CEO వర్సెస్ రాజు
రాజు X CEO
ప్రజలు X Human Resources
ఈరోజుల్లో భారతదేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఆ రాష్ట్రానికి రాజులాంటి వాడు అనటంలో సందేహం లేదు. గవర్నర్ గారిది దాదాపు ప్రేక్షకపాత్రే అని మనం అనుకుంటూ ఉంటాం కూడా.
కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగారైన చంద్రబాబుగారికి తనను తాను రాజుగా భావించుకొనడం కంటే, CEO గా వర్ణించుకొనడమంటే భలే ఇష్టం అని అందరికీ తెలిసిన విషయమే! రాజుగారికి ప్రజలు ఎలాగో, ఓ కంపెనీ సీఈఓ గారికి మానవవనరులు అలాగ! ఈ లెక్కన చూసుకుంటే ఒక పరిపాలకుడు రాజుగారిలా ఉండటం మంచిదా లేక కంపెనీ CEO లా ఉండటం మంచిదా అనేది చూద్దాం.
మహాకవిగా పేరెన్నికగన్న కాళిదాసు రఘువంశం అనే ఒక మహాకావ్యాన్ని వ్రాశాడు. అది ఆ వంశంలోని రాజుల పరంపర యొక్క చరిత్ర. లోకంలో ఎంతోమంది రాజులు ఉండగా ఆ వంశపు రాజులగురించి మాత్రమే ఆయన ఎందుకు వ్రాసినట్టు? ఆ సందేహం ఎవరికైనా వస్తుందేమో అని ఆయన ముందే ఆలోచన చేసి,
రఘూణామన్వయం వక్ష్యే తనువాగ్విభవోsపి సన్।
తద్గుణైః కర్ణమాగత్య చాపలాయ ప్రచోదితః।। (రఘువంశం 1.9)
(ఆ రఘువంశరాజుల గుణాలను విని, ప్రేరణ పొంది, వాటిని వర్ణించగలిగినంత గొప్ప కవితాశక్తి లేకపోయినప్పటికీ, నా చాపల్యం కొద్దీ ఆ పనికి పూనుకుంటున్నాను) అన్నాడు. ఆ రాజుల గుణాలను వర్ణించేంతటి శక్తి అంతటి మహాకవికే లేదట. ఆ మాటలను ఆయన తన వినయం కొద్దీ అన్నప్పటికీ, ఆ వంశపు రాజుల గొప్పతనం ఏమిటో మనకు తెలుస్తుంది. ఆ రాజుల షోడశ గుణాలను సోsహమాజన్మశుద్ధానాం... (1.5) అంటూ మొదలు పెట్టి, యోగేనాన్తే తనుత్యజామ్...(1.8) అని సంక్షిప్తంగా ముగించాడు. సరే, అందులో కొన్ని ఈ కాలానికి తగినవి కావు అని అంటే అనవచ్చు. అందుకని వాటిని ప్రక్కన పెడదాం. కానీ, వారి పరిపాలనా విధానాన్ని మాత్రం ఈనాటి పాలకులు అనుసరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అది ఆదర్శ (Model) పరిపాలనా విధానం.
దిలీపుని పరిపాలనను వర్ణిస్తూ కాళిదాసు ఇలా అంటాడు:
ప్రజానాం వినయాధానాత్ రక్షణాద్ భరణాదపి।
స పితా......।।
తన ప్రజలకు అతడు 1 వినయాన్ని, 2 రక్షణను, 3 పోషణను కల్పించడం వల్ల, వారికి తండ్రిలా వ్యవహరించాడట.
1.1 అసలు ప్రజలు వినయవంతులు కావలసిన అవసరం ఏమిటి అని ప్రశ్నిద్దాం. వినయము అంటే మర్యాదాపూర్వకమైన ప్రవర్తన. సమాజానికి ఆమోదకరమైన ప్రవర్తన. బాధ్యతాయుతమైన ప్రవర్తన. మాతృదేశానికి విధేయుడై ఉండటం మొదలుకొని, సక్రమంగా పన్నులు కట్టడం వరకు బాధ్యతాయుతమైన ప్రవర్తనే కదా, దీనిని వినయం అంటారు. వినయం వలన ఇంకా ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తే -
".... వినయాద్యాతి పాత్రతామ్।
పాత్రత్వాద్ ధనమాప్నోతి ధనాద్ ధర్మం తతః సుఖమ్।।
"వినయం వలన ఆ మనిషికి ఒక అర్హత కలుగుతుంది. అర్హత వలన ఆ మనిషి ధనం సంపాదించుకొనగలుగుతాడు. ఆ డబ్బుతో అతడు ధర్మం చేస్తాడు. ఆ ధర్మం వలన సుఖపడతాడు" - అంటూ మనిషి ఏవిధంగా సుఖం ఆశించాలో చెప్పారు మన పెద్దలు.
ఇక్కడ ధర్మం చేయడం అంటే - అదేదో మతానికి సంబంధించిన విషయం అని మనం అనుకొనవలసిన పని లేదు.
*ధృతిః (అనుకూలతలోనూ, ప్రతికూలతలోనూ కూడా సమానస్థితిలో ఉండటం)
*క్షమా (అర్హులైన వారిని క్షమించగలగటం)
*దమః (తొందరపాటు లేని ఆత్మనిగ్రహం)
*అస్తేయం (ఇతరుల సొమ్మును ఆశించకపోవటం)
*శౌచం (పరిశుభ్రత)
*ఇంద్రియనిగ్రహః (జ్ఞానేంద్రియాలపై, కర్మేంద్రియాలపై అదుపు కలిగి ఉండటం)
*ధీః (వివిధ శాస్త్రాలతో అవగాహన కలిగి ఉండటం)
*విద్యా (తాను ఉంటున్న సమాజంలో తానెవరో, తన విధి ఏమిటో, తన బాధ్యత ఏమిటో తెలుసుకొనగలగటం)
*సత్యం (ఉన్నదానిని ఉన్నట్టు అంగీకరించగలగటం)
*అక్రోధః (ప్రశాంతంగా ఉండగలగటం)
పైన పేర్కొన్న పదీ కూడా ధర్మలక్షణాలు. (మనుస్మృతి 6.91) ఇందులో ప్రతి ఒక్క లక్షణమూ రాజ్యపరిపాలన సక్రమంగా కొనసాగడానికి ఎంతో అవసరమైనది. వీటి వల్ల ప్రజలకు, రాజుకు కూడా సుఖమే కలుగుతుంది. అందువలన ఈ లక్షణాలను పెంపొందించేందుకు రాజు ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ లక్షణాలన్నీ ప్రజలకు వినయం కలిగించడం వల్ల రాజుకు చేకూరుతాయని పెద్దలన్నారని తెలుసుకున్నాము కదా?
సరే, రాజు ఆ వినయాన్ని ప్రజలకు ఎలా చేకూర్చాలి అని ప్రశ్న.
"విద్యా దదాతి వినయం = విద్య అనేది మనిషికి వినయాన్ని చేకూరుస్తుంది."
అని పెద్దలు చెప్పారు. కాబట్టి, రాజు తన రాజ్యక్షేమం కోరి, ప్రజలకు నిర్బంధంగా విద్యను నేర్పించాల్సిన అవసరం ఉంది.
ఒక CEO కూడా తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ట్రైనింగ్ పేరిట అందించేది కూడా ఒక రకమైన విద్యే కదా? ఆ విద్య వలన తన సంస్థకు లాభం అనే కదా, అతను ఆ పని చేసేది? ఆ రకంగా, లేదా అందువలన, ప్రజలందరినీ విద్యావంతులుగా చేయవలసిన ఆవశ్యకత నేటి పాలకులమీద ఎంతైనా ఉంది. విద్యావ్యవస్థను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం వలన ఆ శక్తులు దేశానికి ఉపయోగపడే మనుషులను తయారుచేయకుండా ఆయా కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే మనుషులను తయారుచేయడంలో నిమగ్నం అవుతాయి. అలా జరగకుండా దేశక్షేమం కోరే రాజు విద్యావ్యవస్థను స్వయంగా ప్రభుత్వాధీనంలోనే నడిపించాలి.
స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచిపోతున్నా మన విద్యావ్యవస్థ ఏడ్చినట్టే ఉండటానికి కారణం మన పూర్వీకులు ఆశించిన శాస్త్రీయవిద్యను (Scientific Education) వెనక్కు త్రోసి, గుమాస్తాలను తయారు చేసే మెకాలే విద్యను నిరాటంకంగా కొనసాగించడమే కారణం అనడంలో అని కొందరు వాపోవడంలో నిజం లేకపోలేదు. భారతీయులు మొదటినుండి ఎప్పుడూ కూడా సైన్స్ ను గాని,నూతనవిధానాలను గాని నిష్కారణంగా నిర్హేతుకంగా నిరాకరించలేదని విమర్శకులు ఇక్కడ గుర్తుంచుకోవాలి. కాబట్టి, నేటి పరిపాలకులు భారతీయాత్మను ప్రతిఫలించే విద్యావ్యస్థను పటిష్టపరచి, నేటి కాలానికి అనుగుణమైన విద్యను తమ ప్రజలకు అందించే ప్రయత్నం చేయాలి. (ఇంకా ఉంది)
(* శ్రీనివాస కృష్ణ తిరుపతి రాష్ట్రీయ సంస్కత విద్యా పీఠంలో ప్రాచీన మేనేజ్ మెంట్ పాఠ్యాంశం బోధిస్తారు)