవారు,రియల్టర్లు కొత్తగా వచ్చి సినిమాలు నిర్మిస్తుంటారు..మరి రాబోయేరోజుల్లో రియల్టీ రంగమే కుదేలవ్వబోతుంటే కొత్తవారొస్తారా?సినిమా నిర్మాణం అంటేనే 24 కళల సమిష్టి కృషి,ఆయారంగాల్లో పని చేస్తున్నవారు.. పంపిణీదారులు,వారి కార్యాలయ సిబ్బంది,రెప్రెజెంటేటివ్స్,పబ్లిసిటీ,బ్యానర్ తయారి,సినిమా హాల్లలో సిబ్బంది,క్యాంటీన్ కుర్రాళ్లు.....నటులవుదామని వచ్చి కాలం వెళ్లబుచ్చే కళాకారులు...ఏమవ్వబోతున్నారు?

 

ఇక్కడా మల్టీనేషనల్ కంపెనీలు పాదం మోపబోతున్నాయా?కొత్త టాలెంట్,కొత్త లెక్కలు,అంచనాలతో సినిమాలు నిర్మిస్తారా?కానీ కొలతలేసి వండే వంట కాదు సినిమా....ఇక్కడ స్వేచ్చాయుత భావాలుండాలి...ఇంతకూ వెండితెర వెలుగుతుందా?వెలవెలబోతుందా?

 

ఏమో?ఇది విశ్రాంతి మాత్రమే...మిగిలిన కథ కాలమే చెప్పాలి.