క్రికెట్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ 2019లో తలపడే భారత జట్టును బిసిసిఐ ప్రకటించింది. అయితే కొన్ని అంచనాలను తలకిందులు చేస్తూ కొందరు ఆటగాళ్లు భారత జట్టులో స్థానం సంపాదించారు. ఇలా కేవలం సామాన్య అభిమానులే కాదు భారత ఆటగాళ్ళ ఎంపిక విషయంలో మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వంటి అనుభవజ్ఞుల అంచనాలు కూడా తలకిందులయ్యాయి. 

బిసిసిఐ ప్రపంచ కప్ జట్టును ప్రకటించడానికి ముందే గవాస్కర్ ఈ  మెగా టోర్నీలో ఆడే అవకాశమున్న ఆటగాళ్లను అంచనా వేస్తూ ఓ జట్టును ప్రకటించారు. ఇందులో సామాన్యంగా ఎంపికయ్యే సీనియర్ల విషయంలో ఖచ్చితంగా అంచనా వేసిన ఆయన ప్రశ్నార్థకంగా వున్న ఆటగాళ్ల విషయంలో అంచనా తప్పారు. ముఖ్యంగా రెండో వికెట్ కీపర్ విషయంలో గవాస్కర్ రిషబ్ పంత్ వైపు మొగ్గుచూపగా బిసిసిఐ మాత్రం దినేశ్ కార్తిక్ ను ఎెంపికచేసి అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తింది. 

ఇక స్పెషలిస్ట్ బౌలర్ విషయంలో కూడా గవాస్కర్ అంచనా తప్పింది. ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న దీపక్ చాహర్ ప్రపంచ జట్టులో స్థానం దక్కించుకునే అవకాశముందని గవాస్కర్ పేర్కొన్నారు. కానీ అతడిని కనీసం పరిగణలోకి కూడా తీసుకోని బిసిసిఐ సెలెక్షన్ కమిటీ సీనియర్ ప్లేయర్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు అవకాశమిచ్చారు. 

ఇలా ఇద్దరు ఆటగాళ్ల విషయంలో గవాస్కర్ అంచనాలు తప్పాయి. కానీ మిగతా అందరు ఆటగాళ్ల విషయంలో అతడు ప్రకటించిన ఆటగాళ్లే తుది జట్టులో చోటు దక్కింది. గవాస్కర్ ప్రకటించిన జట్లను ఓసారి పరిశీలిస్తే ఈ విధంగా వున్నాయి. 

గవాస్కర్ అంచనా జట్టు:

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, ఎంఎస్ ధోనీ, కేదార్ జాదవ్, రిషబ్ పంత్, హార్థిక్ పాండ్యా, విజయ్ శంకర్, యుజవేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, దీపక్ చాహర్.
  
బిసిసిఐ ప్రకటించిన తుది జట్టు: 

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్,  దినేశ్ కార్తిక్, కేఎల్  రాహుల్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, విజయ్ శంకర్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, యజువేందర్ చాహల్, జస్ప్రీత్ సింగ్ బుమ్రా, మహ్మద్ షమీ

సంబంధిత వార్తలు

వరల్డ్ కప్ జట్టులో రిషబ్‌కు ఎందుకు స్థానం దక్కలేదంటే..: చీఫ్ సెలెక్టర్

ప్రపంచకప్‌ 2019: భారత జట్టిదే, రాయుడికి మొండిచేయి

2019 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. జూన్ 16న పాక్‌తో భారత్ ఢీ