Asianet News TeluguAsianet News Telugu

కర్నూల్ ముస్లిం పిల్లగాడి దీపావళి జ్ఞాపకాలు...

many rayalaseema muslim families love to celebrate deepavali festival

దీపావళి..మన దేశంలో కుల మతాలతో సంబంధం లేకుండా పిల్లా పెద్దా జరుపుకునే పండగ ఇదొకటే! ఇప్పుడు పండగంటే పెద్దగా హడావిడి కనిపించటం లేదు. మా బీ.క్యాంప్ కాలనీలో, ముఖ్యంగా మా వీధీలో ఉన్నా నాలుగు సాయిబుల (ముస్లిములు)  కుటుంబాలు(మాతో కలిసి) పెద్ద ఎత్తున పండగా జరుపుకోవటం అప్పట్లో పెద్ద విశేషం! దీపావళికి వారం ముందునుంచే పండగ వాతావరణం మొదలయ్యేది. పిల్లలు ఐదు పది పైసలు (పెద్దల్ని సతాయించి) సంపాయించి ఇదు చిన్న బాంబులో, మందు బిళ్ళల పెట్టెనో కొనుక్కుని కాల్చేవాళ్ళు. అప్పట్లో ఐదు పైసలకు ఒక చిట్టి(మిరపకాయ బాంబు అనేవాళ్ళు) బాంబు వచ్చేది. కాకర పువ్వుత్తుల పెట్టె మహా అయితే రూపాయి! అందరిలాగే మా నాన్న (అమ్మతో డిస్కస్ చేసింతర్వాతనే) దీపావళి బడ్జెట్ డిసైడ్ చేసే వాడు. బడ్జెట్ మహా అయితే పది నుండీ ఇరవై (రూపాయలే!) ఉండేది. క్రమంగా పెరిగి యాభై అయ్యింది. ఆ బడ్జెట్ లో ఏమేం కొనాలన్నది మా అమ్మ డిసైడ్ చేసేది. మందు సామాన్లలో  కాకర పువ్వొత్తులు తప్పనిసరి ( మా అక్క,చెల్లి కోసం). దీపావళి ముందు రోజుల్లో మాత్రం ఎవరన్నా ఇంటికొచ్చిన బంధువులు ఇచ్చే పదో పరకో(పైసలు) తొ మేం దీపావళి వరకు నెట్టుకొచ్హేవాళ్ళం. దీపావళి ముందు రోజు ఒకట్రెండు  బంకుల (ముఖ్యంగా నర్సిమ్ములు బంకు) దగ్గర "రెక్కీ" నిర్వహించే వాళ్ళం. మా మిత్రుల్లో ఒకడు భలే తుంటరి.. తెలివైన వాడు. వాడి ఆధ్వర్యంలో రెక్కీ ఉండేది.. బంకు వాళ్ళు ఏమరుపాటున ఉన్నప్పుడు, ఏ బాంబుల సరమో (అంటే ఇరవై ఉండేవి), మందు బిళ్ళల పెట్టెలో లాఘవంగా తస్కరించి నిక్కరు జేబులోకి నేట్టే వాడు. మాకు భయమేసేది కాని, థ్రిల్లింగా కూడా ఉండేది. తర్వాత అన్నీ వాడే కాల్చే వాడు. పెద్దయ్యాక వాడు టపాసుల అంగడి పెట్టాడు! ఇప్పుడు లేడు.

పండగ ముందు రోజు రాత్రి, వీధి మలుపు తిరిగిం తర్వాత  నాన్న కొట్టే సైకిల్ బెల్లు కోసం చెవులు రిక్కించుకుని ఉండేవాళ్ళం.  నాన్న రాగానే ఊదా రంగు కవరున్న ప్యాకెట్ మా అమ్మకిచ్చేవాడు. అందులోనే మా పండగ అమ్యూనిషన్ (మందు సామాగ్రి) ఉండేదన్నమాట. ఉదయం లేచినప్పటినుండి (ఆ రోజు మాత్రం ఇదు గంటలకే లేవటం) గూట్లో పై అరలో పెట్టిన ప్యాకెట్ మీదనే దృష్టి ఉండేది.   నాన్న ఆఫీస్(!)(  నాన్న వర్క్ హాలిక్. పండగలకు పబ్బాలకు కూడా ఆఫీస్ కెళ్ళిపోయే వాడు) అమ్మ పంపకాలు మొదలెట్టేది. చిన్న బాంబులు,చిచ్చు బుడ్లు, మందు బిళ్ళలు నాకు మా బాషా గాడికి వాడికి సమానంగా పంచేది. మతాబులు, జడల పువ్వులు, కకర పువ్వొత్తులు ఆడ పిల్లల ఆస్తి(ఆ రోజుకు). పాము బిళ్ళలు, విష్ణు చక్రాలు అమ్మ కాల్చేది. తర్వాత మేమూ కాల్చాము. ఇక పది గంటలనుండి మందు గుండు సామాగ్రిని ఎండలో ఆరబెట్టుకోవటం ఒక ప్రక్రియ. అక్కడ మా చెల్లినో, అక్కనో కాపల ఉంచి, వేరే ఇళ్ళకి రౌండ్లకు వెళ్ళి సామాగ్రిని పరిశిలించే వాళ్ళం.
వారం ముందే పెద్ద మార్కెట్ కు వెళ్ళి అమ్మ దివ్వెలు(దీపాలు) తెచ్చేది. చీకటి పడగానే  ఆముదం నూనె దీపాల్లో వేసి వెలిగించేది. (వారమంతా అందరితో పాటు దీపలు వెలిగించటం మాములే). పండగ రాత్రి మాకు అగరు బత్తి వెలిగించి ఇచ్చేది, బాంబులు ముట్టించటానికి. ఇక రాత్రి చూసి చూసి టైం గ్యాప్ ఇచ్చి అన్నీ కాల్చేసిన తర్వాత.. ఇంకా కాలుస్తున్న వాళ్ళ ఇళ్ళకి (అంటే కొంచేం ధనిక వర్గం వాళ్ళన్నమాట) వెళ్ళి చూసి అనందించే వాళ్ళం. పొద్దున్నే మళ్ళీ అన్నీ ఇండ్లకి రౌండ్స్ కి వెళ్ళి పేలకుండా ఉన్న బాంబులు సేకరించి.. ఒక పేపర్లో పెట్టి కాల్చటం ఒక ప్రక్రియ. లక్కుంటే మంచి బాంబులు, ఇతరా సామాగ్రి దొరికేది.. సాయంత్రం వరకు ఇదే నడిచేది..
ఇప్పుడు ఇవన్నీ లేవు. ఆ థ్రిల్లూ లేదు. పండక్కూడా తూ.. తూ మంత్రంగానే జరుపుకుంటున్నారు. హడావిడి ఉన్నా అదీ పండగ రోజు రాత్రి మాత్రమే! ఇప్పుడంతా వెలుగుల్లేని, బాంబుల మోతతో కూడిన కాలుష్య దీపావళే!

(సయ్యద్ సలీమ్ బాష ,రచయిత, కవి, కర్నూలులో ఉంటాడు)