ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది. తాలూకా పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ తో ఎస్ఐ అసభ్యకరంగా ప్రవర్తించాడు. డబుల్ మీనింగ్ మాటలతో లైంగికంగా వేధించాడు. 

 ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసులే తోటి మహిళా కానిస్టేబుల్ పై వేధింపులకు పాల్పడ్డ ఈ ఘటన స్థానికంగా చర్చకు దారితీసింది. సదరు ఎస్ఐ నెలరోజుల కిందటే ట్రాన్స్ ఫర్ మీద ఒంగోలు తాలూకా స్టేషన్ కు వచ్చాడు. రాగానే స్టేషన్ లోని తన గదిలో మార్పులు చేయించాడు. ఛాంబర్ కు అడ్డంగా కర్టెన్లు వేయించాడు. దీంతో లోపల ఏం జరుగుతుందో బైటి వారికి కనిపించదు.

ఆ తరువాత స్టేషన్లోని మహిళా కానిస్టేబుల్‌ను తన ఛాంబర్‌కు పిలిచాడు. డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ, అసభ్యకరంగా ప్రవర్తిసూ తీవ్రంగా బాధపెట్టాడు. ఈ వేధింపులు రోజురోజుకూ ఎక్కువవడంతో ఎస్‌ఐ ప్రవర్తనపై ఉన్నతాధికారులకు మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేసింది. దీనిపై వెంటనే స్పందించిన ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ విచారణ చేపట్టారు. 

దేశంలోనే ఏపీలో పోలీసులపై అత్యధికంగా 1681 కేసులు నమోదయ్యాయని జాతీయ నేర గణాంకాల విభాగం తాజా నివేదిక వెలువడిన సమయంలోనే ఈ ఘటన వెలుగులోకి రావడం యాదృచ్ఛికమే కావచ్చు. 

ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ పోలీసులపై గతేడాది పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి ఈ నివేదిక తయారు చేశారు. దేశం మొత్తం మీద 4,068 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇందులో ఒక్క ఏపీ పోలీసులపైనే ఏకంగా 1,681 కేసులు నమోదయ్యాయి.