చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 14 బాలికపై బంధువులే అత్యంత దుర్మార్గానికి ఒడిగట్టారు. తాతతో ఆడుకుంటున్న మనవరాలిని ముగ్గురు బంధువులు కారులో ఎత్తుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. 

అవమానాన్ని భరించలేక బాలిక ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. చుట్టుపక్కలవాళ్లు కాపాడి ఆమెను కోలారు ఆస్పత్రికి చేర్చారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మంగళం పంచాయతీలోని ఓ పల్లెలో ఓ వృద్ధుడు, ఆమె కూతురు, మనవరాలు నివసిస్తున్ారు. ఈ నెల 10ల తేదీ ఉదయం 11 గంటలకు వృద్ధుడు తన మనవరాలితో ఇంటి వద్ద ఉన్నారు. ఆ సమయంలో బంధువులు హరి, రాజు, మరో వ్యక్తి కారులో వచ్చి బాలికను ఎత్తుకెళ్లారు. 

బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేసి గ్రామ సమీపంలో ఆమెను వదిలేశారు. తీవ్ర అవమాన భారంతో ఇంటికి చేరిన బాలిక చీరెతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. దాంతో ఆమెను పుంగనూరు ఆస్పత్రికి తరలించారు. 

వైద్యుల సూచన మేరకు బాలికను కర్ణాటక రాష్ట్రంలోని కోలారు వైద్య కళాశాలకు తరలించారు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ స్థితిలో బాలిక తల్లి సోమవారం పోలీసులను ఆశ్రయించింది.