Asianet News TeluguAsianet News Telugu

పరీక్షలు చేయించుకుంటేనే కాపురానికి రా: భర్తకు భార్య కరోనా వార్నింగ్

ఇంట్లోకి వెళ్దామనుకున్న భర్తకి అతని భార్య అడ్డు తగిలింది. బయట నుంచి వచ్చావు కాబట్టి కరోనా పరీక్షలు చేయించుకొని మాత్రమే ఇంట్లోకి రావాలని అతని భార్య హుకుం జారీ చేసింది. 

Public Awareness: Wife complains on husband for not getting himself tested for coronavirus
Author
Adoni, First Published Mar 29, 2020, 4:19 PM IST

కరోనా వైరస్.... ఈ పేరు చెబితే ఇప్పుడు ప్రపంచం వణికిపోతుంది. ప్రపంచ దేశాలన్నీ దాదాపుగా ఆ వైరస్ బారిన పడ్డాయి. ఆ వైరస్ సోకని దేశం దాదాపుగా లేదంటే అతిశయోక్తి కాదు. ఈ మహమ్మారి ఇప్పుడు భారత దేశంపై కూడా పంజా విసురుతోంది. 

భారత దేశంపై ఈ వైరస్ దండెత్తుతున్న వేళ భారతదేశమంతా ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు కంకణం కట్టుకుంది. దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ లాక్ డౌన్ కొనసాగడంతోపాటుగా రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. 

ఇక ఈ కరోనా మహమ్మారి ఇంతలా బుసలు కొడుతున్న వేళ ప్రజలు సైతం అప్రమత్తమవుతున్నారు. వారిలో చైతన్యం  హర్షించదగ్గ ఒక పరిణామాల. తాజాగా ఇలాంటి ఒక సంఘటన జిల్లా ఆదోనిలో చోటు చేసుకుంది. 

కర్నూల్ జిల్లా ఆదోని కి చెందిన ఒక వ్యతి తెలంగాణలోని మిర్యాలగూడలో క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. లాక్ డౌన్ వల్ల ఇక్కడే చిక్కుబడిపోయిన తరువాత ఎలాగోలా కష్టపడి సొంతూరు చేరుకున్నాడు. 

సొంతఊరు చేరుకున్నాక అతనికి ఊహించని షాక్ తగిలింది. ఇంట్లోకి వెళ్దామనుకున్న భర్తకి అతని భార్య అడ్డు తగిలింది. బయట నుంచి వచ్చావు కాబట్టి కరోనా పరీక్షలు చేయించుకొని మాత్రమే ఇంట్లోకి రావాలని అతని భార్య హుకుం జారీ చేసింది. 

తనకు పిల్లలకు కరోనా సోకకుండా ఉండాలి కాబట్టి కరోనా పరీక్షలు నిర్వహించుకున్న తరువాత మాత్రమే ఇంట్లోకి రావాలని ఆమె తెలిపింది. ఈయన భర్త వినలేదు. ఆమె కూడా భర్తతో గొడవ పడింది. అప్పటికి కూడా భర్త దారికి రాకపోవడంతో చేసేదేమి లేక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 

పోలీసులు భార్య భర్తలిద్దరిని పిలిపించి మాట్లాడి, అతడిని ఆదోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన డాక్టర్ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. 

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా వ్యాపిస్తుండడంతో... ప్రభుత్వం మరిన్ని కఠినమైన చర్యలను తీసుకుంటుంది. తాజాగా, ప్రతి రోజూ ఉదయం 11 గంటల తర్వాత ఇళ్ల నుండి బయటకు రావొద్దని ఏపీ ప్రభుత్వం ప్రజలను కోరింది. నిత్యావసర సరుకులను ఉదయం 11 గంటలలోపుగానే తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని చెప్పారు.

కరోనాపై ఏపీ సీఎం జగన్ ఆదివారం నాడు కేబినెట్ సబ్ కమిటి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని మీడియాకు వివరించారు.

ప్రతి జిల్లాలో మంత్రులు ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొంటూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలని సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు.

నిత్యావసర సరకుల కొనుగోలు కోసం గతంలో మధ్యాహ్నం 1 గంట వరకు సమయం ఉండేది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఈ వెసులుబాటును కుదించినట్టుగా డిప్యూటీ సీఎం చెప్పారు. ఉదయం 11 గంటల వరకే ప్రజలు తమకు కావాల్సిన వస్తువులను మార్కెట్లో నుండి కొనుగోలు చేసుకోవాలని ఆయన సూచించారు. నిత్యావసర సరకుల కోసమని ఉదయం 11 గంటల తర్వాత బయటకు వస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

రాష్ట్రంలో నిత్యావసర సరుకుల కొరత లేదని  డిప్యూటీ సీఎం చెప్పారు. ఏపీ రాష్ట్ర సరిహద్దుల్లో నిలిచిపోయిన ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించినట్టుగా ఆళ్లనాని చెప్పారు. 

also read:ఏపీలో ఒక్క రోజే ఆరు కేసులు: 19కి పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

నిత్యావసర సరుకుల ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. ప్రతి దుకాణం ముందు కాల్ సెంటర్ నెంబర్ ను కూడ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకొంటామని మంత్రి తెలిపారు.

నిత్యావసర సరుకులు ఏ మేరకు స్టాక్స్ ఉన్నాయనే విషయమై కూడ ఆరా తీయాలని సీఎం ఆదేశించినట్టుగా చెప్పారు. మార్కెట్లో ఏ సరుకులు ఏ మేరకు రాష్ట్రంలో ఉన్నాయనే విషయమై సర్వే నిర్వహించినట్టుగా చెప్పారు. ఎన్ని రోజుల వరకు సరుకులు ఉంటాయనే విషయాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని ఆయన తెలిపారు.

మొబైల్ మార్కెట్లను కూడ పెంచాలని కూడ నిర్ణయం తీసుకొన్నట్టుగా మంత్రి కన్నబాబు చెప్పారు.  వ్యాపారులు సరుకులను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని మంత్రి కన్నబాబు హెచ్చరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios