ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్. ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి దిగిన నేపథ్యంలో ఆయన శనివారం కరీంనగర్ బస్టాండ్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా శ్యామ్‌ప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలో 206 ఆర్టీసీ అద్దె బస్సులు ఉండగా.. 191 బస్సులను  సికింద్రాబాద్, హన్మకొండ, గోదావరిఖని, నిజామాబాద్, సిరిసిల్ల, వేములవాడ తదితర ప్రాంతాలకు నడుపుతున్నామని వెల్లడించారు.

రవాణా శాఖ అధికారులు పనిలోకి తీసుకున్న తాత్కాలిక డ్రైవర్ల పనితీరును పరిశీలించి 195 మందిని విధుల్లోకి తీసుకున్నామని పేర్కొన్నారు. అలాగే 195 మంది కండక్టర్లను తాత్కాలికంగా తీసుకుని బస్సులు నడిపిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

79 విద్యాసంస్థల  బస్సులు, 17 కాంట్రాక్ట్ కారియర్ బస్సులను నడుపుతున్నట్లు జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. ఆయా రూట్లలో వసూలు చేయాల్సిన  చార్జిల వివరాలను దినపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలలో ముందస్తుగానే తెలిపామని శ్యామ్‌ప్రసాద్ పేర్కొన్నారు.

ఇప్పటి వరకు ప్రయాణికుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, బస్సులను ఎలాంటి సమస్యలు లేకుండా నడుపుతున్నట్లు  జేసీ తెలిపారు. సమ్మె వలన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం, పోలీస్ అధికారులు, రవాణా శాఖ, ఆర్టీసీ తగిన ఏర్పాట్లు చేసిందని శ్యామ్‌ప్రసాద్ పేర్కొన్నారు.