ఇంగ్లాండ్ వేదికగా వచ్చే నెల నుండి ప్రపంచ దేశాల  మధ్య క్రికెట్ సమరం ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అయితే ఈ  మెగా టోర్నీ కోసం ఇప్పటినుండే కసరత్తు మొదటుపెట్టిన అన్ని దేశాలు ఆటగాళ్ల ఎంపికలో తలమునకలైపోయాయి. అయితే బిసిసిఐ మాత్రం ఇప్పటికే ప్రపంచ కప్ లో పాల్గొనే భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో స్థానం లభిస్తుందని ముందునుంచి భావించిన తెలుగు ఆటగాడు అంబటి రాయుడికి సెలెక్టర్లు మొండిచేయి చూపించారు. మంచి ఫామ్ లో వున్న రాయుడిని కాదని తమిళనాడు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ కి జట్టులో చోటు కల్పించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

టీమిండియా సెలెక్టర్ల నిర్ణయంపై గుర్రుగా వున్న రాయుడు తాజాగా ట్విట్టర్ వేదికగా వారిపై వ్యంగాస్త్రాలు విసిరారు. ముఖ్యంగా విజయ్ శంకర్ ని ఎంపిక చేయడానికి గల కారణాలను వివరిస్తూ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అతన్ని త్రీ డైమెన్షన్స్‌ ఉన్న ఆటగాడంటూ పొగిడాడు. ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన రాయుడు '' నేను ఇప్పుడు కొత్త త్రీడీ కళ్లద్దాల కోసం ఆర్డర్‌ చేశా. ఈ వరల్డ్‌కప్‌ను ఆ గ్లాసెస్‌తోనే చూడాలనుకుంటున్నా'' అంటూ చురకలు అంటిచాడు. 

ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో రాయుడుకి ఎందుకు అవకాశమివ్వలేదో టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సోమవారం మీడియాకు వివరించారు. రాయుడు ఈ మద్య కాలంలో అద్భుతంగా ఆడుతున్నాడన్న విషయం సెలెక్షన్ కమిటీలోని అందరికీ తెలుసన్నారు. కానీ రాయుడు, విజయ్ శంకర్ లలో ఎవరో ఒకరికే అవకాశమివ్వాలన్న సందిగ్ద సమయంలో సెలెక్టర్లందరూ  శంకర్ కే మద్దతిచ్చారుని తెలిపారు.

అంతేకాకుండా శంకర్ అయితే బౌలింగ్ తో పాటు నాలుగో నెంబర్ బ్యాట్ మన్ గా రాణిస్తాడన్న అభిప్రాయంతో అతడి  వైపు మొగ్గు చూపించారే తప్ప రాయుడు అంటే ఎవరికీ వ్యతిరేకత లేదని పేర్కొన్నారు. విజయ్ శంకర్ త్రీ డైమెన్షనల్ ప్లేయర్( బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) కావడంవల్లే ప్రపంచ కప్ జట్టులో స్థానం కల్పించినట్లు ఎమ్మెస్కే వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపైనే తాజాగా రాయుడు వ్యంగాస్త్రాలు విసిరాడు. 
 
 

సంబంధిత వార్తలు

రాయుడిని సెలెక్టర్లెవ్వరూ వ్యతిరేకించలేదు...అయినా ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే...: చీఫ్ సెలెక్టర్

ప్రపంచ కప్ 2019: నాలుగో స్థానంపై క్లారిటీ ఇచ్చిన బిసిసిఐ

ప్రపంచ కప్ 2019: భారత జట్టు ఎంపికలో గవాస్కర్ అంచనాలు తలకిందులు

వరల్డ్ కప్ జట్టులో రిషబ్‌కు ఎందుకు స్థానం దక్కలేదంటే..: చీఫ్ సెలెక్టర్

ప్రపంచకప్‌ 2019: భారత జట్టిదే, రాయుడికి మొండిచేయి

2019 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. జూన్ 16న పాక్‌తో భారత్ ఢీ