అమరావతి: కరోనా వైరస్ ను మతాలకో, కులాలకో అంటగట్టి నిందలు వేయవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలను ఉద్దేశించి ఆయన శనివారం సాయంత్రం మాట్లాడారు. కులాలు, మతాలకు అతీతంగా రేపు రాత్రి దీపాలు వెలిగిద్దామని ఆయన అన్నారు. ఏ ఆధ్యాత్మిక కేంద్రంలోనైనా అటువంటి సంఘటనలు జరగవచ్చునని ఆయన అన్నారు. 

ఇది ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయమనని, సామాజిక దూరం పాటిస్తూ కోరనావైరస్ పై పోరాటం చేద్దామని ఆయన అన్నారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించవద్దని ఆయన అన్నారు. ప్రస్తుతం జరిగిన సంఘటనను ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన సంఘటనగా చూడవద్దని, దురదృష్టకరమైన సంఘటనగానే చూడాలని ఆయన అన్నారు. ఓ కులానికో, మతానికో అంటగట్టి కావాలని చేసినట్లుగా భావించకూడదని ఆయన అన్నారు. అటువంటి ప్రయత్నాలను దురదృష్టకరమని ఆయన అన్నారు.

అటువంటి ప్రయత్నాలు ఐక్యంగా ఉన్నామని చెప్పడానికి పనికి రావని, మనవారిని మనం వేరుగాచూడకూడదని, ఫలానా మతం వారు అనే ముద్ర వేయకూడదని ఆయన అన్నారు. ఎవరికైనా జరిగే సంఘటనగానే చూడాలని, భారతీయులమంతా ఒక్కటిగానే కనపడాలని ఆయన అన్నారు.

కరోనా కాటుకు కులాలు, మంతాలు, ప్రాంతాలు లేవని జగన్ చెప్పారు ధనిక, పేద తేడా కూడా లేదని, దేశాల మధ్య తేడా కూడా లేదని, కంటికి కనిపించని కరోనాపై అందరం పోరాటం చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ సందేశం ఏ పరిస్థితిలో ఇస్తున్నామనేది అందరికీ అర్థమవుతుందని ఆయన అన్నారు. కావాల్సింది ఒక్కరికొక్కరం తోడుగా ఉండడమేనని ఆయన అన్నారు. కరోనావైరస్ మనల్లో విభేదాలు తేకూడదని ఆయన అన్నారు.