విశాఖ పాత సెంట్రల్ జైలు పార్క్ ను కాపాడుకుందాం
విశాఖలోని ఓల్డ్ సెంట్రల్ జైలు భూమిని ప్రయివేటు సంస్థలకు బదలాయించే ప్రయత్నాలు గతంలో ఎన్నో జరిగినా, ప్రజా స్పందన, ఇతర ప్రజా సంఘాల ఉద్యమాలవలన ఆ ప్రయత్నాలు ఎలా విఫలమయ్యాయో ప్రజలకు తెలుసును.
సెంట్రల్ జైలు భూమి లో 20 ఎకరాలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక మంచి పార్కుగా అభివృద్ధి చేయమని 2010 లో ఆంధప్రదేశ్ హై కోర్టు ప్రభుత్వాన్ని వుడాని ఆదేశించింది.
ప్రజా సంఘాలు ఏక కంఠంతో వుడా వారిని కోరే విషయాలు (i) ఆ 20 ఎకరాలలో ఉన్న ప్రతి ఒక్క పురాతన వృక్షాన్ని పరిరక్షించాలి, (ii ) అక్కడ ఎటువంటి సిమెంటు కాంక్రీటు పనులను చేపట్టవద్దు (iii) ప్రయివేటు కాట్రాక్టర్లను ప్రవేశపెట్టవద్దు, (iv) సౌర శక్తి మీద పనిచేసే లైట్లను మాత్రమే ఉపయోగించాలి, (v )పిల్లలకు పెద్దలకు అవగాహన కల్గించే విధంగా, విశాఖ పట్నం చరిత్రను, జైలులో నిర్బంధించబడ్డ స్వాతంత్ర యోధులు, ముఖ్యంగా అల్లూరి సీతారామ రాజు వంటి మహానుభావుల చరిత్రను ప్రతిబింబించే ఫలకాన్ని మాత్రమే అక్కడ ప్రదర్శించాలి, (vi )ప్రజలకు అందరికీ అందుబాటులో పార్కును ఉంచాలి.
ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రయివేటు కాట్రాక్టర్లను పెద్దఎత్తున ప్రవేశపెట్టి, దుబారా ఖర్చులతో, అనవసరమైన సిమెంటు కాంక్రీటు పనులను, భవన నిర్మాణాలను చేపట్టి, వృక్ష సంపద నాశనం చేసి ప్రజా ధనాన్ని వుడా పక్క దారి మళ్లిస్తున్నది.
ఇపుడు, పార్కును నడపడానికి ఖర్చులు అవుతాయనే నెపంతో, వుడా సెంట్రల్ జైలు పార్కును సందర్శించే ప్రజలమీద పెద్ద ఎత్తున ఎంట్రీ రుసుమును రుద్దబో తున్నారు. ప్రజలకు నష్టాలు చేకూర్చయినా ప్రయివేటు సంస్థలకు లాభాలను కలిగించడమే ప్రభుత్వం, వుడా విధానాలా? .
ఉదాహరణకు, గంగవరం పోర్టును, ఇతర పారిశ్రామిక సంస్థలను జివిఎంసి పరిధినుంచి తప్పించి, ప్రభుత్వం ఆయా సంస్థలకు లాభాలను చేకూర్చింది.
అలాగే , హిందుజా పవర్ సంస్థ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్కు 120 కోట్ల రూపాయల రుసుము చెల్లించవలసి ఉంది, కాని ప్రభుత్వంవాటికి రుసుము మాఫీ చేసి జివిఎంసి కు, విశాఖ ప్రజలకు తీరని నష్టాన్ని కల్పించింది. ఇటువంటి ఆదాయము స్థానిక సంస్థలకు లభించి ఉంటే వుడా కు కాని, జివిఎంసికి కాని వందలాది పార్కులను నడిపించే సామర్ధ్యం ఉండేది. ఈ రోజు, వుడా అన్ని పార్కుల విషయంలో, ప్రజల మీద రుసుములు వేయడం అసమజంసము. రాజ్యాంగంలో మునిపాలిటీలకు ప్రజల కోసం పార్కులు అభివృద్ధి చేయడం, పిల్లలకు ఆదుకోవడానికి మైదానాలు అభివృద్ధి చేయడం ప్రధమ బాధ్యత గా ఉంది. అలాగ చేయకపోతే, మునిసిపాలిటీలు తమ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైనట్లే.
సమాచార హక్కుల చట్టం 4వ సెక్షను ప్రకారం, సెంట్రల్ జైలు పార్కు మీద ఇంతవరకు వ్యయం చేసిన ప్రజా ధనం వివరాలను, ప్రయివేటు కాట్రాక్టర్లకు ముట్టపెట్టిన ముడుపుల వివరాలను, వారితో చేసిన ఒప్పందాల వివరాలను వివరించాలి.
పార్కుకు సంవత్సరానికి ఖర్చుల గురించి, భవిష్యత్తు లో చేసే కార్యక్రమాల గురించి,ఆ కార్యక్రమాలలో ప్రయివేటు సంస్థలకు ఎటువంటి ప్రమేయం ఉంటుందో ఆయా వివరాలను, వుడా ప్రజల సమక్షంలో తానంతట తానే తెలియచేయ వలసి ఉంది,
కాని అటువంటి వివరాలను ప్రజలకు తెలియచేయడము లేదు.
నేను వుడా ను ఉద్దేశించి సమాచార హక్కుల చట్టం క్రింద ఈ వివరాలను నాకు ఇవ్వవలసిందని దరఖాస్తు పెట్టుకున్నాను. నెల గడిచినా , వుడా అటువంటి వివరాలను నాకు ఇవ్వలేదు. కొన్ని రోజుల క్రింద, అదే విషయం మీద వుడా ను ఉద్దేశించి చట్టప్రకారం అప్పీలు కూడా దాఖలు చేసాను. ఇంతవరకు ఆ అప్పీలు మీద కూడా వుడా స్పందించలేదు.
సెంట్రల్ జైలు పార్కు విషయంలో వుడా ఖర్చుపెట్టిన విధానం మీద, కాంట్రాక్టర్లను నియమించిన తీరు మీద తీవ్రమైన సందేహాలు వస్తున్నాయి. ఇందులో పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగాయా అనే సందేహం కూడా కలుగుతున్నది.
సెంట్రల్ జైలు పార్కు విషయంలో కాని, ఇతరత్రా కార్యక్రమాల విషయంలో కాని, వుడా ఖర్చు చేసిన ప్రతి ఒక్క రూపాయి గురించి ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది. మనం అందరము, అటువంటి ప్రశ్నలను అడగాలి. సెంట్రల్ జైలు పార్కు మీద, ఇతర పార్కుల మీద వుడా చేసిన ఖర్చును ప్రత్యేకమైన ఆడిట్ చేయించాలని మనం ప్రభుత్వాన్ని గట్టిగా ఏక కంఠంతో అడగాలి.
ప్రజా స్వామ్య వ్యవస్థలో, ప్రజలకు బాధ్యులము కాదు అని వుడాభావించడం తగదు . అటువంటి వుడా ప్రవర్తనను మనమందరము ఖండించాలి.