ఆంధ్రలో రాజకీయ ప్రత్యామ్నాయానికి చోటుందా?
పాలకపక్షంగా తెలుగుదేశం మీదా, ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీమీదా, స్ధూలంగా ప్రజల్లో అయిష్టత పెరుగుతున్నది. ప్రజాజీవనంలో గెస్టు అపియరెన్స్ గానే అయినా హీరో పవన్ కల్యాణ్ ఇస్తున్న పర్ఫార్మెన్స్ చూపిస్తున్న ప్రభావం ప్రభుత్వం మీద స్పష్టంగానే కనిపిస్తున్నది. అదేసమయంలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు న్యూస్ టివి డిబేట్లలో పవన్ కల్యాణ్ కాళ్ళు పట్టుకు లాగేసే ప్రయత్నాలు ఇంకా నిర్మాణమే జరగని జనసేన పార్టీ పట్ల రాజకీయపార్టీల్లో ఉన్న 'బెదురు' ని బయట పెట్టేస్తున్నాయి.
నిర్వహణా పరమైన నైపుణ్యాలే తప్ప మేధోపరమైన మద్దతులు ప్రధాన రాజకీయపార్టీలకు దూరమౌతున్న పరిస్ధితి ఆంధ్రప్రదేశ్ లో వ్యాపిస్తున్నది. సమాజశ్రేయస్సుకోరేవారూ, ప్రజాస్వామిక దృక్పధం వున్నవారు, ఆలోచనా పరులు, మేధావులు వారి వారి కార్యక్షేత్రాలనుంచి ప్రభుత్వ లాబీలలో చేరిపోవాలన్న ధోరణి ఇంతకు ముందెన్నడూ తేనంతగా తెలుగుదేశం పాలనలో పెరిగిపోతున్నది. ప్రభుత్వ పధకాలవల్ల ఏర్పడే ఆర్ధిక ప్రయోజనాలను సొంత పార్టీవారికే కట్టబెట్టి పార్టీని ఎప్పటికీ సజీవంగా వుంచుకోవాలన్న తమిళనాడు మోడల్ ను చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో అమలు చేస్తూండటమే ఈ రాజకీయ దివాళా కోరుతనానికి మూలం.తెలుగుదేశంవారి సిఫార్సు లేకపోతే ఆఫీసుల్లో పని జరగని పరిస్ధితి తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని అవినీతిపరులుగా మార్చివేయడానికి దోహదపడుతున్నది. ఇదే మరింత విస్తృతమైతే ఏర్పడే శూన్యాన్ని ఎవరు బర్తీ చేస్తారన్న చర్చ ఎన్నికలకు రెండున్నర ఏళ్ళు ముందుగానే విశ్లేషకుల్లో మొదలైంది.
అయితే, తృతీయ ప్రత్యామ్నాయం లేదా ధర్డ్ ఆల్టర్ నేటివ్ రావలసినంత రాజకీయ శూన్యం ఆంధ్రప్రదేశ్ లో నెలకొని వున్నదా? దేశంలోనే సీనియర్ ముఖ్యమంత్రి, అవకాశంకోసం ఎంతగానైనా వేచివుండే ఓర్పు సహనాలే స్వభావంగా వున్న చంద్రబాబు రెండున్నర ఏళ్ళ పాలనలోనే ప్రజల్ని విసిగిస్తున్నారా? కేవలం ఒక శాతం అంటే ఐదులక్షల ఓట్లతో అధికారం అందుకోలేకపోయిన వైఎస్ జగన్మోహన రెడ్డి రాజకీయాల్లో వ్యక్తిగత అజెండాను పక్కన పెట్టి ప్రజాదృక్ఫధాన్ని ప్రవేశపెట్టగలరా?
తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల పేరుతో రాష్ట్రరాజకీయాలను చంద్రబాబు, జగన్ లే నిర్దేశిస్తున్నారు. ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధాలే లేకుండా తండ్రిగారి అధికార పదవి వల్లే రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో గెలుపు అంచులదాకా వచ్చిన జగన్ తన అధికారాన్ని చంద్రబాబు ఎత్తుకుపోయారన్న భావనలోనే వుండిపోయారు. ప్రజా సమస్యలపై ఆయన ఎన్ని ఆందోళనలు, ఉద్యమాలు, చేసినా అవన్నీ చంద్రబాబుని దుమ్మెత్తిపోసే జగన్ ఉక్రోషపు కార్యక్రమాలుగానే లెక్కతేలిపోతున్నాయి.
హైదరాబాద్ లేని ఆంధ్రప్రదేశ్ ఏర్పడి, రాజధాని లేని రాష్ట్రానికి తెలుగుదేశం పాలనమొదలై రెండున్నర ఏళ్ళు కావస్తున్నది. రాజధాని ''ఇలా వుండాలి'' అని ముందగానే నిర్ణయించుకున్న చంద్రబాబు తన ఊహలకు రూపం ఇవ్వడానికే, ఆశించిన తీరులో ఆర్ధికంగా సహకరించని మిత్రపక్షమైన బిజెపి సారధ్యంలోని కేంద్రప్రభుత్వంతో లాబీయింగ్ చేయడానికే ఆయన కాలమంతా గడచిపోతున్నది.
ఈ వాతావరణమంతా కలగలసి ఎవరి ప్రాధాన్యతలు వారివే! ప్రజల ప్రాధాన్యతలను ఇద్దరూ పట్టించుకోవడం లేదు అనేభావన జనసామాన్యంలో వినిపిస్తున్నది. అపనమ్మకం పెరుగుతూండటం వల్ల చంద్రబాబు, జగన్ చెప్పే మాటలు మనస్ఫూర్తిగా అంటున్నవని జనం భావించడంలేదు. ఇదే సమయంలో ప్రజలమనోభావాల నుంచి స్పందిస్తున్న పవన్ కళ్యాణ్ మాటలు హృదయపూర్వకమని జన సామాన్యానికి విశ్వాసం కలుగుతున్నది.
ఇది మాత్రమే పవన్ పార్టీని రాజకీయ ప్రత్యామ్నాయంగా నిలబెట్టలేదు. ''ఆయన చిత్తశుద్ధి ని దృష్టిలో వుంచుకుని ప్రజాశ్రేయస్సు కోసం చేపట్టే కార్యక్రమాల్లో ఆయనతో కలసి పని చేయగలమని'' సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. సిపిఎం కూడా ఇదే ఆలోచనను బయటపెట్టింది. ప్రజాహిత కార్యక్రమాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలసి పని చేయడానికి ఈ రెండుపార్టీలూ విడివిడిగా గతంలోనే సంకేతాలు పంపినపుడు జగన్ పట్టించుకోలేదు. ఉమ్మడిపోరువల్లే ప్రత్యర్ధిని బలహీన పరచడం సుళువని జగన్ గ్రహించే సరికి ఈ రెండు పార్టీలూ పవన్ కల్యాణ్ పార్టీ వైపు ఆసక్తిని ప్రదర్శించాయి.
వీటన్నిటికీ మించి కులబలం పవన్ కల్యాణ్ కు అదనపు శక్తి అవుతున్నది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో 14 శాతం వరకూ వున్న కాపు,బలిజ, ఒంటరి, తెలగ కులాలవారిది ప్రాబల్యం వున్న సామాజిక అంశం మాత్రమే. 13 జిల్లాల నవ్యాంధ్రప్రదేశ్ ఇది 22 శాతం కావడంతో ఈ కులాలకు ప్రాబల్యం మాత్రమే కాక బలం కూడా పెరిగింది.
అగ్రవర్ణాల్లో పేదకులం, పేద కులాల్లో అగ్రకులం అయిన కాపు మద్దతు పవన్ కల్యాణ్ కే వుంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. దాన్ని అందిపుచ్చుకోడానికి ''జనసేన'' అన్ని విధాలా సిద్ధమైతే అది రాష్ట్రానికి రాజకీయ ప్రత్యామ్నాయం కాగల అవకాశమైతే వుంది.
అయినా కూడా , తెలుగుదేశానికి వున్న అవకాశాల ముందు మరో ఆల్టర్ నేటివ్ పుట్టుకు రావడం చిన్నవిషయం కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇప్పటికే చనిపోయింది. కమ్యూనిస్టు ఉద్యమాల పట్ల ప్రజలకు ఆసక్తి, మర్యాదలు వున్నాయికాని. కమ్యూనిస్టు పార్టీల పట్ల గౌరవంలేదు. ప్రత్యేక హోదా విషయంలో చేసిన మోసం వల్ల బిజెపికి భవిష్యత్తు లేదు.
తగాదా పెట్టుకోవడం బాబు స్వభావమే కాదు. అదేసమయంలో భారమౌతున్న స్నేహాన్ని, వొద్దనుకున్న క్షణంలోనే కట్ చేసుకోగల తెగువ కూడా ఆయన తత్వమే!
''నిధులు లేకపోయినా, ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా కలసి రాకపోయినా, కేంద్రం సహకరించకపోయినా అంత చేశాను, ఇంత చేశాను అని చెప్పుకోడానివీలుగా చంద్రబాబు ప్రభుత్వం పధకాల్ని, కార్యక్రమాల్ని అమలు చేయడం మొదలు పెట్టింది. ఇన్ని ప్రతికూలతల మధ్య అన్నీ నెరవేర్చడానికి మాకు వ్యవధి చాలలేదు. మరో అవకాశం ఇవ్వండి'' అన్నదే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధన అవుతుంది.
జగన్ తో పోల్చినపుడు కొంత ఆశావహంగా కనిపిస్తున్న పనన్ -అంతకు మించి, ఆచరణాత్మకమైన కార్యక్రమాన్ని ప్రజల ముందు వుంచితే తప్ప, లేదా ఏదో బలమైన ఎమోషన్ ప్రజల్లో వ్యాపిస్తే తప్ప '' మరో అవకాశం ఇవ్వండి అనే చంద్రబాబు అభ్యర్ధనను కాదనడానికి జనం ముందు ప్రస్తుతానికైతే ఏ పాయింటూ లేదు.